శుక్రాచార్యులు కచుడు – ఆదర్శ గురుశిష్యులు

డిసెంబర్ 29, 2006

(kacha.pdf)

మహాభారతము లోని కథ

ఇది క్షీరసాగర మంథనమునకు పూర్వం జరిగిన కథ. దేవదానవులకు అమృతకలశం అప్పటికింకా లభించలేదు. దేవదానవ యుద్ధాలు అతి భీకరముగా జరిగేవి. ఇరుపక్షాల ఎందఱో సైనికులు అసువులు బాసేవారు. ఇలావుండగా రాక్షసుల గురువైన శుక్రాచార్యుడు తీవ్ర తపస్సుచేసి మృతసంజీవనీ విద్యను సంపాదించాడు. ఇంకేమున్నది? యుద్ధములలో చచ్చిన రాక్షసులను సంజీవనీ విద్య ద్వారా బ్రతికించేవాడు శుక్రుడు. వాళ్ళు మళ్ళీ దేవతలపై పడి పోరుసాగించేవారు. దేవతలు ఎంత బలవంతులైనా ఇలా జరిగేసరికి వారి శక్తి క్షీణించసాగినది. మంచికి అపజయం కలుగుట చూడలేని దేవతాగురువు బృహస్పతుల వారు తన కుమారుడైన కచుని పిలిచి శుక్రుని శిష్యుడవై మృతసంజీవని అభ్యసించిరమ్మని ఆదేశించాడు.

పాపభీతి లేని రాక్షసులతో వ్యవహారము తన కుమారుని ప్రాణాలకే అపాయమని తెలిసికూడా ధర్మస్థాపనార్థం తన కుమారుని ఆ అసాధ్యకార్యము నిర్వర్తించుకొని రమ్మని పంపినాడు బృహస్పతి. పిత్రాజ్ఞాపాలకుడైన కచుడు వెంటనే బయలుదేరి శుక్రాచార్యుని వద్దకు వెళ్ళి సాష్టాంగ ప్రణామము చేసి “గురుభ్యోనమః స్వామీ నేను ఆంగీరస గోత్రజాతుడను. దేవగురువులైన బృహస్పతులవారి తనయుడను. నన్ను కచుడని పిలుస్తారు. విద్యార్థినై మీ వద్దకు వచ్చాను” అని ప్రార్థించాడు. కచుని వినయానికి సంతోషించి శుక్రుడు “నాయనా! వినయవిధేయతలే విద్యార్జనకు ప్రథమ సోపానాలు. నీవంటి అర్హుడిని శిష్యుగా స్వీకరించుట నాకు ఆనందదాయకము” అని ఆశీర్వదించి తన శిష్యబృందములో చేర్చుకొన్నాడు.

కచుడు రోజూ సూర్యోదయాత్పూర్వమే లేచి కాలకృత్యాలు తీర్చుకుని సలిలోదకాలతో స్నానాది క్రియలు నిర్వహించి సంధ్యావందనాది ఆహ్నికాలు యథావిధిగా చేసేవాడు. తీవ్రమైన బ్రహ్మచర్య నిష్ఠను అవలంభిస్తూ ఎంతో ప్రీతితో గురుశుశ్రూష చేసేవాడు. భక్తి ఏకాగ్రతలతో వేదశాస్త్రాలు అభ్యసించేవాడు.

శుక్రాచార్యునికి యవ్వని త్రిలోకసౌందర్యవతి దేవయాని అను పేరుగల కుమార్తె ఉండేది. ఆమె సౌందర్యం అద్వితీయమ్. పైగా కచునిపై మనసుపడింది. కానీ కఠోర బ్రహ్మచర్యవ్రతుడైన కచుడు ఆమెను సరిగా చూడనుకూడా లేదు. కచుడు గురుపుత్రి అయిన దేవయానిని సోదరిగా భావించేవాడు. కచుని వినయం సంస్కారం విద్యలపైనున్న కుతూహలం అతనిని శుక్రునికి ఎంతో ప్రియునిగా చేసినాయి.

కచుని మంచితనం చూచి అసూయతో మిగతా రాక్షస శిష్యులందఱూ సమావేశమై ఇలా అనుకొన్నారు “వీడు మన శత్రువుల పక్షము. వీడికి మృతసంజీవనీ విద్య లభిస్తే అది మనకు అపాయకరము. కనుక వీడిని చంపి పారేద్దాము”. శుక్రుని గోవులను కాచి అడవినుంచి ఇంటికి తిరిగివస్తున్న కచుని నిర్దాక్షిణ్యంగా చంపేశారు ఆ రక్కసులు. కచుడు రావటం ఆలస్యమైనదని చింతించి దేవయాని తండ్రితో “నాన్నా! ఎంత అవసరం వచ్చినా కనీసం సాయంకాల సంధ్యావందన సమయానికైనా ఆశ్రమానికి తిరిగి వచ్చేవాడు కచుడు. కానీ ఇవాళ ఇంత ప్రొద్దెక్కినా ఇంత వరకూ రాలేదు. దయచేసి మీ దివ్యదృష్టితో కచుని జాడ తెలుసుకోండి” అని ప్రార్థించింది. శుక్రుడు దివ్యదృష్టితో జరిగినది తెలుసుకున్నాడు. వెంటనే తన మృతసంజీవనీ విద్యతో కచుని బ్రతికించాడు.

ఈర్ష్యాగ్నిచే జ్వలించబడుతున్న రాక్షసులకు ఈ విషయము తెలిసినది. మరునాడు మళ్ళీ కచుని సంహరించి దేహాన్ని కాల్చి బూడిద చేసి దాన్ని మదిరలో కలిపి వినయంగా శుక్రిని ఇచ్చారు. శుక్రుడు ఆ మదిరను పానముచేశాడు. కచుడు ఎంతకీ రాకపోయేసరికి దేవయాని మళ్ళీ తండ్రితో మొరపెట్టుకున్నది. శుక్రుడు దివ్యదృష్టితో జరిగినది తెలుసుకుని ఎంతో బాధ పడి “ఈ రాక్షసులు చాలా కిరాతకులు. తెలియకుండా నేనెంత తప్పుచేసాను! ఈ మదిరాపానము చాలా ఘోరమైనది. దీని మత్తు ప్రభావము వలన నా వివేచన నశించినది” అనుకొని ఇకపై ఎవరిచే ఇట్టి తప్పులు జరుగరాదని ఈ విధముగా కట్టడి చేసినాడు:

“ఎంత కొంచమైననూ మదిరాపానము చేయరాదు. అది మహాపాపము”. ఇలా ధర్మనియమం తెలియజెప్పి మళ్ళీ ఇలా అన్నాడు “కానీ తెలిసిచేసినా తెలియక చేసినా తప్పు తప్పే కదా! నేను చేసిన తప్పును సరిదిద్దుకొనెదను. మృతసంజీవనీ విద్యను నా కడుపులో సూక్ష్మ రూపములో ఉన్న కచునకు ఉపదేశించెదను. ఆపై అతనిని బ్రతికించెదను. కచుడు నా ఉదరము చీల్చుకువచ్చి మృతుడనైన నన్ను బ్రతికించెదడు”. శుక్రుడు అలాగే చేశాడు. కచుడు శుక్రగర్భం నుంచి బయటకు వస్తూనే గురువు గారిని బ్రతికించినాడు. ప్రణామము చేసి శుక్రుని వద్ద సెలవు తీసుకొని ఇంటికి బయలుదేరినాడు.

అప్పుడు దేవయాని తన ప్రేమను వ్యక్త పఱచి తనను వివాహమాడమని నిర్బంధించింది. అంతట కచుడు “సోదరీ! నీవు నా గురు పుత్రికవు. కావున నాకు చెల్లెలివి అవుతావు. నీకిట్టి అధర్మ కోరిక కలుగరాదు” అని హితవు చెప్పాడు. నిరాకరించిన కచునిపై క్రోధిత అయి దేవయాని కచుని ఇలా శపించినది “నన్ను హింసించిన ఫలముగా ఈ విద్య నీకు ఉపకరించదు పో”! దేవయాని అమాయకత్వాన్ని చూసి ఇలా సమాధానమిచ్చాడు కచుడు

“చెల్లీ! విద్య ఎన్నడూ నిరుపయోగం కాదమ్మా! ఈ విద్య నాకు ఉపకరించక పోతేనేమి? అర్హులైన పరులకు నేర్పి వారికి ఉపయోగపడతాను. సమాజశ్రేయస్సుకై నా విద్య ఉపకరించుట కన్న నాకేమి కావాలి”? అని చెప్పి ఆనందముగా తిరిగి వెళిపోయాడు కచుడు.

పిల్లలూ! మనమీ కథలోని నీతులను మరొక్కమాఱు చూద్దాము:

  1. దేశంకోసం ఒక గ్రామాన్ని, గ్రామం మేలుకై ఒక కుటుంబాన్ని, కుటుంబ శ్రేయస్సుకై ఒక కుటుంబ సభ్యుని త్యజించుట ధర్మము. ఈ సూక్ష్మం ఎఱిగిన బృహస్పతి తన ప్రియ కుమారుని ప్రాణాలను సైతం లెక్కసేయక దేవతలను కాపాడటానికి కచుని రాక్షస గురువు వద్దకు పంపించాడు.
  2. శత్రువని తెలిసి కూడా అర్హుడైన వాడు కాబట్టి కచునికి సంతోషముగా విద్యనేర్పించి ఆదర్శ గురువైనాడు శుక్రుడు. కచుడు శ్రద్ధాభక్తులతో విద్యలను అభ్యసించాడు. దేవయాని పట్ల ప్రవరాఖ్య నిగ్రహం చూపించి ఉత్తమ శిష్యుడైనాడు కచుడు. కావున మనకు ఈ శుక్రకచులు ఆదర్శప్రాయులు కావాలి.
  3. ఈర్ష అనేది పెనుభూతము. మత్సరముచే దారుణముగా కచుని చంపివేసినారు రాక్షసులు. అట్లు చేసి కచునికి సంజీవనీ మంత్రోపదేశం కలుగుటకు చేచేతులారా వారే కారణమైతిరి. వివేకహీనులు తెలియకనే వారికి వారే కీడు కలిగించుకొనెదరు.
  4. మదిరాపానము మహాపాపము (శంఖలిఖితుల కథ చూడండి). ఈ విషయమును మరొక్కమాఱు మనకు తెలియజేశాడు శుక్రుడు.
  5. గురుపుత్రిక సోదరి అని గ్రహించి దేవయానిని సోదరీభావముతో చూసిన కచుని ధర్మజ్ఞత మనకు కనువిప్పు కావాలి.
  6. చోరులచే చోరింపబడనిది అర్హులకు పంచి ఇస్తే పెరిగేదీ విద్యాధనమొక్కటే. విద్య యొక్క గొప్పతనము మనకు కచుని అమృతవాక్కుల ద్వారా ఈ కథలో తెలిసినది. మనమెప్పుడూ సమాజశ్రేయస్సునకే విద్యను ఉపయోగించాలి. విద్యాభ్యాసమునకు సార్థకత అప్పుడే కలుగును.

Search Terms: Kacha, Kaca, Shukra, Sukra, Shukraachaarya, Devayani, Devayaani.


నాడీజంఘుని క్షమాగుణమ్

డిసెంబర్ 27, 2006

(nadijangha.pdf)

మహాభారతము లోని కథ

పూర్వం ఒకానొక గ్రామములో బ్రాహ్మణాధముడొకడు ఉండేవాడు. అతడు తన స్వధర్మమును వీడి వేదశాస్త్రాధ్యయనములు మఱచి చివరికి ఒక బోయదాని వివాహమాడి మాంస భక్షకుడై నిత్యము హింసాజీవితాన్ని గడపసాగినాడు. ఇంద్రియసుఖములే ఉత్తమమనుకొనేవారు విషయవాంఛలతో లోకోపకరమైన ధర్మమును విడనాడి మహాదురితాలను సైతం చేయుటకు వెనుకాడరు కదా!

అతడొకమాఱు ధనాపేక్షతో కొందఱు వ్యాపారులతో కలసి వాణిజ్యార్థము దేశాంతరం వెళ్ళాడు. మార్గమధ్యములో ఒక భీకరకాంతారమును వారు దాటుచున్నప్పుడు మత్తగజమొకటి వారిని తరిమినది. ప్రాణభీతితో వారు తలకొకవైపుకు పరుగులెట్టారు. ధర్మభ్రష్టుడైన బ్రాహ్మణుడలా తన మిత్రులనుండి దూరమై గహనాటవిలో దారిదప్పి తీవ్ర క్షుత్పిపాసలతో సొమ్మసిల్లి ఒక పెద్ద మఱ్ఱిచెట్టు వద్ద కూలబడ్డాడు.

ఆ వృక్షము నాడీజంఘుడనే ధర్మవర్తనుడైన బకరాజు నివాసము. నాడీజంఘునికి “రాజధర్ముడు” అనే సార్థక బిరుదు కూడా ఉన్నది. సృష్టికర్త అయిన చతుర్ముఖుడు నాడీజంఘుని మిత్రుడు. ఆకలిదప్పులతో వచ్చిన భ్రష్టవిప్రుని చూసి నాడీజంఘుడు జాలిపడి అతిథిభావముతో అతని సత్కరించి ఫలోదకాలిచ్చి తృప్తి పఱచినాడు. తన పెద్ద రెక్కలను విసనకఱ్ఱ వలె వీచి సేదతీర్చాడు. అప్పటికే రాత్రి అవడముతో నాడీజంఘుడు విప్రాధమునితో ఇలా అన్నాడు “మహానుభావా! మీరు నాకు మిత్రులైనారు. మిత్రుని బాధలు తీర్చుట కనీస కర్తవ్యము. ఇక్కడికి మూడుయోజనాల దూరములో మధువ్రజమనే రాజ్యమున్నది. దాని రాజైన విరూపాక్షుడు నా ప్రియమిత్రుడు. అతడు రాక్షసుడైననూ పరమశాంతుడు ధార్మికుడు. అతని వద్దకు మీరు వెళితే తప్పక మిమ్ము సత్కరించగలడు. ఱేపు ప్రొద్దున్నే బయలుదేరి వెళ్ళవచ్చు. ఇప్పుడు నిశ్చింతగా విశ్రమించండి”.

అతిథిసేవా నిరతుడైన నాడీజంఘుడిలా వాక్సుధలను చిలికించి బ్రాహ్మణుని వన్యమృగాలనుండి కాపాడుటకై రాత్రంతా మేల్కొని రక్షణనిచ్చాడు. ఉదయాన్నే బ్రాహ్మణుడు మధువ్రజమునకు బయలుదేరినాడు. నాడీజంఘుని మిత్రుడని తెలియగానే విరూపాక్షుని వద్దకు బ్రాహ్మణుని సగౌరవముగా తీసుకువెళ్ళారు మధువ్రజ రాజసేవకులు.

ఒకవ్యక్తి ఆచరించే ధర్మాధర్మాలు భావాలు అతడి ఆకృతిలో స్పష్టముగా ప్రతిబింబిస్తాయి. ధర్మాత్ముడు పైగా రాజు అవడముతో బ్రాహణుడు కులభ్రష్టుడు నీచుడు అని చూడగానే పసిగట్టాడు విరూపాక్షుడు. కానీ నాడీజంఘుని మిత్రుడు అని అతనిని సగౌరవముగా సత్కరించి ఎంతో ధనమిచ్చి పంపించాడు విరూపాక్షుడు. మోయలేనన్ని ధనరాసులను పేరాశతో మోస్తూ తిరిగి నాడీజంఘుని నివాసము చేరాడు పతిత బ్రాహ్మణుడు. నాడీజంఘుడు మళ్ళీ యథావిధిగా ఆతిథ్యమిచ్చి సేదతీర్చాడు. అలసి ఉన్న బ్రాహ్మణుడు ఆదమఱచి నిదుర పోయాడు.

మన జీవన విధానం మన ఆలోచనల్ని బుద్ధిని ప్రభావింపజేస్తుంది (సత్యసంధః కథలో సీతమ్మ చెప్పిన ఋషికథ ఇందుకు నిదర్శనము). కనుకనే భారతీయులు సద్భావ సత్ప్రవర్తనలను ఆచారముల ద్వారా వారి దైనందిన జీవితములలో అలవరచుకుని ఎల్లప్పుడు ధర్మమార్గముననే చరిస్తారు. దయయే స్వభావముగా కలిగి దయాళువు అయినవాడే విప్రుడు. అట్లుకాక నిరంతరము కౄరకర్మములు చేయుట వలన ఆ పతిత బ్రాహ్మణుని బుద్ధి వక్రమైనది. అన్నం పెట్టి ఆదరించి క్రొత్త జీవితాన్ని ప్రసాదించిన నాడీజంఘునిలో పతితబ్రాహ్మణునికి భగవంతుడు కనబడలేదు. ఒక రుచికరమైన భోజనం కనబడింది! బలిష్టమైన నాడీజంఘుని దేహాన్ని బ్రాహ్మణుడు చూచి ఇలా అనుకొన్నాడు “ఱేపటి నుంచి నేను ఇల్లు చేరేలోపల మళ్ళి ఆహారము దొరుకుతుందో లేదో. పైగా ఈ కొంగ బలిష్టముగా ఉంది. దీని మాంసము ఎంతో రుచికరముగా ఉంటుంది. దీన్ని చంపి మాంసము మోసుకు వెళతాను”. వెంటనే దొడ్డుకఱ్ఱ తీసుకొని నాడీజంఘుని తలపై బలంగా కొట్టాడు. ఆ శిరోఘాతానికి అసువులు బాసాడు నాడీజంఘుడు! చర్మం వొలిచి మాంసాన్ని మూటకట్టుకొని ప్రణాయమయ్యాడా దురితుడు.

మనకు ప్రియులైన వారు ఎంత దూరములో ఉన్నా వారికి ఆపద వస్తే మన హృదయం స్పందిస్తుంది. తన ప్రియమితునికి ఏదో కీడుసంభవించిందని తెలుసుకొని విరూపాక్షుడు తన సైనికులను విషయము కనుక్కొని రమ్మని పంపించాడు. వారు జరిగిన దారుణము తెలుసుకొని విరూపాక్షునికి నివేదించారు. అతని ఆజ్ఞపై పతితవిప్రుని బంధించి తెచ్చారు. కృతఘ్నుడు మిత్రద్రోహి అయిన బ్రాహ్మణుని చూచి విరూపాక్షుడు “భటులారా! కృతఘ్నతకు మించిన మహాపాపములేదు. వీడిని ఖండఖండాలుగా నరికి తినివేయండి. రాక్షసులు కాబట్టి మీరు నరమాంసము తినవచ్చు” అని ఆజ్ఞాపించాడు.

“క్షమించండి మహారాజా! ఇటువంటి పాపాత్ముడి మాంసం వాసనకూడా మేము చూడలేము” అని భటులుచెప్పి కుక్కలకు వేశారు. కుక్కలు కూడా ఆ కృతఘ్నుని మాంసము ముట్టలేదు!

నాడీజంఘుని శరీరభాగాలు ఒకచోటచేర్చి దహనసంస్కారాలు యథావిధి కర్మకాండ చెశాడు విరూపాక్షుడు. విధాత తన ప్రియమిత్రుని మరణవార్త విని వెంటనే కామధేనువును నాడీజంఘుని బ్రతికించమని ఆజ్ఞాపించాడు. గోక్షీరములోని అమృతశక్తి ప్రభావముతో నాడీజంఘుడు పునర్జీవితుడైనాడు. బ్రతికిన మిత్రుని చూసి ఎంతో సంతోషించి ఆలింగనము చేసుకొని జరిగినదంతా వివరించాడు విరూపాక్షుడు.

తన ఇంటికి వచ్చిన అతిథి మిత్రుడు అయిన బ్రాహ్మాణుడు సంహరించబడ్డాడని తెలుసుకొని బాధపడ్డాడు నాడీజంఘుడు! వెంటనే బ్రహ్మదేవుని పతితబ్రాహ్మణుని బ్రతికించమని ప్రాధేయపడ్డాడు. విరించి రాజధర్ముని క్షమాగుణాన్ని చూచి అబ్బురపడి అతని ధర్మజ్ఞతకు సంతసించి భ్రష్టవిప్రుని బ్రతికించినాడు. విరూపాక్షుడిచ్చిన ధనము మరల ఇప్పించి సగౌరవముగా బ్రాహ్మణుని ఇంటికి పంపించాడు నాడీజంఘుడు!

ఇది చూసి నాడీజంఘుని మెచ్చుకొని బ్రహ్మదేవుడిలా అన్నాడు “నాడీజంఘుని ఔదార్యముతో ఇప్పుడు బ్రతికిపోయినా ఈ అధమునికి నిష్కృతిలేదు. జన్మజన్మాల వరకూ ఈ మహాపాపము వాడిని క్షోభింపజేస్తుంది. చేసిన కర్మ చెడని పదార్థము. ఫలితమనుభవింపక తప్పదు. ఏ పాపానికైనా నిష్కృతి ప్రాయశ్చిత్తము ఉన్నదేమో కానీ కృతఘ్నతకు మిత్రద్రోహానికి మాత్రం లేదు.

మహాత్మా! రాజధర్మా! ప్రియమిత్రా నాడీజంఘా! నీ క్షమా గుణం అద్వితీయము. దేవతలు సైతం నీకు నమస్కరిస్తారు. శుభంభూయాత్”.

పిల్లలూ! ఈ కథలోని నీతిని మరొక్కమాఱు చూద్దాము:

  1. మన జీవన విధానం మన ఆలోచనల్ని బుద్ధిని ప్రభావింపజేస్తుంది. ఆచారముతోనే ధర్మవర్ధనము జరుగుతుంది. దైవభీతి పాపభీతి లేనివాడు తనకుతానే కాక సమాజానికి కూడా హానికరము. స్వధర్మమును వీడిన బ్రాహ్మణుడు ఎన్నో దురితాలు చేసి భ్రష్టుడైన వైనం మనకు కనువిప్పు కావాలి.
  2. నాడీజంఘుని (రాజధర్ముని) అతిథిసేవ మిత్రవాత్సల్యం క్షమాగుణములు మనకు ఆదర్శప్రాయములు. ధర్మవర్తనులమైతే బ్రహ్మలోక ప్రాప్తి కరతలామలకము అని నాడీజంఘుడు మనకు చూపినాడు.

Search Terms: Nadijangha, Naadii jangha, Virupaksha, Vipruupaaksha.


గౌతముడి ఏనుగు

డిసెంబర్ 23, 2006

(gautamunienugu.pdf)

మహాభారతము లోని కథ

ఒకసారి గౌతమ మహర్షి అడవిలో తపస్సు చేసుకుంటూ ఉండగా తల్లిలేని ఒక ఏనుగు పిల్ల కనిపించింది. స్వాభావికముగా దయార్ద్రహృదయుడైన ఆ గౌతముడు ఏనుగు పిల్ల మీద జాలిపడి దాన్ని ఆశ్రమానికి తీసుకు వచ్చి పెంచుకున్నాడు. కాలక్రమేణ అది పెరిగి పెద్దదయింది. ఇలా ఉండగా ఒకరోజు ధృతరాష్ట్రుడనే మహారాజు గౌతముని వద్దకు వచ్చి ఏనుగును తనకిమ్మని అడిగినాడు. గౌతముడు “తల్లీ తండ్రీ లేని ఈ ఏనుగును నా సొంత బిడ్డలా పెంచుకుంటున్నాను. ఇది నేను లేనప్పుడు నా ఆశ్రమాన్ని పరిరక్షిస్తుంది. యజ్ఞాలకు అడివినుంచి దర్భలు సమిధలు తెస్తుంది. కాబట్టి ఈ ఏనుగును కోరకు” అని చెప్పాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు “నీవు అడిగినన్ని గోవులు కావలిసినంత బంగారము ఇస్తాను. ఈ ఏనుగును నాకు ఇవ్వు” అని అన్నాడు. “రాజా! దీని చిన్నప్పటినుంచి ఎంతో ప్రేమగా పెంచుకుంటున్నాను. నీవు ఎన్ని గోవులిచ్చినా నాకు అక్కరలేదు. మునివేషములో ఉన్న నాకు హిరణ్యముతో అసలు అవసరములేదు” అని బదులిచ్చాడు గౌతముడు.

ధృతరాష్ట్రుడు “మునులకు అవసరమైనవి గోవులుకాని ఏనుగులు కావు. ఐశ్వర్య చిహ్నములైన ఏనుగులు రాజుల వద్దనే ఉండాలి కదా! రాజునైన నేను స్వయముగా వచ్చి ఏనుగును ఇమ్మనినా కాదంటావా?” అని న్యాయం అడిగాడు. అది విని సూక్ష్మబుద్ధి అయిన గౌతముడు “పుణ్యాత్ములు ఆనందించే పాపాత్ములు దుఃఖించే యమలోకానికి వేళదాము రా! యమసభలోనే న్యాయనిర్ణయం జరుగని” అని అన్నాడు.

ధృతరాష్ట్రుడు: “నాస్తికులు పాపాత్ములు సహింపరాని బాధలు పడతారు ఆ దారుణమైన యమలోకములో. నేను రాను.”

గౌతముడు: “సమవర్తి అయిన యమధర్మరాజు వద్దకు వెళదాము. అతనే న్యాయం చెప్తాడు.”
ధృతరాష్ట్రుడు: “అక్కాచెళ్ళెళ్ళను తల్లిదండ్రులను దయతో చూసుకునే వారే ఆయన దగ్గరకు వెళ్ళగలరు. నేను రాలేను.”

గౌతముడు: “అయితే వైకుంఠధామ సమానమైన గంగాతీరానికి వెళదాము. వస్తావా?”
ధృతరాష్ట్రుడు: “అతిథి అభ్యాగతులకు పెట్టి ఆ తరువాత తినే వాళ్ళే అక్కడికి వెళ్ళి పుణ్యం సంపాదించగలరు. నేనెందుకు వస్తాను?”

గౌతముడు: “పోని పవిత్రమైన మేరువనానికి రా!”
ధృతరాష్ట్రుడు: “సత్యము దయ మృదువర్తనము భూతదయ ఉన్నవాడే అక్కడికి వెళ్ళగలడు. వేరే చోటు చెప్పు.”

గౌతముడు: “విష్ణుస్వరూపుడైన నారదుని విహారస్థలానికి వెళదాము. పద! అప్సరసలు కిన్నెరులు ఉంటారక్కడ”
ధృతరాష్ట్రుడు: “సంగీత నృత్యాలతో దేవతార్చన చేసే పుణ్యాత్ములే వెళ్ళగలరక్కడికి. నావల్ల కాదు.”

గౌతముడు: “అలాగా! అయితే దేవతలు విహరించే ఉత్తర కురుభూములకు వెళదాం రా!”
ధృతరాష్ట్రుడు: “కామము హింస మొదలైనవి లేని వాళ్ళు అక్కడికి వెళతారు. వచ్చుట నా తరము కాదు.”

గౌతముడు: “అమృతకిరణాలను ప్రసరించి లోకాలను ఆనందమయము చేసే చంద్రుని వద్దకు వెళదాము. సరేనా?”
ధృతరాష్ట్రుడు: “దాననిరతులు పరమ శాంతచిత్తులు అక్కడికి వెళ్ళగలరు. వచ్చుట నాకు సాధ్యము కాదు.”

గౌతముడు: “సమస్త లోకాలకు అన్నప్రదాత ఆ సూర్యభగవానుడు. ఆయన వద్దకు వెళదాము. దయలుదేరు.”
ధృతరాష్ట్రుడు: “అమ్మో! తపస్స్వాధ్యాయనిరతులే ఆయన దర్శనము చేయగలరు. నన్ను విడిచిపెట్టు.”

గౌతముడు: “పోనీ వరుణుడి దగ్గరకు వస్తావా?”
ధృతరాష్ట్రుడు: “అగ్నిహోత్రము యాగాలు చేసిన వాళ్ళైతే ఆయన దగ్గరకు వెళ్ళగలరు.”

గౌతముడు: “దేవరాజైన ఇంద్రుని సన్నిధిలో న్యాయం అర్థిద్దాము.”
ధృతరాష్ట్రుడు: “శూరులు సోమయాజులు కానీ అక్కడికి వెళ్ళలేరు. నేను రాను.”

గౌతముడు: “ప్రజాపత్య లోకానికి వెళదాము.”
ధృతరాష్ట్రుడు: “అశ్వమేధ యాగాలు చేసిన వాళ్ళకు స్థానమది.”

గౌతముడు: “గోలోకం?”
ధృతరాష్ట్రుడు: “తీర్థాలు సేవించినవారు బ్రహ్మచర్య వ్రతం చేసిన వాళ్ళు గోలోకానికి చేరెదరు. నేనెలా రాగలను?”

గౌతముడు: “సరే! అయితే బ్రహ్మసభకు వెళదాము రా!”
ధృతరాష్ట్రుడు: “అసంగులు (లౌకిక బంధాలు లేనివారు) ఆధ్యాత్మవిద్య తెలిసిన వారు వెళ్ళగలరు అక్కడికి. నావంటి వాడు ఆ లోకము చూడనే లేడు.”

ధృతరాష్ట్రుని విజ్ఞానము చూసి గౌతముడు “మహానుభావా! నీవు దేవేంద్రుడవు. ఏ ఏ పుణ్యాలు చేస్తే ఏ ఏ లోకాలు వస్తాయో దేవేంద్రునికి తప్ప ఇంకెవరికి తెలుసు?” అని పాదాభివందనము చేశాడు గౌతముడు. “అయ్యా! నేను మారువేషం ధరిస్తే దేవతలే కనుక్కోలేరు. మీరు మహానుభావులు కాబట్టి నా నిజరూపం గుర్తుపట్టగలిగినారు. మీరు ఈ ఏనుగుతో సహా స్వర్గలోకానికి వచ్చి మమ్ము ఆనందపఱచండి” అని ప్రార్థించాడు దేవేంద్రుడు. సంతోషించి గౌతముడు తన ఏనుగుతో సహా స్వర్గానికి వెళ్ళాడు.

పిల్లలూ! ఈ కథలోని నీతిని మరొక్కమాఱు చూద్దాము:

ఏ పుణ్యకార్యములు మనము చేయవలెనో తద్వారా ఏ ఏ పాపకార్యములు మనము చేయకూడదో వివరముగా దేవేంద్రుడు మనకు ఈ కథలో బోధించినాడు. (ధృతరాష్ట్రుడు అంటే శరీరమును ధరించినవాడు. అంటే మానవుడు. కాబట్టి మావనుడు ఏ పుణ్యకార్యాలు చేయాలో మనకు ఈ కథలో తెలిసింది) కానీ అందఱూ అన్నీ చేయలేరు. ఉదాహరణకు కలియుగములో అశ్వమేధ రాజసూయ యాగములు చేసే అర్హత మానవులకు లేదు. కాబట్టి అందఱూ చేయదగ్గ పుణ్యకార్యాలు మనము తప్పకుండా చేయాలి: తల్లిదండ్రుల సేవ, అతిథిసేవ, సత్యం, భూతదయ, గీతనృత్యాదులతో దేవతార్చన, దానము, స్వాధ్యాయనము, తీర్థయాత్రలు, బ్రహ్మచర్య పాతివ్రత్యాది వ్రతములు.

Search Terms: Gautama, Indra, Devendra.


ఇంద్రద్యుమ్నుని కథ

డిసెంబర్ 20, 2006

(indradyumna.pdf)

మహాభారతము లోని కథ

పూర్వం ఇంద్రద్యుమ్నుడనే రాజేంద్రుడు ఉండేవాడు. అతడు ఎన్నో దానధర్మాలు చేసి ధర్మాచరణలో తనంతటి వాడు లేడనే ఖ్యాతిని పొందినాడు. లెక్కగట్టలేనన్ని గో భూ హిరణ్య దానములు పాత్రులైన వారికిచ్చి అనంత పుణ్యసంపదను ఆర్జించుకొన్నాడు. రాజర్షి అయ్యి ప్రజారంజకముగా పాలన చేసినాడు. అలా ఎన్నో వర్షములు రాజ్యపాలనము చేసి తన పుణ్యనిధి ప్రభావముతో కాలం చెల్లాక స్వర్గం చేరుకొన్నాడు. చాలాకాలము స్వర్గభోగాలు అనుభవించిన తరువాత ఒకరోజు దేవేంద్రుడు ఇంద్రద్యుమ్నుని పిలిపించి

“మహాత్మా! నీవు అనేక దానధర్మాలు చేసి ఎంతో పుణ్యమును ఆర్జించినావు కనుక ఇంత దీర్ఘకాలము స్వర్గములో ఉండగలిగినావు. కానీ పరమేశ్వరుని శరణువేడి ఆయన కృపతో పోందెడి మోక్షపదము ఒక్కటే శాశ్వతమైనది (ఇతరములు శాశ్వతములు కావు). నీ పుణ్యఫలమును అనుభవించినావు కావున సర్గమును వీడు సమయము వచ్చినది” అని చెప్పినాడు. స్వర్గాధిపతి మాటలు విని ఇంద్రద్యుమ్నుడు ఇంతకొద్ది కాలములోనే తన పుణ్యరాసులు ఎలా కరిగిపోయినాయి? అని ఆశ్చర్యపోయినాడు. అది చూసి శచీపతి “రాజా! భూలోకములో నిన్ను కానీ నీవుచేసిన సత్కర్మలను కానీ గుర్తుపెట్టుకొన్న వానిని నాకు చూపిస్తే నీవు స్వర్గములోనే ఉండవచ్చు. చేసిన దానములు మహనీయములు కాకపోతే జనులు చిరకాలము గుర్తుంచుకొనరు కదా! కావున నీ దానములను ఎంతకాలము ప్రజలు ఉపయోగింతురో అంతకాలము నీవిక్కడనుండవచ్చు” అని హితవు చెప్పినాడు. ఇంద్రుని ఆజ్ఞతీసుకొని అట్టివారు ఉన్నారేమో వెదకటానికి బయలుదేరినాడు ఇంద్రద్యుమ్నుడు.

చిరంజీవి అయిన మార్కండేయ మహర్షి వద్దకువెళ్ళి నమస్కరించి “ఓ తపస్విచంద్రమా! నన్ను మీరు ఎఱుగుదురా”? అని అడిగినాడు. అప్పటికి ఎంతోకాలముగా తీర్థయాత్రలుచేసి ఉపవాస వ్రతాలు చేసి కృశించి ఉన్న మార్కండేయ మహర్షి గుర్తులేదని చెప్పినాడు. అప్పుడు ఇంద్రద్యుమ్నుడు “స్వామి! చిరంజీవులైన మీకంటే ముందుపుట్టిన ప్రాణి ఏదైనా బ్రతికి ఉన్నదా”? అని అడిగినాడు. “పవిత్ర హిమాలయ పర్వత ప్రాంతములో ప్రావారకర్ణం అనే గుడ్లగూబ ఉన్నది” అని బదులిచ్చినాడు మార్కండేయ మహర్షి.

వెంటనే ఆ ఉలూకము వద్దకు చేరి “అయ్యా! నెన్నెఱుగుదువా”? అని ప్రశ్నించినాడు. తెలియదు అని చెప్పి “ఇక్కడికి కొన్ని యోజనాల దూరములో ఇంద్రద్యుమ్నమను సరోవరమున్నది. ఆ సరోవరములో నాడీజంఘమనే కొంగ ఉన్నది” అని ప్రావారకర్ణం చెప్పగా ఇంద్రద్యుమ్నుడు బ్రహ్మదేవుని స్నేహితుడైన నాడీజంఘుని వద్దకు చేరి “ఓ బకరాజా! నన్ను మీరు గుర్తుపట్టినారా”? ప్రశ్నించినాడు. “లేదు. ఈ సరోవరములో ఆకూపారమనే తాబేలు ఉన్నది. అది నాకంటే పెద్దది. దానికి నీవు తెలుసేమో కనుక్కో” అని చెప్పినది.

ఇంద్రద్యుమ్నుని చూడగానే ఆకూపార కళ్ళుచెమ్మగిల్లాయి “అయ్యా! వెయ్యి యజ్ఞములు సాంగముగా చేసి వెయ్యి యూపస్తంభాలు కట్టించినావు. ఆ యజ్ఞదానాలలో లెక్కకట్టలేనన్ని గోదానాలు ఇచ్చినావు. నీవు దానము ఇచ్చిన గోవుల రాకపోకలతో ఈ భూమి దిగబడి యింత సరోవరము అయినది. ఇది అంతా నీ చలవే” అని కృతజ్ఞతాపూర్వకముగా చెప్పినది. మరుక్షణం దేవతలు దివ్యవిమానములో ఇంద్రద్యుమ్నుని స్వర్గానికి తీసుకొని వెళ్ళినారు.

పిల్లలూ! ఈ కథలోని నీతులను మరొక్కమాఱు చూద్దాము:

  1. మన సత్కీర్తి భూలోకములో ఉన్నంత కాలము సర్గలోకము కరతలామలకము. ఆకూపార ఇంద్రద్యుమ్నుడు చేసిన దానములు మరువలేదు కావున ఇంద్రద్యుమ్నునికి పునః సర్గలోక ప్రాప్తి కలిగినది. కానుక మనము నలుగురుకీ ఉపకరించే పనులు చేయాలి. అవియే మనలను రక్షించు సంపదలు (ధనము కాదు).
  2. దేవేంద్రుడు చెప్పినట్టు మోక్షము ఒక్కటే శాశ్వతపదము. ఇంత పుణ్యాత్ముడు కాబట్టే మహావిష్ణువు గజేంద్ర రూపములో ఉన్న ఇంద్రద్యుమ్నునిచే “నీవేతప్ప హితః పరంబెఱుగను …” అని అనిపించి అతనికి శాశ్వతమైన మోక్షమును ప్రసాదించినాడు (గజేంద్ర మోక్షము కథ). కావున మోక్షమునకు పుణ్యమే ప్రథమ సోపానము.

Search Terms: Indradyumna, Gajendra, Indra.


శుచిలేనిది సత్పురుషదర్శనం లభించదు

డిసెంబర్ 17, 2006

(udanka.pdf)

మహాభారతము లోని కథ

వేదప్రవర్తకుడైన పైలమహర్షికి ఉదంకుడను ఉత్తమ శిష్యుడుండెడివాడు. అతడు బ్రహ్మతేజస్సు కలవాడు మహాతపస్సంపన్నుడు. గురుదేవతా అనుగ్రహం వలన అణిమాద్యష్టసిద్ధులు జ్ఞానము పొందిన మహానుభావుడు ఉదంకుడు.

ఒకరోజు గురుపత్ని అతనికి ఒకకార్యమును అప్పచెప్పినది “నాయనా! మనదేశ మహారాజైన పౌష్యుడు ధర్మాత్ముడు. ఆయన ధర్మపత్ని ఉత్తమురాలు. ఒక వ్రతము చేయటానికి నాకు ఆ సాధ్వి కుండలాలు కావాలి. ఆమెను అర్థించి అవి తీసుకొనిరా”. గురుపత్ని ఆజ్ఞను శిరసావహించుటకై ఉదంకుడు వెంటనే ధర్మాత్ముడైన పౌష్యమహారాజు వద్దకు బయలుదేరినాడు. దారిలో అరణ్యమార్గములో వెళుతుండగా ఒక మహావృషభము మీదనున్న దివ్యపురుషుని చూచినాడు. అతడు సూర్యుని వలె వెలిగిపోతున్నాడు. ఆ దివ్యపురుషుడు ఉదంకునికి అనుగ్రహముతో పవిత్రమైన గోమయమును ఆరగించుటకు ఇచ్చెను. అమృతప్రాయమైన గోయమును భుజించి గురుపత్ని ఆజ్ఞ త్వరగా నెరవేర్చుటకై ఆ మహాపురుషుని వద్ద సెలవు తీసుకొని పౌష్యుని రాజ్యమును చేరుకున్నాడు.

పౌష్యుడు ఉదంకునికి యథావిధి సత్కారాలు చేసి రాకకు కారణమేమియో తెలుపుమని ఉదంకుని ప్రార్థించినాడు. ఉదంకుడు తన గురుపత్నిగారి ఆజ్ఞను రాజుకు తెలిపినాడు. “ఆహా! లోకశ్రయస్సును కోరే మీవంటి తాపసులను సేవించుటకంటే అదృష్టమేమున్నది? మహానుభావా నా రాణి వద్దకు వెళ్ళి నా మాటగా చెప్పి కుండలములను తీసుకొనుము” అని పౌష్యుడు చెప్పినాడు. వెంటనే ఉదంకుడు మహారాణిగారి మందిరమును చేరుకున్నాడు. కానీ ఆయనకు ఎక్కడా పౌష్యరాణి కనబడలేదు! తరిగివచ్చి “రాజా! నాకు మహారాణి కనబడలేదు. నీవే ఆ కుండలములను తెప్పించి ఇవ్వు” అని అడిగినాడు.

అప్పుడు పౌష్యమహారాజు ఇలా అన్నాడు “భూవినుత! నీవంటి త్రిభువన పావనుని అశుచివి అని ఎట్లా అనగలను? నా రాణి మహాపతివ్రత కావున అశుచులకు కనబడదు”. ఉదంకుడు ఎందులకు తనకు అశుచి వచ్చినదో ఆలోచించినాడు. తాను గురుపత్నీ కార్యమును త్వరగా పూర్తిచేసే తొందరలో ఆ మహాపురుషుడు ఇచ్చిన గోమయాన్ని భుజించిన తరువాత ఆచమించలేదని గుర్తుకు వచ్చినది. వెంటనే కాళ్ళూ చేతులు అన్ని కడుక్కుని కేశవ నామాదులతో ఆచమనము చేసి శిచియై మహారాణి అంతఃపురమునకు వెళ్ళినాడు. అక్కడ యథాస్థానములో మహారాణిని చూసి ఆమె పాతివ్రత్య మహాత్మ్యమునకు ఆశ్చర్యపోయి “మహారాణీ! మా గురుపత్ని వ్రతార్థము మీ కుండలములు కోరి వచ్చినాను” అని ప్రార్థించినాడు. ఆ పతివ్రతామతల్లి తన కుండలములు ఇట్టి తాపసులకు ఉపకరిస్తున్నాయని సంతోషించి ఉదంకునకు కుండములను ఇచ్చి పంపివేసినది.

పిల్లలూ! ఈ కథలోని నీతిని మరొక్కమాఱు చూద్దాము:

శుచిత్వము సత్పురుషుల సందర్శనమునకు ప్రథమ సోపానము. ఉదంకుడు భోజనము తరువాత తొందరలో ఉండి కాళ్ళుకడుక్కుని ఆచమించనందున ఎంతగొప్పవాడైనా ఆయనకు పతివ్రత అయిన పౌష్యరాణి కనబడలేదు. కావున మనమన్ని వేళలా ముఖ్యముగా సత్పురుష, దైవ సందర్శనమునకు వెళ్ళునప్పుడు శుచిగా ఉండవలయును. ఇదే కారణముగా అర్జునుడు, అశ్వత్థామ బ్రహ్మాస్త్రప్రయోగమునకు ముందు శుచులై మంత్రప్రయోగము చేసినారు (ద్రౌపదీదేవి కథ చూడండి). బకాసురుని యుద్ధమునకు ముందు భీమసేనుడు ఆహారము భుజించి శుచిఅయ్యి తరువాతనే యుద్ధముచేసినాడు (బకాసురవధ కథ చూడండి). అవంతీరాజు, విక్రమార్కుడు పుష్కరిణిలో స్నానము చేసిన తరువాతనే కాళీ ఆలయములోకి ప్రవేశించినారు (విక్రమార్కుని కథ చూడండి).

Search Terms: Udanka, Paila, Paushya, Pativrata


శంఖ లిఖితుల కథ

డిసెంబర్ 13, 2006

(shankhalikhitulakatha.pdf)

మహాభారతము లోని కథ

పూర్వం శంఖుడు లిఖితుడు అనే ఇద్దరు సోదరులు ఉండేవారు. వారు బాహుదానదీ తీరములో ఆశ్రమాలను నిర్మించుకొని తపస్సు చేయసాగినారు. ఇలా ఉండగా ఒకరోజు అన్నగారిని చూడలనిపించి లిఖితుడు శంఖుని ఆశ్రమమునకు చేరుకున్నాడు. అన్నగారు ఎక్కడో బయటికి వెళ్ళారని తెలుసుకొని ఆశ్రమములోని ఒక చెట్టునీడలో కూర్చుని దాని పండ్లలు తింటూ అన్నగారికోసం నిరీక్షించాడు. వేదవేదాంగ పారంగతుడైన శంఖుడు వచ్చి తన తమ్ముని చూసి సంతోషించాడు. ఆతడు పండ్లను ఆరగించటం చూచి “తమ్ముడూ! ఈ పండ్లు నీకెక్కడివిరా?” అని అడిగాడు. లిఖితుడు చెప్పినది విని “ప్రియసోదరా! ఇది తప్పు కదా! అజమానినైన నేను లేని సమయములో నా అనుమతిని పొందకనే ఫలములను తీసుకునుట అపరాధమని నీవెఱుగవా? మన మహారాజుగారి వద్దకు వెళ్ళి నీవు చేసిన తప్పుకి తగిన శిక్షని అనుభవించి రా!” అని అన్న అయిన శంఖుడు ఆజ్ఞాపించినాడు.

తండ్రి తరువాత తండ్రంతటి అన్న మాట తప్పని లిఖితుడు వెంటనే సుద్యుమ్న మహారాజు వద్దకు పరుగెట్టాడు. మునీంద్రుడు వచ్చాడని తెలియగానే ధర్మాత్ముడైన సుద్యుమ్న మహారాజు ఎదురేగి అర్ఘ్యపాద్యాదులర్పించి పూజించాడు. అప్పుడు లిఖితుడు “పార్థివకులభూషణ! ఈ పూజలకు నేను అనర్హుడిని. నేను మా అన్నగారు లేని సమయములో ఆయన ఇంటికి వెళ్ళి చెట్టుకున్న పండ్లను ఆయన అనుమతి లేకుండా కోసుకొని తిన్నాను. కనుక నేను చేసిని ఈ దొంగతనానికి తగిన రీతిలో శిక్షవేసి నన్ను రక్షించు. రాజదండన పొందిన వానికి యమదండన ఉండదని మా అన్నగారు నాకు హితవు చెప్పారు” అని ప్రార్థించాడు. “తపశ్శక్తితో లోకాలకు హితవు చేసే మిమ్ము ఎట్లు శిక్షించము?” అని నచ్చచెప్పినా లిఖితుడు తన పట్టువదలలేదు.

చివరికి సుద్యుమ్నుడు దండనీతి శాత్రాన్ని అనుసరించి లిఖితుని చేతులు నరికించాడు. లిఖితుడు ఎంతో సంతోషించి మహారాజును మనసారా ఆశీర్వదించి అన్నగారి వద్దకు పరుగెట్టాడు. శిక్షను అనుభవించి పునీతుడై వస్తున్న తమ్ముని చూచి శంఖుడు “నాయనా! మంచి పని చేశావు. నీవంటి ఉత్తముని వలన మన వంశమంతా ఉద్ధరింపబడుతుంది.

మద్యపానము, గురుపత్నిని ఆశించడము, విప్రుని చంపడము, విప్రుని ధనమును అపహరించడము (లిఖితుడు తెలియక చేసిన తప్పు ఇదే) మరియు ఈ పనులను చేసేవారితో కలిసి తిరగడము ఇవ్వి పంచమహాపాతకాలు. నువ్వు తగిన రాజదండన పొంది పాప విముక్తుడవైనావు. ఈ బాహుదానదీ పుణ్యజలాలలో మునిగి దేవమునిపితృ తర్పణాలు ఇవ్వు” అని ఆజ్ఞాపించాడు. వెంటానే అన్నగారి ఆజ్ఞపాటించాడు లిఖితుడు. లిఖితుడు బాహుదా నదిలో మునక వేశాడోలేదో తన బాహువులు వచ్చేశాయి! ఆశ్చర్యచకితుడై అన్నగారికి నమస్కరించాడు. శంఖుడు “ప్రియసోదరా! నువ్వు చేసిన తప్పుకు శిక్షను అనుభవించి పునీతుడవైనావు కావున భగవంతుడు నిన్ను కరుణించినాడు. బాహుదానదీ మహాత్మ్యము నా తపశ్శక్తి ప్రభావము నీ చేతులు మొలవటానికి దోహదం చేశాయి. దండనీతిని సక్రమముగా అనుసరించి నిన్ను కాపాడిన సుద్యుమ్న మహారాజు కూడా ధన్యుడు” అని చెప్పాడు.

పిల్లలూ! ఈ కథలోని నీతులను మరొక్కమాఱు చూద్దాము:

  1. దండనీతి యొక్క ప్రాముఖ్యత మనకీ కథ ద్వారా తెలిసినది. ఏ తప్పుకు ఏ శిక్షను అనుభవించాలో వవరించి ఈ దండనీతి శాస్త్రము మనలను యమబాధలనుండి కాపాడుతుంది.
  2. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే. చేసిన తప్పుకు శిక్ష ఎప్పుడో ఒకప్పుడు అనుభవించక తప్పదు. ఈ విషయము తెలిసిన శంఖుడు తమ్మునిపైన అనుగ్రహముతో మహారాజువద్దకు వెళ్ళి దండన అనుభవించిరమ్మనాడు.
  3. అన్నగారు చెప్పిన హితవును వెంటనే అనుసరించి లిఖితుడు తనంతట తాను రాజు వద్దకు వెళ్ళి చేసిన తప్పొక్కుకుని దండించమని ప్రార్థించినాడు. దండన అనుభవించి పునీతుడైనాడు.
  4. ఈ కథలో అందఱూ తమ కర్తవ్యములను బాగా పాటించి మనకు మార్గదర్శకులైనారు. విప్రులైన శంఖలిఖితులు లోకహితార్థం తప్పస్సులు చేసుకుంటూ కాలము గడిపినారు. దండనీతికోవిదుడైన సుద్యుమ్న మహారాజు లిఖితునికి తగిన శిక్షవేశాడు. లిఖితుడు అన్నగారి మాట జవదాటలేదు. శంఖుడు తమ్ముని శ్రేయస్సునే కోరినాడు.

Search Terms: Shankha, Likhita, sudyumna


శీలసంపద

డిసెంబర్ 8, 2006

(shilasampada.pdf)

మహాభారతము లోని కథ

ఖాండవవన దహనమప్పుడు లోకైకవీరుడైన అర్జునుడు తనను రక్షించినందుకు కృతజ్ఞతగా మయాసురుడు మయసభను నిర్మించి ధర్మరాజుకివ్వాలని సంకల్పించుకున్నాడు. మయాసురుడు ఆ భవ్య మయసభను పవిత్ర హిమాలయాలలో నిర్మించి తన మాయశక్తితో ఇంద్రప్రస్థానికి తెచ్చాడు. మయసభలోని అద్భుతాలను పొగడటానికి మాటలుచాలవు. మయసభ అంతా కనక రత్న మణిమయము. మయసభలోని స్తంభాలు ద్వారాలు తోరణాలు వనాలు తటాకాలు అన్నీ మణిమయాలే. రాజసూయ యాగానికి వచ్చిన ఎందఱికీ సంభ్రమాశ్చర్యాలు కలిగించి నభూతో నభవిష్యతి అని పొగడబడినది ఆ మయసభ. మయసభ విభవం పాండవుల అదృష్టం చూసి దుర్యోధనుని అసూయామాత్సర్యాలు మరింత చెలరేగాయి. పాండవుల కీర్తి సంపదలను తలచుకొని తీవ్రంగా దుఃఖిస్తూ తన తండ్రి అయిన ధృతరాష్ట్రుని వద్దకు వచ్చి తన బాధను చెప్పుకున్నాడు దుర్యోధనుడు. మత్సరమనే ఘోరసర్పముచే కాటువేయబడ్డ తన కొడుకుకి ఇలా హితవు చెప్పాడు ధృతరాష్ట్రుడు

“కుమారా! నీకు మాత్రం తక్కువ ఐశ్వర్యమున్నదా? ఈ లోకంలో సంతృప్తి ఉన్నవాడే ధనవంతుడు. సంతృప్తి లేకుండా కుబేర సంపద ఉన్నా వాడు సంతోషముగా ఉండలేడు. నాయనా! శీలవంతుడైన ధర్మనందనుని శ్రీలక్ష్మి ఎన్నడూ విడువదు. శీలవంతుని ఆశ్రయించే సకల సంపదలు సుగుణములు ఉంటాయి. కాబట్టి నీవు కూడా ధర్మాత్ములైన పాండవులవలె శీలవంతుడవు కమ్ము. తానుతో సిరిసంపదలు వాటంతట అవే వస్తాయి”. కుమారునికి ఒక ఇతిహాసం చెప్పాడు

“ప్రహ్లాదుడు సర్వగుణ సంపన్నుడు విద్యా పారంగతుడు పరమ విష్ణుభక్తుడు. ధర్మం తప్పకుండా తన ప్రజలను పాలించేవాడు. తన సౌశీల్య ప్రభావం చేత త్రిలోకాధిపత్యం ఇంద్రత్వం ప్రాప్తించింది ప్రహ్లాదునికి. చతుర్భువనాలను జనరంజకముగా పాలించసాగాడు ఆ ప్రహ్లాదుడు. ఇలా ప్రహ్లాదుని వలన పదవీ భ్రష్టుడైన శచీపతి గురువైన బృస్పతులవారిని తనకు మళ్ళీ ఇంద్రపదవి సిద్ధించే ఉపాయం చెప్పమని ప్రార్థించాడు. బృహస్పతి విష్ణు అవతారుడైన పరశురాముని ఆశ్రయించమని చెప్పాడు. గురు ఆజ్ఞపాటించి ఇంద్రుడు భార్గవరాముని శరణుజొచ్చి ఉపాయం బోధించమని ప్రార్థించాడు. “అతనికి అంత శక్తి ఎలా వచ్చిందో అతనినే అడుగు. ఆ శక్తిని అతనివద్దనుండే పుచ్చుకో” అని చెప్పాడు భార్గవుడు.

విద్యార్జన గురుసుశ్రూష వలనే సాధ్యం అని తెలిసిన దేవేంద్రుడు విప్రవేషం ధరించి ప్రహ్లాదునికి శిష్యుడై అతనిని భక్తితో సేవించటం మొదలుపెట్టాడు. అలా ఎంతో కాలం ప్రహ్లాదుని సేవించినాడు వజ్రి. ప్రసన్నుడైన ప్రహ్లాదుడు “నాయనా! ఏమి కోరి నన్ను సేవిస్తున్నావు?” అని విప్రవేషంలో ఉన్న ఇంద్రుని అడిగాడు. శచీపతి తన అభీష్టం వ్యక్త పఱచినాడు. అప్పుడు ప్రహ్లాదుడు

“కుమారా! నేనెప్పుడూ రాజునని గర్వించను. ఎవఱినీ నొప్పించను. వారికి హితమేచేస్తాను. ఈర్ష అసూయ ద్వేషం పగ మొదలైనవి నా దరి చేరనివ్వను. అడిగినవాడికి లేదనకుండా సంతోషపెడతాను. నా పురాకృత పుణ్యం వలన నాకీ సౌశీల్యం అబ్బినది” అని చెప్పాడు. “ఓ దయామయా! దానశీలా! నీ శీలం నాకు ప్రసాదించు” అని అడిగాడు ఇంద్రుడు. “అయ్యో పాపం!” అని ప్రహ్లాదుడు తన శీలాన్ని దేవేంద్రునికి దానం ఇచ్చి పంపివేశాడు.

ఇంద్రుడు వెళ్ళాడో లేదో ప్రహ్లాదునిలోనుండి ఒక దివ్య తేజఃపుంజము పురుషాకృతిదాల్చి బయటికి వచ్చింది. “నీవెవరు?” అని ఆశ్చర్యాముగా అడిగాడు ప్రహ్లాదుడు.

“నేను నీ శీలాన్ని. ఆ విప్రునికి నన్ను దానం ఇచ్చావు కదా. వెళుతున్నాను” అని చెప్పి వెళిపోయింది శీలము. ఒకతేజస్సు తరువాత ఒకటి ప్రహ్లాదుని వీడిపోయినాయి. ఒక తేజస్సు అన్నది “నేను సత్యమ్. శీలాన్ని ఆశ్రయించి ఉంటాను. శీలంతో పాటూ నేను నిన్ను విడుస్తున్నాను”. మరొక తేజస్సు అన్నది “రాజా! నేను ఋజుప్రవర్తనమ్. సత్యము లేని చోట నేనుండలేను”. “నేను బలమ్. సత్ప్రవర్తన లేనివాడి వద్ద నేనుండను” అని వెళ్ళిపోయింది బలమ్. చివరికి ఆదిలక్ష్మి బయటికి వచ్చి “నేను శ్రీలక్ష్మిని. బలం ఉన్నచోటే నేనుంటాను. వెళుతున్నాను” అని అన్నది. అప్పుడు ప్రహ్లాదుడు “అమ్మా! లోకమాతా! నీవూ నన్ను విడిచిపోతున్నావా? ఈ అభాగ్యునిపై దయ చూపవా? వెళ్ళద్దు తల్లీ! ఆ విప్రుడు ఎవఱు తల్లీ?” అని ప్రార్థించాడు. “అతడు దేవేంద్రుడు. పోగొట్టుకున్న రాజ్యమును సంపాదించడనికి నీవద్దకు వచ్చాడు. అన్ని సంపదలకూ మూలమైన శీలమును నీవు అతనికి దానమిచ్చావు కావున శీలాన్ని అనుసరించి మేమందఱమూ వెళుతున్నాము” అని సర్వాణి చెప్పింది. నిజమైన శ్రీహరి భక్తులకు సాధ్యం కానిదేమున్నది? ప్రహ్లాదుడు మళ్ళీ తన సద్గుణాలను సంపదలను అచిరకాలంలోనే సంపాదించుకున్నాడు. కనుక నీవెల్లప్పుడూ సౌశీల్యుడవై వర్ధిల్లు నాయనా!” అని కుమారునికి హితవు చెప్పాడు ధృతరాష్ట్రుడు.

పిల్లలూ! మనమీ కథలోని నీతిని మరొక్కమాఱు చూద్దాము:

సౌశీల్యం యొక్క ప్రాముఖ్యత మనకీ కథ ద్వారా తెలిసినది. శీలమున్న వాడి వద్దనే సకల సంపదలుంటాయి. కాబట్టి మొదట శీలవంతులము కావడం ముఖ్యము.

Search Terms: Prahlada, Prahlaada, Dhrutarashtra, Dhrtaraashtra, Duryodhana, Mayasabha.


ఎన్నడూ పారుష్యపు మాటలాడరాదు

డిసెంబర్ 3, 2006

(yayati.pdf)

మహాభారతము లోని కథ

నహుష మహారాజు ప్రియంవద యొక్క పుత్రుడు యయాతి. అతడు ఎంతో కాలము ధర్మము తప్పకుండా రాజ్యపాలన చేసి యోగ్యుడు పితృవాక్య పరిపాలకుడు అయిన పూరువునికి రాజ్యభారమొసగి వైరాగ్యముతో తపోవనాలకు తపస్సుకై వెళ్ళిపోయాడు. వేదవేదాంగ పాఱంగులైన పండితులను తోడుగా తీసుకుని కందమూలాదులను భుజిస్తూ కఠిన నియమ వ్రతాలతో తపస్సు సాగించాడు. యయాతి ఆ తపోవనాలలో ఎన్నో యజ్ఞ యాగాదులు చేశాడు. హవిస్సులతో దేవతలను తర్పణలతో పితృదేవతలను సంతోషపెట్టాడు. కామ క్రోధాది అరిషడ్వర్గాలను జయించి సహస్ర దివ్యవర్షములు తీవ్ర నిష్ఠతో తపస్సు చేశాడు. ముప్పది ఏండ్లు నిరాహారిగా ఒక్క ఏడాది వాయుభక్షణ చేసి తరువాత పంచాగ్నుల మధ్యలో నిలిచి తపస్సు చేశాడు. అటు తరువాత ఒక్క ఏడాది సముద్రమధ్యములో ఒంటికాలుమీద నిలబడి ఏకాగ్రతతో తపస్సు చేశాడు. ఇలా తపస్సు చేసి తన అనంత పుణ్యనిధి ప్రభావంవల్ల దివ్యవిమానములో దేవలోకానికి వెళ్ళాడు.

అక్కడ దేవర్షుల పూజలందుకొని బ్రహ్మలోకం చేరాడు. అక్కడ అనేక కల్పములు ఉండి బ్రహ్మర్షుల చేత పూజలందుకొన్నాడు! ఆ తరువాత ఇంద్రలోకాని వచ్చాడు. ధర్మాత్ముడు మహాతపశ్శక్తి సంపన్నుడు అయిన యయాతి వచ్చాడని తెలిసి దేవేంద్రుడు స్వయముగా వచ్చి అతిథికి అర్ఘ్యపాద్యాదులిచ్చి సత్కరించాడు. మహావిభవోపేతుడైన ఇంద్రుడు ఆ యయాతిని యథావిధి పూజించి ఇలా అన్నాడు “ఏమి తపస్సు చేశావయ్య మహానుభావా? నువ్వు సామాన్యుడవు కావు! శతసహస్ర వర్షముల తపస్సు సామాన్యులకు సాధ్యమా?”.

సాక్షాత్ దేవేంద్రుడంతటివాడు ఇలా పొగిడేసరికి యయాతి ప్రారబ్ధవశాత్తు ఇలా పారుష్య వాక్యాలు అన్నాడు “ఓ అమరేంద్రా! సుర దైత్య యక్ష రాక్షస నర ఖేచర సిద్ధ మునిగణముల తపస్సులు నా తపస్సుకు సాటిరావు”. “ఔరా! ఇంత గొప్పవాడయ్యికూడా గర్వమును వీడలేదు కదా!” అని అనుకొని ఇంద్రుడు యయాతితో “మహనీయులైన మహర్షుల తపస్సులను గర్వముతో కించపఱచినావు. లోకశ్రేయస్సుకై తమ జీవితాలను ధారపోసిన ఆ మహనీయులనెన్నడూ అవమానించరాదు. ఓ యయాతి! ఈ ఒక్క మాటతో నీవు సంపాదించుకొన్న తపశ్శక్తి అంతా అంతరించిపోయింది. ఇక నీకు ఈ లోకములో ఉండటానికి అర్హతలేదు. అధోలోకానికి పో” అని శపించాడు.

తన తప్పు తెలుసుకొని పశ్చాత్తాపముతో శరణువేడి యయాతి “ఓ దేవేంద్రా! ఏ క్షణాన నేను పూజ్యులైన మహర్షులను అవమానించానో ఆ క్షణమే నా శక్తి అంతా కరిగిపోయింది. నన్ను అధోలోకాలకు పంపకు. నాకు సత్సంగత్యం లేకుండా చేయకు. సత్ భువనములో సత్పురుషుల సాంగత్యములో నన్ను ఉండనివ్వు” అని ప్రార్థించాడు. పశ్చాత్తాపముతో కుమిలిపోతున్న యయాతిని కరుణించి దేవేంద్రుడు యయాతికి సద్భువనములో నివసించుటకు అనుజ్ఞ ఇచ్చాడు.

సద్భువనములో ఉండి ఆ యయాతి అచిరకాలములోనే అనంత తపశ్శక్తిని మళ్ళీ సంపాదించాడు. అహంకారమును పూర్తిగా విడిచి మహాతేజోమయుడయ్యాడు. ఇలా ఉండగా ఒకసారి ఆ యయాతి దౌహిత్రులైన అష్టకుడు ప్రతర్దనుడు వసుమంతుడు ఔసీనరుడు మరియు శిబి సద్భువనమునకు వచ్చిరి. అనంతపుణ్యసంపదతో వెలిగిపోతున్న యయాతిని పూజించి “స్వామి! మీరెవరు” అని అడిగారు. యయాతి తన కథను చెప్పి “నాయనలారా! ఎంత కొంచెమైనా గర్వము ఎన్నడు ఉండరాదు. గర్వముతో నేను పారుష్యవాక్యములు మాట్లాడి ఉత్తములైన మహర్షులను అవమానించినాను. మీరెన్నడు అట్టి తప్పుచేయవద్దు. వాక్పారుష్యము విషము కన్నా అగ్ని కన్నా భయంకరమైనది” అని హితవు చెప్పాడు. యాయాతిని తమ తాతగారిగా గుర్తించి నమస్కరించి ఆయనవద్ద ఎన్నో రహస్యములైన ధర్మోపదేశాలు పొందారు అష్టకాదులు.

పిల్లలూ! మనమీ కథలోని నీతులను మరొక్కమాఱు చూద్దాము:

  1. గర్వము అహంకారము ఎంత కొంచెముగా ఉన్నా హాని కాలుగచేస్తాయి. ఒక్కచిన్న పారుష్యవాక్యము వలన తన తపశ్శక్తినంతా పోగొట్టుకున్నాడు యయాతి.
  2. ఎన్నడూ ఉత్తములను అవమానించరాదు. మహర్షుల తపస్సులు తన తపస్సుతో సాటిరావని అని యయాతి వారిని అవమానించాడు.
  3. ఒక సజ్జనుడెన్నడూ తప్పుచేయడు. పొరబాటుగా చేసినా దానికి పశ్చాత్తాపము చెంది ఆ తప్పు నెన్నడు మళ్ళీ చేయడు. సజ్జనుడైన యయాతి తను చేసిన తప్పును దౌహిత్రుల వద్ద చెప్పుకొని ఆ తప్పు చేయవద్దని హితవు చెప్పాడు.
  4. ఒక మనిషి యొక్క ఉద్ధారణకు సత్సంగత్యం చాలా అవసరము. ఈ విషయం తెలిసిన యయాతి సత్సంగత్య భాగ్యము కలిగించమి ఇంద్రుని కోరుకున్నాడు.

Search Terms: Yayati, Yayathi, Yayaati, Yayaathi, Indra, Devendra.


ఏకచక్రపుర బక వధ

నవంబర్ 23, 2006

(ekachakrapurabakavadha.pdf)

మహాభారతము లోని కథ

“అమ్మా! ఎందులకు నీవు పుత్రత్యాగము చేయుచున్నావు? ఎవ్వని బాహుబలము వలన మనము లాక్షాగృహము నుండి బయపడ్డామో ఎవ్వని శక్తి సామర్థ్యాలవల్ల దుష్టుడైన పురోచనుడు నశించాడో ఎవ్వని బలపరాక్రమాలు మనల్ని ఎల్లవేళలా దుర్యోధనుని బాఱినుండి కాపాడుతున్నాయో ఏ వీరుని అండ చూసుకుని మనము సుఖముగా జీవిస్తున్నామో ఏ మహాబలశాలి కౌరవాదులకు గుండెదిగులు అయ్యాడో ఎవ్వని పై భారం మోపి పోగొట్టుకున్న రాజ్యలక్ష్మిని మఱల పొదుదామనుకుంటున్నామో అట్టి నాగాయుధ బలసంపన్నుడైన భీమసేనుని ఎందులకు త్యాగము చేస్తున్నావు తల్లీ”? అని బకాసురునికి ఆహారముగా వెళుతున్న తమ్ముని చూసి తల్లి అయిన కుంతీదేవిని అడిగాడు ధర్మరాజు.

“నాయనా! ప్రస్తుతము మనము ఈ విప్రోత్తముని ఇంటిలో ఆశ్రయము తీసుకుంటున్నాము. ఆ విప్రుని కుమారుడు బకాసురునకు ఆహారము కాకుండా కాపాడి ఆయన మనపై చూపిన వాత్సల్యానికి కృతజ్ఞతను చూపించాలి. ప్రత్యుపకారం మన కనీస కర్తవ్యమ్. సాటి వారు బాధలలో ఉన్నప్పుడు ఆదుకోవటం మానవతాధర్మమ్. అదీ కాక ఇటువంటి పండితోత్తముని రక్షించటం మహాపుణ్యదాయకమ్. లోభం వల్లకానీ తెలియక గానీ మోహము వల్లకానీ నేనీ నిర్ణయము తీసుకోలేదు.

వెయ్యి ఏనుగుల బలమున్న భీమసేనుని పరాక్రమము మనకు తెలియనిది కాదు. హిడింబాసురుని వధించినప్పుడు మనకి అతని శక్తి ఎంతటిదో తెలిసిపోయింది. ఆ భీమసేనుడు పుట్టిన రోజే నా చేయిజారి క్రింద పడినప్పుడు అతని క్రింద ఉన్న రాయి నుగ్గునుగ్గైపోయింది! యుద్ధములో వజ్రిని కూడా ఢీకొనే బలమున్నది భీమునికి. కనుక ఇతడు నిస్సందేహముగా బకాసురుని వధించి ఈ ఊరికి ఉపకారం చేస్తాడనే నా నమ్మకమ్. ఆ పైన శ్రీకృష్ణుని దయ” అని హితబోధ చేసింది మహాసాధ్వి అయిన కుంతీదేవి.

ధర్మజుడు తల్లి మాటలు విని ఎంతో సంతోషించి పుత్రవాత్సల్యంతో తమ్ముని మనసారా దీవించి పంపినాడు. అనుకున్న ప్రకారం భీమసేనుడు ఒక బండీలో అన్నం నింపుకుని ఆ రాక్షసుని స్థావరమునకు వెళ్ళి అతనిని పిలిచి తానే ఆ ఆహారమంతా తినసాగాడు. బకాసురుడు నరార్భకుడు తన భోజనం తినేస్తున్నాడని కుపితుడై గట్టిగా భీముని వీపుపై గుద్దాడు. చలించని భీమసేనుడు ఆహారం తీసుకుంటూనే ఉన్నాడు. మహా క్రోధముతో బకుడు ఒక పెద్ద వృక్షమును పెకిలించి భీమునిపైకి విసరబోయాడు.

ఇంతలో భీముడు భోజనము ముగించి కాళ్ళూ చేతులూ కడుక్కోని ఆచమించి శుచి అయ్యి రాక్షసుడు విసిరిన చెట్టుని పట్టుకుని తిప్పికొట్టాడు! అలా కొంత సేపు వారు రాళ్ళతో చెట్లతో భీకర యుద్ధం చేసి చివరికి ముష్టియుద్ధము చేయసాగారు. అలసిపోయిన రాక్షసుని బోర్లదోసి తన మోకాలిని బకుని వీపుపైన ఉంచి బలముగా ఒక్క ముష్టిఘాతం ఇచ్చాడు భీముడు. బకుడు ఆర్తనాదాలు చేస్తూ అసువులు బాసినాడు.

bhima-bakasura.JPG

ఆ కేకలు విని బకుని బంధువులు బైటికి వచ్చారు. భయకంపితులైన వారితో భీముడు “ఇక నుంచీ మీరు మనుషులను హింసించటం మానకపోతే మీకూ ఈ బకునికి పట్టిన గతే పడుతుంది” అని హెచ్చరించాడు. వారందఱూ అలాగే ప్రతిజ్ఞ చేసి వెళిపోయారు. ఆ రోజునుండీ ఏకచక్రపురం లోని ప్రజలు హాయిగా జీవించడం మొదులుపెట్టారు.

పిల్లలూ! ఈ కథ లోని నీతులను మరొక్కమాఱు చూద్దామ్:

  1. కుంతీదేవి ధర్మరాజుకు చేసిన హితబోధ మనమెన్నడూ మఱువరాదు. కృతజ్ఞత ఆర్తరక్షణ కనీస కర్తవ్యాలని మనకు ఈ కథ ద్వారా తెలిసినవి.
  2. ఒక సజ్జనుడు తన బలాన్ని పరోపకారానికి ఎలా ఉపయోగిస్తాడో మనకు ఈ కథలో భీమసేనుని ద్వారా తెలిసింది. అదే దుష్టులైన కౌరవులు తమ బలాన్ని యుక్తిని ప్రజాశ్రయస్సుకు వాడకుండా మత్సరముతో పాండవులను మట్టుపెట్టడానికే ఉపయోగించారు.

Search Terms: Bhima, Bheema, Bhiima, Kunti, Yudhishthira


అన్నమాటకి కట్టుబడిన అర్జునుడు

నవంబర్ 21, 2006

(annamatakikattubadinaarjunudu.pdf)

మహాభారతము లోని కథ

పరమేశ్వరుని వరప్రభావముతో సక్షాత్ విష్ణుస్వరూపుడైన వ్యాసుని శాసనముపై ధర్మబద్ధముగా జరిగింది ద్రౌపదీ పాండవుల కళ్యాణము. దేవశిల్పి అయిన విశ్వకర్మచే నిర్మించబడిన ఇంద్రప్రస్థములో ఉన్న ద్రౌపదీ పాండవుల వద్దకు నారదుడు వచ్చి సంసారజీవములో వారుపాటించ వలసిన నీతినియమాలను వివరించాడు. అన్ని విషయాలు వివరిస్తూ ఇలా అన్నాడు “ఓ పాండవులారా! విమలబుద్ధితో వినండి. ద్రౌపదీదేవి మీ ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కయేడాది క్రమముగా ఉంటుంది. ఆ కమలాక్షి ఉన్న ఇంటి యజమానికి తెలియకుండా మీరెవరైనా ఆ అంతఃపురానికి వెళితే ప్రాయశ్చిత్తముగా ఒక ఏడాది కఠిన వ్రతనియమాలు పాటించి తీర్థయాత్రలు చేయాలి”. పాండవులందఱూ నారదుని చెప్పిన ఆ సమయనియమాన్ని శిరసావహిద్దామని నిశ్చయించుకున్నారు.

ఇట్లా ఉండగా ఒక రోజు ఒక బ్రాహ్మణుడు దొంగలచేత తన హోమధేనువును పోగొట్టుకున్నవాడై తనను రక్షించమని ఆక్రోశించాడు. ఆ విప్రుని ఆర్తనాదం విన్న అర్జునుడు దుఃఖమునకు కారణమడిగి ఏమి జరిగినదో తెలుసుకున్నాడు. అర్జునుడి ధనుస్సు ధర్మరాజు ఆయుధశాలలో ఉన్నది. అప్పుడు ద్రౌపదీదేవి ధర్మరాజు అంతఃపురములో ఉన్నది. ఆ కారణముగా ఆయుధశాలకి ప్రవేశించిన నారదుడు వారికి విధించిన నియమముభంగము అవుతుందని తెలిసినా ప్రాయశ్చిత్త క్లేశమునకు జంకక ఆ వీరాధివీరుడైన అర్జునుడు ఆర్తరక్షణకై ఆయుధాలయం ప్రవేశించి తన ధనువు తీసుకుని ఆ దొంగలను వెంబడించాడు. దుష్టులు వీరులు అయిన ఆ దొంగలను శిక్షించి విప్రుని హోమధేనువు అతనికి తిరిగి ఇచ్చివేశాడు.

తరువాత సత్యవంతుడైన అర్జునుడు ధర్మరాజు వద్దకువెళ్ళి జరిగినది చెప్పి తనకు తీర్థయాత్రలు చేసి ప్రాయశ్చిత్తము చేసుకునే అవకాశం ఇవ్వమని కోరినాడు. అంతట ఆ ధర్మనందనుడిలా అన్నాడు “సోదరా! క్రూరకర్ములై ఆ విప్రుని హోమధేనువును అపహరించిన ఆ దొంగలను శిక్షించి నీవు ధర్మమే చేశావు. ఇట్టి దుష్టులను ఉపేక్షించిన మహాపాపము. అందుకని సమయభంగమైనది నీవు విచారపడనక్కరలేదు. ధర్మరక్షణకై చేశావు కనక నీవు ఎందుకు తీర్థయాత్రలకు వెళ్ళటం”?

అప్పుడు శ్రీకృష్ణ ప్రియసఖుడైన అర్జునుడిలా అన్నాడు “అన్నయ్యా! ప్రజారక్షణ అనే వ్యాజముతో (వంకతో) నేను ఆడిన మాట తప్పుట మంచిదికాదు కదా! నా పాపము తీరే విధముగా తీర్థయాత్రలు చేసేందుకు నాకు అనుజ్ఞ ఇవ్వండి”. తమ్ముని సత్యవాక్ పరిపాలనకు సంతోషించి అతనికి దూరముగా ఉండట ఇష్టములేక పోయినా తీర్థయాత్రలకు పంపించాడు. తరువాత ఆచార్యుల పెద్దల అనుమతి తీసుకుని అర్జునుడు రాజభోగాలన్నీ తృణప్రాయంగా ఎంచి వేదవేదాంగ విదులైన పండితులను సహాయముగా తీసుకుని సకల తీర్థాలూ సేవించి పావనుడైనాడు.

పిల్లలూ! ఈ కథలోని నీతిని మరొక్కమాఱు చూద్దామ్:

కఠినమైన వ్రతనియమాలతో ఉండి రాజ భోగాలు విడిచి తీర్థయాత్రలు చేయాలని తెలిసినా అర్జునుడు తన కర్తవ్య పాలన చేయడానికి వెనకాడకుండా ఆయుధాలయానికి వెళ్ళి ధనువు తెచ్చి దుష్టశిక్షణ చేశాడు. తనంతట తాను వేళ్ళి తన తప్పుకు ప్రాయశ్చిత్తము చేసుకునే అవకాశమీయ మని ధర్మరాజును ప్రార్థించి తన సత్యవాక్ పరిపాలనా దీక్షను మనకు చూపించాడు.

Search Terms: Arjuna, Narada, Yudhishthira, Pandava, Draupadi