తొండమాన్ చక్రవర్తి – భీమ కులాలుడు

డిసెంబర్ 30, 2006

(tondaman.pdf)

భవిష్యోత్తర పురాణము లోని కథ

కలియుగ ప్రత్యక్ష దేవుడైన శ్రీ వేంకటనాథునికి అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకి అయిన పద్మావతీ దేవిని కన్యాదానమిచ్చిన మహానుభావుడు తొండమండలాధీశుడైన ఆకాశరాజు. తొండమానుడు ఆకాశరాజు సోదరుడు. అమిత శ్రీనివాస భక్తుడు. స్వామి ఆజ్ఞపై తిరుమల భవ్య మందిర నిర్మాణము చేయించిన ధన్యజీవి. బ్రహ్మాది దేవతలు నిత్యం వచ్చి శ్రీవేంకటపతిని సేవించుకునేది తొండమానుడు కట్టించిన ఆలయంలోనే. తొండమానుడు ఎంతటి భక్తుడంటే నిత్యము స్వామితో సంభషణలు చేసేవాడు!

ఇలా ఉండగా ఒకరోజు ఆకాశవాణి “ఆహా! ఎంత పుణ్యం చేసుకున్నావయ్యా! శ్రీనివాసుని ప్రతి కైంకర్యుము నీచేతుల మీదిగా శ్రద్ధాభక్తులతో రంగ రంగ వైభవంగా చేయిస్తున్నావు. రాజా! నీవంటి విష్ణుభక్తుడు లేడయ్యా” అని అన్నది. అంతవరకూ స్వామిగురించి తప్ప ఏమీ ఆలోచించని తొండమానుడు “ఆకాశవాణి మాటలు నిజమే కదా! నావంటి భక్తుడు అరుదు” అని అనుకున్నాడు.

ఆహా! అహంకారమెంత దారుణమైనది. చివరికి మహనీయుడైన తొండమానుని సైతం విడువలేదు! అహంకారమే సకల దురుతాలకు మూలము. అహంకారం గర్వం ఎంత కొంచమైనా అది ఉన్నవాడిని నిలువునా దహించివేస్తుంది. కానీ స్వామి సామాన్యుడా? ఒక్కసారి త్రికరణశుద్ధిగా శరణువేడిన పరమ శత్రువునైనా దరిజేరుస్తాడు (ధర్మజ్ఞః కథ చూడండి). అలాంటిది సర్వసుగుణవంతుడు మహాభక్తుడు అయిన తొండమానుని పతనం జరగనిస్తాడా? లేదు. వెంటనే తొండమానునికి గుణపాఠం నేర్పాలని నిశ్చయించుకున్నాడు స్వామి.

ఒకరోజు తొండమానుడు స్వామితో సంభాషించుచూ “నావంటి భక్తుడు ఈ ముజ్జగాలలో లేడు. అసలు నేను తప్ప నీకు నిజభక్తులు ఎవరైనా ఉన్నారా దేవాదిదేవా?” అని ప్రశ్నించాడు. జగన్నాటకసూత్రధారి అప్పటికి చిరుమందహాసముతో సమాధానమిచ్చిఆ తొండమానునికి గుణపాఠం చెప్పే నాటకానికి అప్పుడే శ్రీకారం చుట్టాడు.

ఒకరోజు తొండమానుడు రోజూలానే ఉదయాన్నే స్వామి దర్శనము చేసుకొని నిశ్చల భక్తితో ఆ పరమపురుషుని ధ్యానించి కలిదోషనివారణములైన శ్రీపాదలను చూశాడు. శ్రీహరిపాదం చుట్టూ ఉన్న కోట్లాది సౌర్యమండలాల వలె ప్రకాశిస్తున్నాయి తొండమానుడు పూజించిన సువర్ణ కమలాలు. కాని ఆశ్చర్యమ్! కన్నులు మినుమిట్లు గొలిపే ఇంతటి సువర్ణకాంతులలోను రాజుకు వాడిపోయి మట్టి అంటుకొని ఉన్న కమలాలు తులసీదళాలు కనబడ్డాయి. “ఏమిటీ చిత్రమ్? వేసిన తలుపులు వేసినట్టే ఉన్నాయి అయినా ఈ సుమాలిక్కడికి ఎలా వచ్చాయి? నేను స్వామిని స్వర్ణ కమాలతో తప్ప పూజించను కదా!” అని తర్కించుకొని నేరుగా స్వామినే ఈ ప్రశ్నవేశాడు. ఆ దయామయుడు చిరుమందహాసముతో ఇలా సమాధానమిచ్చాడు.

“నాయనా! ఇక్కడికి కొంత దూరములో ఉన్న పేదపల్లెలో ఒక సామాన్య కుమ్మరి ఉన్నాడు. అతని పేరు భీముడు. పాపం అతనికి నేనంటే ఎనలేని భక్తి ప్రేమ. అతనుండే ఇంటి మట్టి గోడలో ఒక గూడు చేసి అందులో నా కఱ్ఱబొమ్మ ఒకటి మలచి అందులో నన్ను భావించుకొంటూ పూజిస్తుంటాడు. భక్తుడు ఎక్కడ భావిస్తే అక్కడ దీపించడం నా బాధ్యత కదా! ప్రహ్లాదుని కథ నీకు తెలియనిది కాదుకదా! పాపం అతనికి మంత్రతంత్రాలు తపోయోగాలు ఏమీ తెలియవు. అయినా త్రికరణశుద్ధిగా నిరంతరం నన్ను ధ్యానిస్తూనే ఉంటాడు. తాను కుండలు చేస్తున్నా అన్నం తింటున్నా ఎప్పుడు నా ఊసే! నా ధ్యాసే!

తన కులాచారం ధర్మం ఎల్లవేళలా పాటిస్తాడు. సూర్యోదయాత్పూర్వమే లేచి తనకు తెలిసిన రీతిలో స్నానాది శౌచములు ఆచరించి నా పేరు స్మరిస్తూ తులసీదళాలు సమర్పిస్తాడు. అక్కడ అతడు వేసిన దళాలే నీకిక్కడ కనబడుతున్నాయి. అతనే కాదయ్యా వారి కుటుంబమంతా అంతే. నా మాట నా పాట తప్ప వారికేదీ రుచించదు. ఆ భీమ కులాలుని భక్తిపాశాలకు బంధీ అయిపోయానయ్యా!”

విషయం తెలిసింది తొండమానునికి. భాష్పపూరితనయనాలతో “ప్రభూ!” అని ఆర్తితో పిలిచి స్వామిపాదాలపైపడి “జగన్నాథా! నా తప్పు క్షమించు. నావంటి భక్తుడు లేడని అహంకరించాను. నేను చూసిన ప్రపంచమెంత? నా అనుభవం ఎంత? నాపై దయతో నా బుద్ధిదోషాన్ని పోగొట్టి నిజమైన భక్తుని చేశావు తండ్రీ. ఇదుగో ఇప్పుడే వెళ్ళి భీముని దర్శనము చేసుకొని వస్తాను. నాకు సెలవు ఇవ్వు” అని చెప్పి బయలుదేరాడు రాజు.

“నాహం వసామి వైకుంఠే నయోగి హృదయే రవౌ |
మద్భక్తాః యత్రగాయంతి తత్ర తిష్ఠామి నారద!”

అన్న సూక్తి ప్రకారము భీముని దర్శనము తీర్థయాత్రగా భావించి రాజు నడుచుకుంటూ వెళ్ళాడు. పుణ్యక్షేత్రాలకు కాలినడకనే ప్రయాణము చేయాలి కదా! భీముని ఇల్లు చేరాడు రాజు. భీముని ఇల్లు స్వామి భజనలతో మారుమ్రోగుతున్నది. భీముని పాదాలపైపడి “అయ్యా! శ్రీ వేంకటేశుని ద్వారా నీ మహాత్మ్యము తెలిసుకున్నాను. సాక్షాత్ ఆ శ్రీమన్నారాయణుడే నీ భక్తిని కొనియాడాడయ్య! నీ పాదధూళి తాకి పునీతుడని అవుదామని వచ్చాను” అని అన్నాడు తొండమానుడు. చక్రవర్తి ఏమిటి నా పాదలు తాకడం ఏమిటి అని వెనక్కు జరిగిపోయి చేతులు జోడించి “రాజా! అంత పని చేయద్దు. స్వామికి దివ్యాలయం కట్టించిన మహానుభావుడవు నీవు” అని అన్నాడు.

ఇంతలో గరుడారూహుడై స్వామి లక్ష్మీదేవితో సహా ప్రత్యక్షమైనాడు. భీముని ఆనందానికి అంతులేదు. “ఓ దయామయ! నా పూరి గుడిసెకు వచ్చావా! నీ లీలలే లీలలయ్యా. మా తప్పులెన్నక దయావర్షం కురిపించే కాలమేఘానివి స్వామీ నీవు. నేను హనుమంతుని వలె వారధిదాటి నిన్ను మెప్పించలేను, శబరివలె భక్తిశ్రద్ధలు చూపి నిన్ను ఆకట్టుకోలేను, జనకుని వలె సీతను ఇవ్వలేను, నారదుని వలె గంధర్వగానముతో నీ గుణగణాలను కీర్తించలేను, జటాయువు వలె నీకై నా ప్రాణాలు ఇవ్వలేను అయినా నిన్ను శరణువేడిన నన్ను కరుణించిన కరుణామూర్తివి నాయనా నీవు” అని స్తుతించాడు. భీముడిలా తన్మయత్వంతో ఆడిన మాటలను వేదమంత్రాలు వింటున్నంత ప్రీతితో విన్నాడు స్వామి.

మహాభక్తురాలైన భీముని భార్య తమాలినీ కూడా గద్గద స్వరంతో అమ్మని కీర్తించింది. ఆదిదేవుడు మహాలక్ష్మి స్వయంగా తన యింటికివచ్చారు. వారికి ఇవ్వదగినది ఏమీ లేదే అని బిడియపడింది. అది గమనించి శ్రీనివాసుడు “తమాలినీ! నీ చేతితో ఏది వండి ఇచ్చినా తింటానమ్మా” అని అన్నాడు. తమాలినీ సంతోషానికి పట్టపగ్గాలులేవు. తనకు పెద్దల వలన తెలిసినంతలో యథాశక్తిగా శుచితో తామర తూడ్లతో వంటకాన్ని వండి లక్ష్మీనారాయణులకు వడ్డించింది. తృప్తిగా ఆరగించారు అలమేలుమంగాశ్రీనివాసులు. తొండమానుడు చూస్తుండగానే దివ్యశరీరధారులై వైకుంఠధామానికి చేరారు భీమకులాల దంపతులు.

ఇదంతా ఆశ్చర్యంగా చూసిన తొండమాను “ప్రభూ! నా సంగతేమిటి” అని ప్రాధేయపడ్డడు. అప్పుడు జగన్నాథుడు “రాజా! తరువాత జన్మలో నీవు విరాగివై నా ఏకాంతభక్తుడవు అవుతావు. అప్పుడు తప్పక నీకు ముక్తి లభిస్తుంది” అని చెప్పి తొండమానుని ఊరడించాడు. ఇలా తొండమానునికి భీమునికి ముక్తిని ప్రసాదించాడు శ్రీవేంకటేశుడు.

పిల్లలూ! ఈ కథలోని నీతిని మరొక్కమాఱు చూద్దాము:

  1. అహంకారం ఎంతవారికైనా ఎంతకొంచమైనా తగదు. మహనీయుడైన తొండమానునికే అహంకారము వలన భంగపాటు తప్పలేదు. ఇక సామాన్యులమైన మనసంగతి ఏమిటి? కాబట్టి మనమెల్లప్పుడు వినయవిధేయతలతో ఉండాలి.
  2. కులధర్మం కర్తవ్యం పాటిస్తూ స్వామిని నిష్కల్మష భక్తితో కొలిచే వారిని కరుణిస్తాడు భగవంతుడు అని నిరూపించాడు భీముడు. కులం కన్నా గుణం ప్రధానం కదా!

Search Terms: Tondaman, Tondamaan, Bhima Kulaala, Tamaalini, Tamalini, Venkateswara, Venkateshwara.


శుక్రాచార్యులు కచుడు – ఆదర్శ గురుశిష్యులు

డిసెంబర్ 29, 2006

(kacha.pdf)

మహాభారతము లోని కథ

ఇది క్షీరసాగర మంథనమునకు పూర్వం జరిగిన కథ. దేవదానవులకు అమృతకలశం అప్పటికింకా లభించలేదు. దేవదానవ యుద్ధాలు అతి భీకరముగా జరిగేవి. ఇరుపక్షాల ఎందఱో సైనికులు అసువులు బాసేవారు. ఇలావుండగా రాక్షసుల గురువైన శుక్రాచార్యుడు తీవ్ర తపస్సుచేసి మృతసంజీవనీ విద్యను సంపాదించాడు. ఇంకేమున్నది? యుద్ధములలో చచ్చిన రాక్షసులను సంజీవనీ విద్య ద్వారా బ్రతికించేవాడు శుక్రుడు. వాళ్ళు మళ్ళీ దేవతలపై పడి పోరుసాగించేవారు. దేవతలు ఎంత బలవంతులైనా ఇలా జరిగేసరికి వారి శక్తి క్షీణించసాగినది. మంచికి అపజయం కలుగుట చూడలేని దేవతాగురువు బృహస్పతుల వారు తన కుమారుడైన కచుని పిలిచి శుక్రుని శిష్యుడవై మృతసంజీవని అభ్యసించిరమ్మని ఆదేశించాడు.

పాపభీతి లేని రాక్షసులతో వ్యవహారము తన కుమారుని ప్రాణాలకే అపాయమని తెలిసికూడా ధర్మస్థాపనార్థం తన కుమారుని ఆ అసాధ్యకార్యము నిర్వర్తించుకొని రమ్మని పంపినాడు బృహస్పతి. పిత్రాజ్ఞాపాలకుడైన కచుడు వెంటనే బయలుదేరి శుక్రాచార్యుని వద్దకు వెళ్ళి సాష్టాంగ ప్రణామము చేసి “గురుభ్యోనమః స్వామీ నేను ఆంగీరస గోత్రజాతుడను. దేవగురువులైన బృహస్పతులవారి తనయుడను. నన్ను కచుడని పిలుస్తారు. విద్యార్థినై మీ వద్దకు వచ్చాను” అని ప్రార్థించాడు. కచుని వినయానికి సంతోషించి శుక్రుడు “నాయనా! వినయవిధేయతలే విద్యార్జనకు ప్రథమ సోపానాలు. నీవంటి అర్హుడిని శిష్యుగా స్వీకరించుట నాకు ఆనందదాయకము” అని ఆశీర్వదించి తన శిష్యబృందములో చేర్చుకొన్నాడు.

కచుడు రోజూ సూర్యోదయాత్పూర్వమే లేచి కాలకృత్యాలు తీర్చుకుని సలిలోదకాలతో స్నానాది క్రియలు నిర్వహించి సంధ్యావందనాది ఆహ్నికాలు యథావిధిగా చేసేవాడు. తీవ్రమైన బ్రహ్మచర్య నిష్ఠను అవలంభిస్తూ ఎంతో ప్రీతితో గురుశుశ్రూష చేసేవాడు. భక్తి ఏకాగ్రతలతో వేదశాస్త్రాలు అభ్యసించేవాడు.

శుక్రాచార్యునికి యవ్వని త్రిలోకసౌందర్యవతి దేవయాని అను పేరుగల కుమార్తె ఉండేది. ఆమె సౌందర్యం అద్వితీయమ్. పైగా కచునిపై మనసుపడింది. కానీ కఠోర బ్రహ్మచర్యవ్రతుడైన కచుడు ఆమెను సరిగా చూడనుకూడా లేదు. కచుడు గురుపుత్రి అయిన దేవయానిని సోదరిగా భావించేవాడు. కచుని వినయం సంస్కారం విద్యలపైనున్న కుతూహలం అతనిని శుక్రునికి ఎంతో ప్రియునిగా చేసినాయి.

కచుని మంచితనం చూచి అసూయతో మిగతా రాక్షస శిష్యులందఱూ సమావేశమై ఇలా అనుకొన్నారు “వీడు మన శత్రువుల పక్షము. వీడికి మృతసంజీవనీ విద్య లభిస్తే అది మనకు అపాయకరము. కనుక వీడిని చంపి పారేద్దాము”. శుక్రుని గోవులను కాచి అడవినుంచి ఇంటికి తిరిగివస్తున్న కచుని నిర్దాక్షిణ్యంగా చంపేశారు ఆ రక్కసులు. కచుడు రావటం ఆలస్యమైనదని చింతించి దేవయాని తండ్రితో “నాన్నా! ఎంత అవసరం వచ్చినా కనీసం సాయంకాల సంధ్యావందన సమయానికైనా ఆశ్రమానికి తిరిగి వచ్చేవాడు కచుడు. కానీ ఇవాళ ఇంత ప్రొద్దెక్కినా ఇంత వరకూ రాలేదు. దయచేసి మీ దివ్యదృష్టితో కచుని జాడ తెలుసుకోండి” అని ప్రార్థించింది. శుక్రుడు దివ్యదృష్టితో జరిగినది తెలుసుకున్నాడు. వెంటనే తన మృతసంజీవనీ విద్యతో కచుని బ్రతికించాడు.

ఈర్ష్యాగ్నిచే జ్వలించబడుతున్న రాక్షసులకు ఈ విషయము తెలిసినది. మరునాడు మళ్ళీ కచుని సంహరించి దేహాన్ని కాల్చి బూడిద చేసి దాన్ని మదిరలో కలిపి వినయంగా శుక్రిని ఇచ్చారు. శుక్రుడు ఆ మదిరను పానముచేశాడు. కచుడు ఎంతకీ రాకపోయేసరికి దేవయాని మళ్ళీ తండ్రితో మొరపెట్టుకున్నది. శుక్రుడు దివ్యదృష్టితో జరిగినది తెలుసుకుని ఎంతో బాధ పడి “ఈ రాక్షసులు చాలా కిరాతకులు. తెలియకుండా నేనెంత తప్పుచేసాను! ఈ మదిరాపానము చాలా ఘోరమైనది. దీని మత్తు ప్రభావము వలన నా వివేచన నశించినది” అనుకొని ఇకపై ఎవరిచే ఇట్టి తప్పులు జరుగరాదని ఈ విధముగా కట్టడి చేసినాడు:

“ఎంత కొంచమైననూ మదిరాపానము చేయరాదు. అది మహాపాపము”. ఇలా ధర్మనియమం తెలియజెప్పి మళ్ళీ ఇలా అన్నాడు “కానీ తెలిసిచేసినా తెలియక చేసినా తప్పు తప్పే కదా! నేను చేసిన తప్పును సరిదిద్దుకొనెదను. మృతసంజీవనీ విద్యను నా కడుపులో సూక్ష్మ రూపములో ఉన్న కచునకు ఉపదేశించెదను. ఆపై అతనిని బ్రతికించెదను. కచుడు నా ఉదరము చీల్చుకువచ్చి మృతుడనైన నన్ను బ్రతికించెదడు”. శుక్రుడు అలాగే చేశాడు. కచుడు శుక్రగర్భం నుంచి బయటకు వస్తూనే గురువు గారిని బ్రతికించినాడు. ప్రణామము చేసి శుక్రుని వద్ద సెలవు తీసుకొని ఇంటికి బయలుదేరినాడు.

అప్పుడు దేవయాని తన ప్రేమను వ్యక్త పఱచి తనను వివాహమాడమని నిర్బంధించింది. అంతట కచుడు “సోదరీ! నీవు నా గురు పుత్రికవు. కావున నాకు చెల్లెలివి అవుతావు. నీకిట్టి అధర్మ కోరిక కలుగరాదు” అని హితవు చెప్పాడు. నిరాకరించిన కచునిపై క్రోధిత అయి దేవయాని కచుని ఇలా శపించినది “నన్ను హింసించిన ఫలముగా ఈ విద్య నీకు ఉపకరించదు పో”! దేవయాని అమాయకత్వాన్ని చూసి ఇలా సమాధానమిచ్చాడు కచుడు

“చెల్లీ! విద్య ఎన్నడూ నిరుపయోగం కాదమ్మా! ఈ విద్య నాకు ఉపకరించక పోతేనేమి? అర్హులైన పరులకు నేర్పి వారికి ఉపయోగపడతాను. సమాజశ్రేయస్సుకై నా విద్య ఉపకరించుట కన్న నాకేమి కావాలి”? అని చెప్పి ఆనందముగా తిరిగి వెళిపోయాడు కచుడు.

పిల్లలూ! మనమీ కథలోని నీతులను మరొక్కమాఱు చూద్దాము:

  1. దేశంకోసం ఒక గ్రామాన్ని, గ్రామం మేలుకై ఒక కుటుంబాన్ని, కుటుంబ శ్రేయస్సుకై ఒక కుటుంబ సభ్యుని త్యజించుట ధర్మము. ఈ సూక్ష్మం ఎఱిగిన బృహస్పతి తన ప్రియ కుమారుని ప్రాణాలను సైతం లెక్కసేయక దేవతలను కాపాడటానికి కచుని రాక్షస గురువు వద్దకు పంపించాడు.
  2. శత్రువని తెలిసి కూడా అర్హుడైన వాడు కాబట్టి కచునికి సంతోషముగా విద్యనేర్పించి ఆదర్శ గురువైనాడు శుక్రుడు. కచుడు శ్రద్ధాభక్తులతో విద్యలను అభ్యసించాడు. దేవయాని పట్ల ప్రవరాఖ్య నిగ్రహం చూపించి ఉత్తమ శిష్యుడైనాడు కచుడు. కావున మనకు ఈ శుక్రకచులు ఆదర్శప్రాయులు కావాలి.
  3. ఈర్ష అనేది పెనుభూతము. మత్సరముచే దారుణముగా కచుని చంపివేసినారు రాక్షసులు. అట్లు చేసి కచునికి సంజీవనీ మంత్రోపదేశం కలుగుటకు చేచేతులారా వారే కారణమైతిరి. వివేకహీనులు తెలియకనే వారికి వారే కీడు కలిగించుకొనెదరు.
  4. మదిరాపానము మహాపాపము (శంఖలిఖితుల కథ చూడండి). ఈ విషయమును మరొక్కమాఱు మనకు తెలియజేశాడు శుక్రుడు.
  5. గురుపుత్రిక సోదరి అని గ్రహించి దేవయానిని సోదరీభావముతో చూసిన కచుని ధర్మజ్ఞత మనకు కనువిప్పు కావాలి.
  6. చోరులచే చోరింపబడనిది అర్హులకు పంచి ఇస్తే పెరిగేదీ విద్యాధనమొక్కటే. విద్య యొక్క గొప్పతనము మనకు కచుని అమృతవాక్కుల ద్వారా ఈ కథలో తెలిసినది. మనమెప్పుడూ సమాజశ్రేయస్సునకే విద్యను ఉపయోగించాలి. విద్యాభ్యాసమునకు సార్థకత అప్పుడే కలుగును.

Search Terms: Kacha, Kaca, Shukra, Sukra, Shukraachaarya, Devayani, Devayaani.


శ్రీకృష్ణ లీలలు – వ్యోమాసుర భంజనమ్

డిసెంబర్ 28, 2006

(vyomasura.pdf)

శ్రీ గర్గభాగవతము లోని కథ

ఒకరోజు నందనందనుడు గోపాలురతో కలిసి ఆడుచుండెను. కొందఱు గోవులుగా మరికొందఱు మేకలుగా కొందఱు చోరులుగా మరియు కొందఱు పసులకాపరులుగా విడివడి ఆడుచుండిరి. కంసప్రేరితుడైన వ్యోమాసురుడు చోరుల గుంపులో చేరి గోవులుగా మేకలుగా గోపాలురుగా నటిస్తున్న బాలులను ఎత్తుకొని పోయి ఒక బిలమున దాచి బిలద్వారము మూసివేసెను. పరమాత్మ అది గ్రహించి రక్కసుని రెండుకాళ్ళు పట్టుకొని గిరగిరా త్రిప్పి నేలపై విసిరిగొట్టెను. మృతుండైన వ్యోమాసురుని లోని తేజస్సు పరమాత్మలో లీనమయ్యెను.

(ఈ బొమ్మ చూడండి)

వ్యోమాసురుని చరిత్ర

పూర్వం మహాపుణ్యక్షేత్రమగు భవ్య కాశీనగరమును భీమరథుడు అను రాజేంద్రుడు పరిపాలించెడివాడు. అతడు మేధావి దానశీలి ధర్మజ్ఞుడు పైగా శ్రీహరి భక్తుడు. రాజ్యభారమును యోగ్యుడైన కుమారునికి అప్పగించి రమేశుని పై అనురక్తుడై తపముకై మలయపర్వతమునకు ఏగెను. అక్కడ ఆశ్రమములో నివసించి తపమును సాగించుచుండెను.

ఒకనాడు బ్రహ్మమానస పుత్రుడు పరమపూజ్యుడు అయిన పులస్త్య మహర్షి శిష్యవర్గముతో భీమరథుని ఆశ్రమమునకు వచ్చెను. త్రిలోకపూజ్యుడైన పులస్త్యునకు రాజు నమస్కరించెనే కానీ యథావిధి అతిథి సత్కారము చేయలేదు. ధర్మము తప్పినందుకు మహర్షి “రాజా! ఇంటికి వచ్చిన వానిని సత్కరింపకుండుట అసురలక్షణము. కావున నీవు రాక్షసుడివి కమ్ము”! అని శపించెను. పశ్చాత్తాపముతో శరణువేడిన రాజును కరుణించి పులస్త్యుడు “నీ దుష్కర్మకు ఫలితమనుభవించక తప్పదు. కానీ నీవు అఖండ విష్ణుభక్తుడవగుటచే నీకు ద్వాపరయుగములో శ్రీకృష్ణపరమాత్మ అనుగ్రహము కలుగును. భగవంతుడు భక్తుల కెన్నడు అపజయము కలిగించడు కదా!” అని ఆశీర్వదించెను. ఆ భీమరథుడే వ్యోమాసురుడు.

కావున పిల్లలూ! మనమెన్నడు ఇంటికి వచ్చిన అతిథిని సత్కరింపక ఉండరాదు. అభ్యాగతః స్వయం విష్ణుః అన్న సూక్తిని మఱువరాదు.

Search Terms: Krishna, Vyomasura, Vyomaasura, Bhimaratha, Bheemaratha.


నాడీజంఘుని క్షమాగుణమ్

డిసెంబర్ 27, 2006

(nadijangha.pdf)

మహాభారతము లోని కథ

పూర్వం ఒకానొక గ్రామములో బ్రాహ్మణాధముడొకడు ఉండేవాడు. అతడు తన స్వధర్మమును వీడి వేదశాస్త్రాధ్యయనములు మఱచి చివరికి ఒక బోయదాని వివాహమాడి మాంస భక్షకుడై నిత్యము హింసాజీవితాన్ని గడపసాగినాడు. ఇంద్రియసుఖములే ఉత్తమమనుకొనేవారు విషయవాంఛలతో లోకోపకరమైన ధర్మమును విడనాడి మహాదురితాలను సైతం చేయుటకు వెనుకాడరు కదా!

అతడొకమాఱు ధనాపేక్షతో కొందఱు వ్యాపారులతో కలసి వాణిజ్యార్థము దేశాంతరం వెళ్ళాడు. మార్గమధ్యములో ఒక భీకరకాంతారమును వారు దాటుచున్నప్పుడు మత్తగజమొకటి వారిని తరిమినది. ప్రాణభీతితో వారు తలకొకవైపుకు పరుగులెట్టారు. ధర్మభ్రష్టుడైన బ్రాహ్మణుడలా తన మిత్రులనుండి దూరమై గహనాటవిలో దారిదప్పి తీవ్ర క్షుత్పిపాసలతో సొమ్మసిల్లి ఒక పెద్ద మఱ్ఱిచెట్టు వద్ద కూలబడ్డాడు.

ఆ వృక్షము నాడీజంఘుడనే ధర్మవర్తనుడైన బకరాజు నివాసము. నాడీజంఘునికి “రాజధర్ముడు” అనే సార్థక బిరుదు కూడా ఉన్నది. సృష్టికర్త అయిన చతుర్ముఖుడు నాడీజంఘుని మిత్రుడు. ఆకలిదప్పులతో వచ్చిన భ్రష్టవిప్రుని చూసి నాడీజంఘుడు జాలిపడి అతిథిభావముతో అతని సత్కరించి ఫలోదకాలిచ్చి తృప్తి పఱచినాడు. తన పెద్ద రెక్కలను విసనకఱ్ఱ వలె వీచి సేదతీర్చాడు. అప్పటికే రాత్రి అవడముతో నాడీజంఘుడు విప్రాధమునితో ఇలా అన్నాడు “మహానుభావా! మీరు నాకు మిత్రులైనారు. మిత్రుని బాధలు తీర్చుట కనీస కర్తవ్యము. ఇక్కడికి మూడుయోజనాల దూరములో మధువ్రజమనే రాజ్యమున్నది. దాని రాజైన విరూపాక్షుడు నా ప్రియమిత్రుడు. అతడు రాక్షసుడైననూ పరమశాంతుడు ధార్మికుడు. అతని వద్దకు మీరు వెళితే తప్పక మిమ్ము సత్కరించగలడు. ఱేపు ప్రొద్దున్నే బయలుదేరి వెళ్ళవచ్చు. ఇప్పుడు నిశ్చింతగా విశ్రమించండి”.

అతిథిసేవా నిరతుడైన నాడీజంఘుడిలా వాక్సుధలను చిలికించి బ్రాహ్మణుని వన్యమృగాలనుండి కాపాడుటకై రాత్రంతా మేల్కొని రక్షణనిచ్చాడు. ఉదయాన్నే బ్రాహ్మణుడు మధువ్రజమునకు బయలుదేరినాడు. నాడీజంఘుని మిత్రుడని తెలియగానే విరూపాక్షుని వద్దకు బ్రాహ్మణుని సగౌరవముగా తీసుకువెళ్ళారు మధువ్రజ రాజసేవకులు.

ఒకవ్యక్తి ఆచరించే ధర్మాధర్మాలు భావాలు అతడి ఆకృతిలో స్పష్టముగా ప్రతిబింబిస్తాయి. ధర్మాత్ముడు పైగా రాజు అవడముతో బ్రాహణుడు కులభ్రష్టుడు నీచుడు అని చూడగానే పసిగట్టాడు విరూపాక్షుడు. కానీ నాడీజంఘుని మిత్రుడు అని అతనిని సగౌరవముగా సత్కరించి ఎంతో ధనమిచ్చి పంపించాడు విరూపాక్షుడు. మోయలేనన్ని ధనరాసులను పేరాశతో మోస్తూ తిరిగి నాడీజంఘుని నివాసము చేరాడు పతిత బ్రాహ్మణుడు. నాడీజంఘుడు మళ్ళీ యథావిధిగా ఆతిథ్యమిచ్చి సేదతీర్చాడు. అలసి ఉన్న బ్రాహ్మణుడు ఆదమఱచి నిదుర పోయాడు.

మన జీవన విధానం మన ఆలోచనల్ని బుద్ధిని ప్రభావింపజేస్తుంది (సత్యసంధః కథలో సీతమ్మ చెప్పిన ఋషికథ ఇందుకు నిదర్శనము). కనుకనే భారతీయులు సద్భావ సత్ప్రవర్తనలను ఆచారముల ద్వారా వారి దైనందిన జీవితములలో అలవరచుకుని ఎల్లప్పుడు ధర్మమార్గముననే చరిస్తారు. దయయే స్వభావముగా కలిగి దయాళువు అయినవాడే విప్రుడు. అట్లుకాక నిరంతరము కౄరకర్మములు చేయుట వలన ఆ పతిత బ్రాహ్మణుని బుద్ధి వక్రమైనది. అన్నం పెట్టి ఆదరించి క్రొత్త జీవితాన్ని ప్రసాదించిన నాడీజంఘునిలో పతితబ్రాహ్మణునికి భగవంతుడు కనబడలేదు. ఒక రుచికరమైన భోజనం కనబడింది! బలిష్టమైన నాడీజంఘుని దేహాన్ని బ్రాహ్మణుడు చూచి ఇలా అనుకొన్నాడు “ఱేపటి నుంచి నేను ఇల్లు చేరేలోపల మళ్ళి ఆహారము దొరుకుతుందో లేదో. పైగా ఈ కొంగ బలిష్టముగా ఉంది. దీని మాంసము ఎంతో రుచికరముగా ఉంటుంది. దీన్ని చంపి మాంసము మోసుకు వెళతాను”. వెంటనే దొడ్డుకఱ్ఱ తీసుకొని నాడీజంఘుని తలపై బలంగా కొట్టాడు. ఆ శిరోఘాతానికి అసువులు బాసాడు నాడీజంఘుడు! చర్మం వొలిచి మాంసాన్ని మూటకట్టుకొని ప్రణాయమయ్యాడా దురితుడు.

మనకు ప్రియులైన వారు ఎంత దూరములో ఉన్నా వారికి ఆపద వస్తే మన హృదయం స్పందిస్తుంది. తన ప్రియమితునికి ఏదో కీడుసంభవించిందని తెలుసుకొని విరూపాక్షుడు తన సైనికులను విషయము కనుక్కొని రమ్మని పంపించాడు. వారు జరిగిన దారుణము తెలుసుకొని విరూపాక్షునికి నివేదించారు. అతని ఆజ్ఞపై పతితవిప్రుని బంధించి తెచ్చారు. కృతఘ్నుడు మిత్రద్రోహి అయిన బ్రాహ్మణుని చూచి విరూపాక్షుడు “భటులారా! కృతఘ్నతకు మించిన మహాపాపములేదు. వీడిని ఖండఖండాలుగా నరికి తినివేయండి. రాక్షసులు కాబట్టి మీరు నరమాంసము తినవచ్చు” అని ఆజ్ఞాపించాడు.

“క్షమించండి మహారాజా! ఇటువంటి పాపాత్ముడి మాంసం వాసనకూడా మేము చూడలేము” అని భటులుచెప్పి కుక్కలకు వేశారు. కుక్కలు కూడా ఆ కృతఘ్నుని మాంసము ముట్టలేదు!

నాడీజంఘుని శరీరభాగాలు ఒకచోటచేర్చి దహనసంస్కారాలు యథావిధి కర్మకాండ చెశాడు విరూపాక్షుడు. విధాత తన ప్రియమిత్రుని మరణవార్త విని వెంటనే కామధేనువును నాడీజంఘుని బ్రతికించమని ఆజ్ఞాపించాడు. గోక్షీరములోని అమృతశక్తి ప్రభావముతో నాడీజంఘుడు పునర్జీవితుడైనాడు. బ్రతికిన మిత్రుని చూసి ఎంతో సంతోషించి ఆలింగనము చేసుకొని జరిగినదంతా వివరించాడు విరూపాక్షుడు.

తన ఇంటికి వచ్చిన అతిథి మిత్రుడు అయిన బ్రాహ్మాణుడు సంహరించబడ్డాడని తెలుసుకొని బాధపడ్డాడు నాడీజంఘుడు! వెంటనే బ్రహ్మదేవుని పతితబ్రాహ్మణుని బ్రతికించమని ప్రాధేయపడ్డాడు. విరించి రాజధర్ముని క్షమాగుణాన్ని చూచి అబ్బురపడి అతని ధర్మజ్ఞతకు సంతసించి భ్రష్టవిప్రుని బ్రతికించినాడు. విరూపాక్షుడిచ్చిన ధనము మరల ఇప్పించి సగౌరవముగా బ్రాహ్మణుని ఇంటికి పంపించాడు నాడీజంఘుడు!

ఇది చూసి నాడీజంఘుని మెచ్చుకొని బ్రహ్మదేవుడిలా అన్నాడు “నాడీజంఘుని ఔదార్యముతో ఇప్పుడు బ్రతికిపోయినా ఈ అధమునికి నిష్కృతిలేదు. జన్మజన్మాల వరకూ ఈ మహాపాపము వాడిని క్షోభింపజేస్తుంది. చేసిన కర్మ చెడని పదార్థము. ఫలితమనుభవింపక తప్పదు. ఏ పాపానికైనా నిష్కృతి ప్రాయశ్చిత్తము ఉన్నదేమో కానీ కృతఘ్నతకు మిత్రద్రోహానికి మాత్రం లేదు.

మహాత్మా! రాజధర్మా! ప్రియమిత్రా నాడీజంఘా! నీ క్షమా గుణం అద్వితీయము. దేవతలు సైతం నీకు నమస్కరిస్తారు. శుభంభూయాత్”.

పిల్లలూ! ఈ కథలోని నీతిని మరొక్కమాఱు చూద్దాము:

  1. మన జీవన విధానం మన ఆలోచనల్ని బుద్ధిని ప్రభావింపజేస్తుంది. ఆచారముతోనే ధర్మవర్ధనము జరుగుతుంది. దైవభీతి పాపభీతి లేనివాడు తనకుతానే కాక సమాజానికి కూడా హానికరము. స్వధర్మమును వీడిన బ్రాహ్మణుడు ఎన్నో దురితాలు చేసి భ్రష్టుడైన వైనం మనకు కనువిప్పు కావాలి.
  2. నాడీజంఘుని (రాజధర్ముని) అతిథిసేవ మిత్రవాత్సల్యం క్షమాగుణములు మనకు ఆదర్శప్రాయములు. ధర్మవర్తనులమైతే బ్రహ్మలోక ప్రాప్తి కరతలామలకము అని నాడీజంఘుడు మనకు చూపినాడు.

Search Terms: Nadijangha, Naadii jangha, Virupaksha, Vipruupaaksha.


భూతదయ

డిసెంబర్ 26, 2006

(bhutadaya.pdf)

పెద్దలు చెప్పిన నీతికథ

అది భవ్యమైన ఉజ్జయినీ నగరపు రాచవీధి. ప్రొద్దుకుంకినా ఆ దారిలోని దేశవిదేశ వర్తకుల సంఖ్య బేరసారాలాడుతున్న జనావళి రద్దీ తగ్గలేదు! రాత్రి కొంత గడచిన తరువాత కాస్త కాస్తగా రద్దీ తగ్గటం మొదలుపెట్టింది. ఇంతలో తేనెలమ్మే ఒక వయ్యారి తన వన్నెచిన్నెలు ఒలకబోస్తూ ఆ వీధివెంట వచ్చి బుట్ట క్రిందికి దించి అమ్మకం మెదలుపెట్టింది. నిమిషములో కొన్ని లక్షలాది చీమలు మధువు కోసం ఆ వన్నెలాడి తేనె బుట్ట వద్దకు చేరినాయి. చీమల పుట్టలు చూసి వాటిని బఠానీల్లా నములుదామని ఒక తొండ అక్కడికి వచ్చింది.

రాత్రంతా నగరంలోని వేడుకల వలన జనసంచారమునకు భయపడి బయటకురాని ఎలుక తొండకోసం వచ్చింది. పిల్లిగారు ఆ తొండని గుటకాయస్వాహా చేద్దామని పొంచినిలిచినారు. పిల్లికోసం కుక్క కూడా అక్కడికి వచ్చింది. రాచవీధిలోని వేటకుక్కలు ఊరికుక్కని చూసి హంగామా చేశాయి.

ఇంతలో ఒక మాంత్రికుడు తన మంత్రశక్తి ద్వారా అడవిలోని ఒక పెద్దపులిని బంధించి రాచవీధిన తెస్తున్నాడు రాజుగారికి చూపించి మెప్పుపొందుదామనే ఉద్దేశ్యముతో. పౌరుషంలేని పులిని చూసి వేటకుక్కలు మీదపడ్డాయి. మరే జంతువైనా మంత్రించి బంధించేసేవాడు మాంత్రికుడు కానీ రాజుగారి వేటకుక్కలయ్యేసరికి కిమ్మనక ఉండిపోయాడు. ఈ గందరగోళానికి రాచభటులు ఆ పై మహామంత్రిగారు అక్కడికి వచ్చి పరిస్థితులను సమీక్షించి రాజుగారికి నివేదించారు. రాజుగారు “నగరపు ముఖ్యవీధిలోనే ఇంత అల్లకల్లోలం ఎందుకు జరిగింది?” అని ప్రశ్నించాడు.

సూక్ష్మబుద్ధి అయిన మహామంత్రి ఇలా సమాధానమిచ్చినాడు “ప్రభు! కొద్దికాలముగా మన దేశములోని యువత రాత్రంతా వేడుకలతో సంబరాలతో గడుపుతున్నది. దీనివలన నిశాచరులైన జంతువులకు వేట కుదరటంలేదు. ఆహారము దొరకని కారణముగా ప్రకృతిలో ఈ అసహజస్థితి వచ్చినది. మానవునితో పాటు సహజీవనము చేసే భూతజాలములకు సైతం దయ చూపమని మన భారతీయ సంస్కృతి ఘోషిస్తున్నది కదా”!

ప్రజాహితుడైన ఉజ్జయినీ మహారాజు వెంటనే “రాత్రి ఒక జాము నగారా తరువాత వీధులలో జనసంచారము ఉండరాదు” అని దండోరా వేయించాడు.

పిల్లలూ! ఈ కథలోని నీతిని మరొక్కమాఱు చూద్దాము:

మన చిన్నప్పుడు అమ్మ “బాబూ! రాత్రయిందిరా! ఇంక ఆటలు మాని ఇంటికి రారా. వేళకానివేళ ఆడితే నేలతల్లి కోపిస్తుందిరా! మంచి పిల్లలు త్వరగా పడుకుని తెల్లవారకముందే లేస్తారు” అని చెప్పి మందలించిన సన్నివేశం మనందఱికీ గుర్తే. ఈ సూక్తి వెనుకనున్న తత్త్వం మనకు మహామంత్రి మాటల ద్వారా తెలిసినది. ఈ విధముగానే అన్ని ప్రాచీన ఆచార సాంప్రదాయాల వెనుక ఆరోగ్య, సామాజిక, ఆధ్యాత్మిక హేతువులు కలవు. వాటి వివరమెఱిగి అనాదిగా వస్తున్న ఆచారాలను కాపాడుకొంటూ ముందు తరాలకు అందించుట మన కనీసకర్తవ్యము.


శివస్వామి పుణ్యగాధ

డిసెంబర్ 25, 2006

(shivasvamipunyagadha.pdf)

శ్రీ స్కందపురాణము లోని కథ

పూర్వం చిత్రకేతుడనే ధర్మాత్ముడైన మహారాజు ఉండేవాడు. అతడొకనాడు ధర్మజిజ్ఞాసతో మహానుభావుడైన శౌనకమహర్షిని ఇలా ప్రార్థించాడు “స్వామి! నాయందు దయ ఉంచి సర్వలోక హితావహమైన ధర్మము యొక్క మాహాత్మ్యమును తేటపఱచి వివరింపుడు”. చక్రవర్తి యొక్క కుతూహలమునకు సంతోషించి ఆ మహర్షి శివస్వామి పుణ్యగాధను వినిపించినాడు:

“అవంతీదేశములో శివస్వామి అనే ధర్మస్వాంతుడైన విప్రోత్తముడు ఉండేవాడు. అతడు కౌండిన్యగోత్రోద్భవుడు ధర్మస్వామి కుమారుడు. శివస్వామి మిక్కిలి పితృభక్తి పరాయణుడు. మాతాపితరుల సేవే మాధవసేవ అన్న ఉక్తిని నమ్మినవాడు. ఇలా ఉండగా కొంతకాలానికి ధర్మస్వామి కాలధర్మం చెందినాడు. యథావిధిగా శ్రద్ధతో పితృదేవునికి శ్రాద్ధకర్మలు చేసి సంవత్సరీకముల తరువాత శివస్వామి తీర్థయాత్రలకు బయలుదేరినాడు. తల్లిదండ్రులు బ్రతికి ఉన్నంతకాలమే కాక చనిపోయిన తరువాత కూడా వారిని మరిచిపోకుండా పూజించుట భారతీయుల సంప్రదాయము కదా!

హిమాద్రి మందరాచలము లోని సర్వతీర్థములను గంగాది నదులను సేవించుకొని గంగాద్వారములోని నరనారాయణుల ఆశ్రమానికి చేరి అక్కడ తపోనిష్ఠలో ఉన్న ఋషులను సందర్శించుకొన్నాడు. ఇలా ఉత్తరభారతములోని పుణ్యతీర్థాలు సేవించి దక్షిణాది పుణ్యక్షేత్రాలను దర్శించడానికి ఉత్సుకుడై అతి ఘోరమైన వింధ్యాటవిలోనికి ప్రవేశించినాడు. భయంకరమైన సింహాలతో పెద్దపులులతో భూతభేతాళ రూక్షరాక్షసులతో ముండ్లచెట్లతో కరాళ జ్వాలలతో భీకరముగా ఉంది ఆ కాంతారము. ధీరుడైన శివస్వామి తీర్థయాత్రలు చేయాలనే దృఢసంకల్పముతో ముందుకుసాగినాడు. ఒకచోట మానవుల ఎముకలప్రోవులు చూచి కలవరపడి వెనుతిరుగుట ఇష్టంలేక ముందుకు నడువసాగినాడు. ఇంతలో భయాకారులైన అయిదు ప్రేతలు శివస్వామి ముందు నిలిచినాయి. శివస్వామి నిశ్చేష్టుడైనాడు.

కొంతసేపటికి తేరుకొని ధీరత్వం తెచ్చుకొని కమండలములోని జలముతో ఆచమించి శుచి అయ్యి మనోవీధిలో ఆ పరమేశ్వరుణ్ణి ధ్యానించినాడు. ప్రేతలను “మీరెవరు? ఈ నిర్జనవనంలో ఏమిచేస్తున్నారు”? అని ప్రశ్నించినాడు. “మేమెవరమైతే నేమి? నిన్ను భక్షించుటకు వచ్చినాము” అన్న సమాధానము విని “జరామరణదుఃఖాలను తొలగించే మహేశ్వరుణ్ణి స్మరిస్తున్నాను. ఆ భూతపతి తప్ప నాకు వేరు దిక్కులేదు. ఎవని పాదపద్మములను ఆశ్రయించి మార్కండేయాది మహర్షులు మృత్యువును జయించినారో అట్టి మృత్యుంజయుని ధ్యానిస్తున్నాను” అని అన్నాడు శివస్వామి. ఎవరైతే నిజమైన భక్తిశ్రద్ధలతో శూలపాణిని స్మరిస్తారో అట్టివారిని ఆ కాలకాలుడు కాలునిపాశమునుంచి కూడా రక్షిస్తాడు కదా!

శివశర్మ ఉమానాథ ధ్యానం చేశాడో లేదో అగ్ని వలె తేజోమయుడై వెలిగిపోయాడు. ఆ అగ్నితో తమ ముఖములు కాలుతున్నాయా? అనిపించి గడగడ వణుకుతూ ప్రేతలు ఏకకంఠముతో “విప్రోత్తమా! మా అవజ్ఞతను మన్నింపుము. నీవు నిజమైన విప్రుడవు. కావున అగ్నివలె వెలుగుతున్నావు. నీకు హానికలిగించు శక్తి మాకులేదు. పుణ్యమూర్తివైన నీవు ఎవరు?” అని ప్ర్రార్థించినారు. శివస్వామి తన గురించి చెప్పి “మీరెవరు? పాపచిత్తముతో నన్ను భక్షించడానికి ఏల వచ్చినారు? మీ వికృతాకారాలకు కారణములేమి?” అని అడిగినాడు.

మొదటివాడు: ఆర్యా! నేను స్థూలదేహుడను. నేను పూర్వజన్మలో విప్రధనమును అపహరించినాను. ఆడువారు పసివారు వృద్ధులు అన్న విషయం ఆలోచించక వారి ధనాన్ని దొంగిలించినాను. ఆ ఘోర పాపఫలితముగా నాకీ వికృతాకారము వచ్చినది. ఈ స్థూలదేహముతో నరకయాతనలు అనుభవించుచున్నాను. కాని ఏమి చేయగలను? చేసిన కర్మ చెడని పదార్థము కదా!

రెండవవాడు: స్వామి! నేను పరస్త్రీలనెందఱినో కామించినాను. నా ఘోరపాపకర్మ కారణముగా పీనమేఢ్రుడను అయినాను. నా శరీరమంతా ఎల్లప్పుడూ కాలిపోతున్నట్టుగా మండుతూ ఉంటుంది. చేసిన పాపమునకు ఫలితము అనుభవించ వలసినదే కదా!

మూడవవాడు: ద్విజోత్తమా! నేను గతజన్మలో అసత్యవాదిని. ఎప్పుడూ పరులను నిందించువాడిని. ఆ పాపప్రభావముచే ఇప్పుడు పూతివక్త్రుడిని అయినాను. నానోరు చీమునెత్తురులతో దుర్గంధభూయిష్ఠమై ఉంటుంది. నాలుక పురుగులు పట్టి ఉంటుంది. అహోరాత్రాలు నా ముఖము అగ్నిగుండము వలె మండిపోతూ ఉంటుంది. కర్మానుభవము తప్పదు కదా!

నాల్గవవాడు: భూసురేంద్రా! పోయిన జన్మలో నేను పిశినారిని. ఎంతో ధనము ఉండి కూడా కనీసము నా కుటుంబ పోషనార్థమైనా ధనవ్యయము చేయలేదు. ఎన్నడూ స్వాహాస్వధాలు దేవపితృకార్యాలు చేయలేదు. ఎవరికీ ఇంత పెట్టలేదు నేను తినలేదు. దేవపితృకార్యాలు చేయక కుటుంబాన్ని కృశింపచేశాను కావున ఇప్పుడు కృశశరీరుడనైనాను. అనుభవం అనే అగ్నిచే కానీ పాపరాసులు దహించబడవు కదా!

ఐదవవాడు: ఓ పుణ్యనిధి! ఏమి చెప్పను? నేను గడచిన జన్మలో నాస్తికుణ్ణి. మర్యాద కృతజ్ఞత లేకుండా వ్యవహరించేవాడిని. నిత్యమూ వేదనింద దేవనింద పూజ్య సాధుసజ్జన నింద చేసెడివాడిని. నా వాదాలు ఇలా ఉండేవి “ధర్మం సత్యం మోక్షం అనేవి కల్పితాలు. బ్రతికినంతకాలం సుఖంగా ఉండాలి. చచ్చిన తరువాత ఏమవుతుందో ఎవడు చూశాడు? ఆత్మ అంటే దేహమే. ఇంద్రియ భోగమే ఆనందము. చచ్చినవాడికి శ్రాద్ధం పెట్టడం అవివేకము. తిలోదకాలు పరలోక గతిని కలిగిస్తాయన్న మాటలు మూఢనమ్మకాలు. ఏలయన శ్రాద్ధములు ఎక్కడో పరలోకంలో ఉన్నవాడికి తృప్తి కలిగిస్తాయని అనడమే నిజమైతే గ్రామాంతరములో ఉన్నవానికి కూడా తృప్తి కలగాలి. కాని అట్లు జరుగుటలేదు కదా!”. ఈ విధముగా హేతువాదముచేసి శాస్త్రాలలో అంతకంటే గొప్పవిషయాలు ఉన్నాయని తెలుసుకోక మిడిమిడి జ్ఞానముతో నేనెంతో తెలివైనవాడినని తలచి నన్ను నేనేకాక నాతోటివారిని కూడా నమ్మించి పాడుచేసినాను. చేసిన దుష్టవాదానికి ఫలితముగా దీర్ఘజిహ్వుడిని అయినాను. ఎవరూ అనుభవించని దుర్భరక్లేశాలను అనుభవిస్తున్నాను. నాది స్వయంకృతాపరాధము. చేసి తప్పుకు నేనే కదా ఫలము అనుభవించాలి!

ప్రేతలు చెప్పిన దారుణ వృత్తాంతాలు విని స్వాభావిక దయార్ద్రుడైన శివస్వామి “అయ్యో! పాపమ్! దుష్టకర్ములు పాపాలకి ఫలితము ఈ లోకంలోనే కాక తరువాత కూడా అనుభవిస్తారు. పుణ్యపాప వలయములో చిక్కుకున్న వీరిని ఆ భగవంతుడే కాపాడాలి” అని అనుకొని “మీ అనుజ్ఞ అయితే వెళతాను. కాదు నన్ను భక్షించాలని ఉంటే నేను అందుకు సిద్ధముగా ఉన్నాను. నావల్ల మీ ఆకలి తీరుతుందంటే అంతకన్నా కావలిసినదేమి?” అని అన్నాడు. అప్పుడు ప్రేతలు “మహానుభావా! అగ్నిహోత్రమును భక్షించుట ఎవరి తరము? నీవంటి తేజస్విని మేమేమీచేయము. సుఖముగా వెళ్ళు. నీకు శివమగుగాక!

ఎంతో పుణ్యంచేసుకుంటే కానీ సత్సాంగత్యము కలుగదంటారు. మళ్ళీ మీవంటి పుణ్యాత్ముల సాంగత్య భాగ్యము కలుగునంత పుణ్యము మాకడ ఉన్నదోలేదో. కావున ఆపన్నులమైన మమ్ము ఉద్ధరింపుమని ప్రార్థన. అపకారికి సైతం ఉపకారము చేయుట సాధులక్షణము. కాబట్టి మేము చేసిన కీడు తలచక మమ్ము ఈ ఘోరయాతనల నుండి రక్షించు. మా కర్మప్రభావము వలన మాకు తర్పణలు ఇచ్చేవారు లేరు. కావున అతిపవిత్రమైన విరజ తీర్థములో మాకు తర్పణలు ఇవ్వు. నీవంటి మహనీయుడు మాకు తర్పణలు ఇస్తే మాకు తప్పక దురితనివారణం జరుగుతుంది” అని శివస్వామిని కోరినాయి. వెంటనే ప్రయాణమయ్యి సరిగ్గా శివరాత్రి రోజు విరజక్షేత్రం చేరినాడు. సంకల్ప సహితముగా తీర్థస్నానము చేసి యథావిధిగా శివరాత్రి వ్రతము చేసి శివభజనతో జాగరణము చేసి సూర్యోదయంలోని ఆహ్నికాలు తీర్చుకొని విధివిధానముగా తీర్థక్రమం నిర్వహించి శ్రద్ధతో పితరులకు తర్పణలిచ్చి పిండప్రదానము చేసినాడు. తరువాత పంచప్రేతలకు కూడా శ్రాద్ధాది క్రియలు చేసి ఆ పాపాత్ములను ఉద్ధరించినాడు.

కాబట్టి మానవుడు ఎల్లప్పుడు ధర్మమార్గములోనే నడవాలి. ధర్మవంతుడైన సజ్జనుడు తను తరించుటే కాక శివస్వామి వలె అందఱినీ తరింపచేయగలడు” అని చిత్రకేతునికి ధర్మబోధ చేసినాడు శౌనకమహర్షి.

పిల్లలూ! ఈ కథలోని నీతిని మరొక్కమాఱు చూద్దాము:

  1. చౌర్యము పరకాంతావ్యామోహము అసత్యము పరనింద కృపణత్వము నాస్తికత్వము వేద దైవ నింద కృతఘ్నత మహాపాపాలని మనకు ప్రేతల వాక్కుల ద్వారా తెలిసినది. కావున మనమెన్నడూ ఇట్టి పాపకార్యములను చేయరాదు.
  2. కృతజ్ఞతాపూర్వకముగా శ్రద్ధతో చేసే శ్రాద్ధాదికార్యముల ఔన్నత్యము మహాత్మ్యము మనకీ కథలో తెలిసినది. ఆర్తులు దుఃఖితులు పాపాత్ములైనాసరే వారికి తర్పణలు ఇచ్చి ఉద్ధరించిన వానికి అశ్వమేధయాగములు చేసిన పుణ్యము కంటే అధికము లభించునని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. ఒక మనిషి యొక్క జీవనము కేవలము తనవలనే కాదు అందుకు పరోక్షముగా సహకరించేవారు దైవము తల్లిదండ్రులు సాటి మనుష్యులు పశుపక్షాదులు జ్ఞానబోధకులైన మహర్షులు అని భారతీయుల సిద్ధాంతము. బ్రతికి ఉన్నవారినే కాక చనిపోయిన వారిని కూడా విధివిధాన పూర్వకముగా తలుచుకొని వారికి కృతజ్ఞతలను తెలుపుకునే భారతీయుల కృతజ్ఞతావైభవము ఊహాతీతము.

Search Terms: Shivasvami, Shivasvaami


శ్రీకృష్ణ లీలలు – ప్రలంబాసుర వధ

డిసెంబర్ 24, 2006

(pralambasura.pdf)

శ్రీగర్గభాగవతము లోని కథ

యమునాతీరములో ఉన్న పొగడ చెట్టు మీదకూర్చుని మధుర వేణుగానముతో శ్రీకృష్ణపరమాత్మ సామవేదసారాన్ని బోధించెడివాడు. ఎంతో ప్రియముగా లేలేత పసిరికను మేస్తున్న గోమాతలు ఆ మధుర వేణురవం వినగానే పసిరికను వదిలి నిశ్చేష్టులై బొమ్మలవలె నందబాలునివైపు చూస్తూ వేణుగానమును ఆస్వాదించెడివి. హంసలు బెగ్గురుపక్షులు సమాధినిష్ఠులవలె వేణుగానమును గ్రోలుచుండెడివి.

(ఈ బొమ్మ చూడండి)

పరమాత్మ గోపబాలులతో ఆడుచు పాడుచు నృత్యములు చేసెడివాడు. వారు గంతులువేస్తూ పరుగులెడుతూ పందెములు వైచుచూ కలహములాడుచూ క్రీడించుచుండెడివారు.

(ఈ బొమ్మ చూడండి)

pralamba-1.jpg

ఒకసారి వారు రెండు పక్షములుగా బారులుదీరి ఒకపక్షమునకు బలరాముని రెండవ దానికి శ్రీకృష్ణుని నాయకులుగా ఎంచుకొని ఆడుచుండిరి.

pralamba-2.jpg

గెలిచిన పక్షమువారిని ఓడినవారు భాండీరకమను వటవృక్షము కడకు మోయవలెనని పందెము. ఆటలో శ్రీకృష్ణుని పక్షము ఓడిపోయెను. భక్తుల వద్ద ఓడిపోవుట భగవంతునికి పరిపాటి కదా! పరమాత్మ ప్రియసఖుడైన శ్రీధాముని మోసెను. మారువేషములో వచ్చి శ్రీకృష్ణుని పక్షాన ఉన్నట్టు నటించి కంస ప్రేరితుడైన ప్రలంబాసురుడు అవతల పక్షములో ఉన్న బలరామదేవుని మోసెను.

ప్రలంబుని కపటము గ్రహించి బలరామస్వామి తన బరువు పెంచుకొనెను. మోయలేక దానవుడు నిజరూపము దాల్చెను. ప్రలంబుని బ్రహ్మరంధ్రము చిట్లునట్టు ఒక్క ముష్టిఘాతమిచ్చెను బలరాముడు. తల రెండు వ్రక్కలయి ప్రలంబాసురుడు ప్రాణములను విడచెను. వాని తేజము పరమాత్మలో లీనమయ్యెను.

pralamba-3.jpg

ప్రలంబాసురుని వృత్తాంతము

పరమశివుని ప్రియసఖుడు దిక్పాలకుడు యక్షేశ్వరుడు త్రిలోకపూజ్యుడు అయిన కుబేరుకి చైత్రరథము అను ఉద్యానవనము కలదు. పరమ శివభక్తుడైన కుబేరుడు చైత్రరథములోని పుష్పములన్నిటిని మహాదేవుని పూజకోసమే వినియోగించెడివాడు. కానీ కావలివాళ్ళు ఎంత అప్రమత్తులై ఉన్నా ఎవడో ఆ ఉద్యానవనములోని పుష్పములను అపహరించుచుండెడివాడు. అది తెలిసి కుబేరుడు పుష్పచౌర్యము చేసినవాడు రాక్షసుడై జన్మిస్తాడని శపించెను.

ఒకసారి హూహూ అను గంధర్వుని కుమారుడైన విజయుడు ఎన్నో తీర్థయాత్రలు చేసి కుబేరుని ఉద్యానవనము వద్దకు వచ్చెను. కుబేరుని అనుమతి గ్రహింపకనే ఉద్యానవనములోకి వెళ్ళి కొన్ని పువ్వులను గైకొనెను. యజమాని అనుమతి లేకనే పుష్పములు స్వీకరించిన కారణముగా విజయునికి పుష్పచౌర్య దోషము వచ్చెను. కుబేరుని శాపప్రభావముచే ప్రలంబాసురునిగా మారెను. పశ్చాత్తాపముతో కుబేరుని శరణువేడగా అభయమిచ్చి కుబేరుడు “నాయనా! తెలిసి ముట్టినా తెలియక ముట్టినా అగ్నిహోత్రము వలన చేయి కాలక మానదు కదా! అట్లే పాపము కూడా. కానీ పరమ భక్తుడవైన నీకు కడకు మేలు జరుగును. పాపఫలితమును అనుభవించిన తరువాత బలరామస్వామిచే సంహరించబడి ముక్తుడవు అవుతావు” అని ఆశీర్వదించెను. (హాహా హూహూ అను గంధర్వులు శాపగ్రస్తులై గజేంద్ర మకరములుగా జన్మలెత్తి శ్రీహరికృపచే కైవల్యమును పొందినవారు.)

పిల్లలూ! కాబట్టి మనమెన్నడూ ఇతరుల వస్తువులను వారి అనుమతి లేనిదే గైకొనరాదు. అట్లుచేసిన అది చౌర్యమగును (శంఖలిఖితులు కథ చూడండి).

Search Terms: Krishna, Balarama, Balaraama, Pralambaasura, Pralambasura


గౌతముడి ఏనుగు

డిసెంబర్ 23, 2006

(gautamunienugu.pdf)

మహాభారతము లోని కథ

ఒకసారి గౌతమ మహర్షి అడవిలో తపస్సు చేసుకుంటూ ఉండగా తల్లిలేని ఒక ఏనుగు పిల్ల కనిపించింది. స్వాభావికముగా దయార్ద్రహృదయుడైన ఆ గౌతముడు ఏనుగు పిల్ల మీద జాలిపడి దాన్ని ఆశ్రమానికి తీసుకు వచ్చి పెంచుకున్నాడు. కాలక్రమేణ అది పెరిగి పెద్దదయింది. ఇలా ఉండగా ఒకరోజు ధృతరాష్ట్రుడనే మహారాజు గౌతముని వద్దకు వచ్చి ఏనుగును తనకిమ్మని అడిగినాడు. గౌతముడు “తల్లీ తండ్రీ లేని ఈ ఏనుగును నా సొంత బిడ్డలా పెంచుకుంటున్నాను. ఇది నేను లేనప్పుడు నా ఆశ్రమాన్ని పరిరక్షిస్తుంది. యజ్ఞాలకు అడివినుంచి దర్భలు సమిధలు తెస్తుంది. కాబట్టి ఈ ఏనుగును కోరకు” అని చెప్పాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు “నీవు అడిగినన్ని గోవులు కావలిసినంత బంగారము ఇస్తాను. ఈ ఏనుగును నాకు ఇవ్వు” అని అన్నాడు. “రాజా! దీని చిన్నప్పటినుంచి ఎంతో ప్రేమగా పెంచుకుంటున్నాను. నీవు ఎన్ని గోవులిచ్చినా నాకు అక్కరలేదు. మునివేషములో ఉన్న నాకు హిరణ్యముతో అసలు అవసరములేదు” అని బదులిచ్చాడు గౌతముడు.

ధృతరాష్ట్రుడు “మునులకు అవసరమైనవి గోవులుకాని ఏనుగులు కావు. ఐశ్వర్య చిహ్నములైన ఏనుగులు రాజుల వద్దనే ఉండాలి కదా! రాజునైన నేను స్వయముగా వచ్చి ఏనుగును ఇమ్మనినా కాదంటావా?” అని న్యాయం అడిగాడు. అది విని సూక్ష్మబుద్ధి అయిన గౌతముడు “పుణ్యాత్ములు ఆనందించే పాపాత్ములు దుఃఖించే యమలోకానికి వేళదాము రా! యమసభలోనే న్యాయనిర్ణయం జరుగని” అని అన్నాడు.

ధృతరాష్ట్రుడు: “నాస్తికులు పాపాత్ములు సహింపరాని బాధలు పడతారు ఆ దారుణమైన యమలోకములో. నేను రాను.”

గౌతముడు: “సమవర్తి అయిన యమధర్మరాజు వద్దకు వెళదాము. అతనే న్యాయం చెప్తాడు.”
ధృతరాష్ట్రుడు: “అక్కాచెళ్ళెళ్ళను తల్లిదండ్రులను దయతో చూసుకునే వారే ఆయన దగ్గరకు వెళ్ళగలరు. నేను రాలేను.”

గౌతముడు: “అయితే వైకుంఠధామ సమానమైన గంగాతీరానికి వెళదాము. వస్తావా?”
ధృతరాష్ట్రుడు: “అతిథి అభ్యాగతులకు పెట్టి ఆ తరువాత తినే వాళ్ళే అక్కడికి వెళ్ళి పుణ్యం సంపాదించగలరు. నేనెందుకు వస్తాను?”

గౌతముడు: “పోని పవిత్రమైన మేరువనానికి రా!”
ధృతరాష్ట్రుడు: “సత్యము దయ మృదువర్తనము భూతదయ ఉన్నవాడే అక్కడికి వెళ్ళగలడు. వేరే చోటు చెప్పు.”

గౌతముడు: “విష్ణుస్వరూపుడైన నారదుని విహారస్థలానికి వెళదాము. పద! అప్సరసలు కిన్నెరులు ఉంటారక్కడ”
ధృతరాష్ట్రుడు: “సంగీత నృత్యాలతో దేవతార్చన చేసే పుణ్యాత్ములే వెళ్ళగలరక్కడికి. నావల్ల కాదు.”

గౌతముడు: “అలాగా! అయితే దేవతలు విహరించే ఉత్తర కురుభూములకు వెళదాం రా!”
ధృతరాష్ట్రుడు: “కామము హింస మొదలైనవి లేని వాళ్ళు అక్కడికి వెళతారు. వచ్చుట నా తరము కాదు.”

గౌతముడు: “అమృతకిరణాలను ప్రసరించి లోకాలను ఆనందమయము చేసే చంద్రుని వద్దకు వెళదాము. సరేనా?”
ధృతరాష్ట్రుడు: “దాననిరతులు పరమ శాంతచిత్తులు అక్కడికి వెళ్ళగలరు. వచ్చుట నాకు సాధ్యము కాదు.”

గౌతముడు: “సమస్త లోకాలకు అన్నప్రదాత ఆ సూర్యభగవానుడు. ఆయన వద్దకు వెళదాము. దయలుదేరు.”
ధృతరాష్ట్రుడు: “అమ్మో! తపస్స్వాధ్యాయనిరతులే ఆయన దర్శనము చేయగలరు. నన్ను విడిచిపెట్టు.”

గౌతముడు: “పోనీ వరుణుడి దగ్గరకు వస్తావా?”
ధృతరాష్ట్రుడు: “అగ్నిహోత్రము యాగాలు చేసిన వాళ్ళైతే ఆయన దగ్గరకు వెళ్ళగలరు.”

గౌతముడు: “దేవరాజైన ఇంద్రుని సన్నిధిలో న్యాయం అర్థిద్దాము.”
ధృతరాష్ట్రుడు: “శూరులు సోమయాజులు కానీ అక్కడికి వెళ్ళలేరు. నేను రాను.”

గౌతముడు: “ప్రజాపత్య లోకానికి వెళదాము.”
ధృతరాష్ట్రుడు: “అశ్వమేధ యాగాలు చేసిన వాళ్ళకు స్థానమది.”

గౌతముడు: “గోలోకం?”
ధృతరాష్ట్రుడు: “తీర్థాలు సేవించినవారు బ్రహ్మచర్య వ్రతం చేసిన వాళ్ళు గోలోకానికి చేరెదరు. నేనెలా రాగలను?”

గౌతముడు: “సరే! అయితే బ్రహ్మసభకు వెళదాము రా!”
ధృతరాష్ట్రుడు: “అసంగులు (లౌకిక బంధాలు లేనివారు) ఆధ్యాత్మవిద్య తెలిసిన వారు వెళ్ళగలరు అక్కడికి. నావంటి వాడు ఆ లోకము చూడనే లేడు.”

ధృతరాష్ట్రుని విజ్ఞానము చూసి గౌతముడు “మహానుభావా! నీవు దేవేంద్రుడవు. ఏ ఏ పుణ్యాలు చేస్తే ఏ ఏ లోకాలు వస్తాయో దేవేంద్రునికి తప్ప ఇంకెవరికి తెలుసు?” అని పాదాభివందనము చేశాడు గౌతముడు. “అయ్యా! నేను మారువేషం ధరిస్తే దేవతలే కనుక్కోలేరు. మీరు మహానుభావులు కాబట్టి నా నిజరూపం గుర్తుపట్టగలిగినారు. మీరు ఈ ఏనుగుతో సహా స్వర్గలోకానికి వచ్చి మమ్ము ఆనందపఱచండి” అని ప్రార్థించాడు దేవేంద్రుడు. సంతోషించి గౌతముడు తన ఏనుగుతో సహా స్వర్గానికి వెళ్ళాడు.

పిల్లలూ! ఈ కథలోని నీతిని మరొక్కమాఱు చూద్దాము:

ఏ పుణ్యకార్యములు మనము చేయవలెనో తద్వారా ఏ ఏ పాపకార్యములు మనము చేయకూడదో వివరముగా దేవేంద్రుడు మనకు ఈ కథలో బోధించినాడు. (ధృతరాష్ట్రుడు అంటే శరీరమును ధరించినవాడు. అంటే మానవుడు. కాబట్టి మావనుడు ఏ పుణ్యకార్యాలు చేయాలో మనకు ఈ కథలో తెలిసింది) కానీ అందఱూ అన్నీ చేయలేరు. ఉదాహరణకు కలియుగములో అశ్వమేధ రాజసూయ యాగములు చేసే అర్హత మానవులకు లేదు. కాబట్టి అందఱూ చేయదగ్గ పుణ్యకార్యాలు మనము తప్పకుండా చేయాలి: తల్లిదండ్రుల సేవ, అతిథిసేవ, సత్యం, భూతదయ, గీతనృత్యాదులతో దేవతార్చన, దానము, స్వాధ్యాయనము, తీర్థయాత్రలు, బ్రహ్మచర్య పాతివ్రత్యాది వ్రతములు.

Search Terms: Gautama, Indra, Devendra.


శ్రీకృష్ణ లీలలు – ధేనుకాసుర సంహారము

డిసెంబర్ 22, 2006

(dhenukasura.pdf)

శ్రీ గర్గభాగవతము లోని కథ

బలరామకృష్ణులు వివిధ వర్ణముల గోవులను చక్కగా అలంకరించి చూచువారి కన్నులపండగుగా ఆలమందలను తోలుకొని పోయేవారు. పవిత్రమైన గోధూళి తనపై పడాలని నందకిశోరుడు ఆలమందల వెనుక నడచుచుండెడివాడు. కానీ భక్తి అనే అమృతమును హృదయముల నిండా నింపుకొన్న గోమాతలకు పచ్చికబయళ్ళకన్నా పరమాత్మ సందర్శనమే మిక్కిలిప్రీతిని కల్గించుచుండెడిది. కావున గోమాతలు పరమాత్ముడైన యశోదాతనయుని చూడకపోతే అడుగులు ముందుకు వేసేవి కావు. అందుకని ఆ లీలామానుషవేషధారి తానే ఆలమందల ముందు నడుమ వెనుక ఉండి అందరికి ఆనందమును అందించెడివాడు. భక్తునికి భగవంతునికి గల సంబంధము అవ్యక్తమధురము కదా!

dhenuka-1.jpg

మధురానగరములో తీయ్యని తాటిపండ్లు గల తాళవనము ఒకటి ఉన్నది. కానీ ఆ వనములో నివసించు ధేనుకాసురునికి భయపడి గోపబాలురు ఆ వనములోకి మునుపెన్నడూ ప్రవేశించలేదు. శ్రీకృష్ణుని శక్తిపై పరిపూర్ణ విశ్వాసమున్న గోపబాలురు బలరామకృష్ణులను తాటిపండ్లు అప్పించమని కోరిరి. నిజభక్తుల కోరికలు స్వామి తీర్చకుండునా? వెంటనే బలరామకృష్ణులు తాళవనములో ప్రవేశించి తాళవృక్షములను గట్టిగా వూపిరి. తాళఫలములు క్రిందపడిన ధ్వనులు విని ధేనుకాసురుడు బలరామకృష్ణులను చూచినాడు. బలముగా తన వెనుకకాళ్ళతో బలరామదేవుని నాలుగుక్రోసుల దూరము పడునట్లుగా తన్నెను. చలించని బలదేవుడు వానిని తాళవృక్షమునకేసి కొట్టెను. కుపితుడై ఆ ధేనుకుడు గోపబాలుల వెంటబడెను. నందకిశోరుడు విసిరిగొట్టగా ధేనుకుడు గోవర్ధనిగిరి వద్ద పడి మూర్ఛిల్లెను.

కొంతసేపటికి తేరుకొని ధేనుకుడు నందనందనుని ఆకాశములోకి గొనిపోయి పోరుసల్పెను. పరమాత్మ వానిని నేలపైకి విసిరిగొట్టెను. గోవర్ధనగిరిని బంతివలె ధేనుకాసురునిపైకి విసిరెను. ధేనుకుడు ఆ గిరిని తిప్పికొట్టెను! శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని యథాస్థానములో ప్రతిష్ఠించి బలరామునికి సైగచేసెను. అంతట బలరాముడు పడికిలి బిగించి ధేనుకుని పొడిచెను. రక్కసుడు మరణించెను. వాని తేజము పరమాత్మలో లీనమయ్యెను.

dhenuka-2.jpg

ధేనుకాసురుని వృత్తాంతము:

పరమ విష్ణుభక్తుడైన బలిచక్రవర్తి యొక్క కుమారుడు సాహసికుడు. అహంకారి అయిన సాహసికుడు ఒకనాడు పవిత్రమైన గంధమాదన పర్వతములపై పదివేలమంది వనితలతో విహారములు చేసినాడు. ఆ పవిత్ర ప్రదేశములో ఘోరతపస్సు చేసుకొంటున్న దుర్వాసమహర్షికి సాహసికుని వలన తపోభంగమైనది. మహర్షి “ఓరీ! ఏమాత్రమూ వినయవిధేయతలు లేకుండా గార్దభమువలె ప్రవర్తించినావు. పవిత్రమైన ఈ పర్వతముపై విలాసవిహారములు చేసి నా తపస్సును భంగపఱచినావు. గార్దభమువై జన్మించు” అని సాహసికుని శపించెను. చేసిన తప్పుకు పశ్చాత్తాపపడి మహర్షిని శరణువేడినాడు సాహసికుడు. కరుణించి మహర్షి “నాయనా! అహంకారముతో మనసుకు నచ్చినట్లు చేయుట వివేకవంతుల లక్షణముకాదు. ఉత్తముడైన వాడు ధర్మబద్ధమైన కార్యములనే చేస్తాడు. కాబట్టి ఎప్పుడూ వినయమును కలిగి ధర్మమార్గముననే నడువవలెను. నీవు చేసిన తప్పుకు ఫలితమును అనుభవించిన తరువాత ద్వాపరయుగములో బలరాముని చేతిలో మరణించి ముక్తిని పొందుతావు” అని ఆశీర్వదించెను. ఆ సాహసికుడే ధేనుకుడు. పూర్వం ప్రహ్లాదుని కాచినపుడు స్వామి ప్రహ్లాదుని వంశమువారిని సంహరించనని వరమిచ్చెను. అందుకనే బలరామునికి ధేనుకాసురిని సంహరించమని సైగచేసెను.

కాబట్టి పిల్లలూ! మనము ఎల్లప్పుడూ వినయ విధేయతలు కలిగి ఉండాలి. మనకు ఇష్టం వచ్చినట్లు చేయక ధర్మబద్ధమైన కార్యములనే చేయాలి.

Search Terms: Krishna, Balarama, Balaraama, Dhenukaasura, Dhenukasura


సత్సాంగత్యము

డిసెంబర్ 21, 2006

(satsangatyam.pdf)

పెద్దలు చెప్పిన నీతికథ

దేవర్షి అయిన నారదడు సాక్షాత్ శ్రీమహావిష్ణువు యొక్క అవతారరూపుడు. అందుకనే యోగీశ్వరేశ్వరుడైన శ్రీకృష్ణుడు “దేవర్షీణాంచ నారదః” అని అన్నాడు. అట్టి మహనీయుడైన నారదుడు ఒకసారి శ్రీకృష్ణుని దర్శించుటకై వచ్చి దండప్రణామములు చేసి “భగవాన్! సత్సాంగత్యము యొక్క ఫలము దయచేసి వివరముగా చెప్పండి” అని కోరినాడు. జగద్గురువైన శ్రీకృష్ణుడు సత్సాంగత్య మహిమ అనుభవపూర్వకముగానే నారదునికి తెలియచేయాలని సంకల్పించి “నీవు తూర్పువైపుగా వెళితే ఒక పెంటకుప్ప కనిపిస్తుంది. అందులో ఉన్న పేడపురుగును సత్సాంగత్య మహిమేమని ప్రశ్నించు” అని చెప్పి జగన్మోహనముగా చిరునవ్వునవ్వాడు.

పరమాత్మ ఆదేశానుసారమే చేశాడు నారదుడు. నరద మహర్షి ప్రశ్న అడిగాడోలేదో గిలగిలలాడూతూ ప్రాణాలు విడిచింది ఆ పేడపురుగు. ఇలా జరిగిందేమని దుఃఖిస్తూ శ్రీకృష్ణుని వద్దకు వచ్చి జరిగినదంతా విన్నవించుకొన్నాడు నారదుడు. జరిగినది విని జగన్నాటకసూత్రధారి ఇలా అన్నాడు “ఇప్పుడు పశ్చిమదిశగా వెళ్ళు. ఒక పాడుపడిన దేవాలయము అందులో నివసిస్తున్న పావురము కనిపిస్తాయి. నీ సందేహమును అది తీర్చగలదేమో చూడు”. వెంటనే బయలుదేరి పావురమును కలుసుకొని తన ప్రశ్నవేశాడు నారదుడు. అదేమి చిత్రమో ఆ కపోతము నారద మహర్షి పాదలమీద పడి ప్రాణాలు విడిచింది. “ఇది ఏమి వింత? ఇంకా ఎన్ని విధాల ఆ భగవంతుడు నన్ను పరీక్షించదలచాడో?” అని చింతిస్తూ శ్రీకృష్ణుని వద్దకు వచ్చి జరిగినది విన్నవించుకొన్నాడు. “అలా జరిగిందా నారదా? అయితే ఈ సారి ఉత్తర దిక్కుగా వెళ్ళు. అక్కడి సంస్థానములోని మహారాజుకు చక్కని మగశిశువును పుట్టాడు. నీ సందేహమును ఆ శిశువు తీర్చగలదు” అని చెప్పి చిరునవ్వులొలకబోసాడు లీలామానుషవిగ్రహుడైన నందనందనుడు.

మొదటి రెండు మార్లు జరిగినది తలచుకొని కొంచెం సంకోచించాడు నారదుడు. సర్వజ్ఞుడైన స్వామి అది గమనించి “నారదా! నిర్భయముగా వెళ్ళు. ఈ సారి అంతా శుభమే జరుగుతుంది” అని ఆశీర్వదించాడు. వెంటనే నారదుడు బయలుదేరి ఆ శిశువు వద్దకు వచ్చి “ఓ పాపాయి! మహాత్ముల సాంగత్యము వలన కలిగే ప్రయోజనమేమిటి?” అని ప్రశ్నించాడు. నారదుడు ప్రశ్నించిన మరుక్షణం ఆ పసిపాప ఒక దేవతగా మారిపోయి భగవత్స్వరూపుడైన నారదునికి యథావిధిగా ప్రణమిల్లి ఆశ్చర్యముగా చూస్తున్న నారదునితో “దేవర్షి! అలా ఆశ్చర్య పోతున్నారేమిటి? పెంటకుప్పలోనున్న పేడపురుగును నేనే. అప్పుడు నా జన్మజన్మాంతరాల పుణ్యఫలము వలన అమోఘమైన మీ దర్శన భాగ్యము నాకు కలిగినది. మీవంటి దివ్యపురుషుల సందర్శన మాత్రముచే నాకు పావురము యొక్క జన్మ లభించినది. ఆ జన్మలో కూడా మీ దర్శనభాగ్యము లభించుటచే రాజపుత్రునిగా జన్మించినాను. మరల ఈ జన్మలో మీ దుర్లభ దర్శనము కలిగినందు వలన నాకు దైవత్వము లభించినది. మహాత్ముల సాంగత్యము యొక్క మహిమ ఇంతటిది!” అని అంటూ దేవలోకానికి వెళ్ళిపోయాడు.

పిల్లలూ! ఈ కథలోని నీతిని మరొక్కమాఱు చూద్దాము:

జగద్గురువులైన ఆదిశంకరులు

“సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలితత్వం నిశ్చలితత్వే జీవన్ముక్తిః ||”

అని ఉపదేశించినారు. అంటే జీవన్ముక్తికి ప్రథమ సోపానము సత్సంగత్యము. రాజకుమారుడు చెప్పినట్టు ఆ సత్సంగత్యము పురాకృతపుణ్యము వలన కలుగును. కాబట్టి మనకు మంచిపనులు చేస్తేనే సత్పురుషుల సాంగత్యము తద్వారా జీవన్ముక్తి కలుగుతాయి. ఈ కారణముగానే ఇంద్రునిచే శాపగ్రస్తుడైన యయాతి (యయాతి కథ చూడండి) కూడా కనీసం తనను సత్పురుషుల సాంగత్యములో ఉండనివ్వమని ప్రార్థించి సద్భువనములో ఉండుటకు దేవేంద్రుని వద్ద వరం పొంది తరించాడు. కనుక మనము ఎల్లప్పుడూ మంచివారితో ఉండి వారినుండి మంచిని గ్రహించి తరించాలి. దుష్టులకు ఎల్లప్పుడూ దూరముగా ఉండాలి.

Search Terms: Narada, Naarada, Krishna