దిలీప మహారాజు కథ

నవంబర్ 19, 2006

(dilipamaharajukatha.pdf)

శ్రీకాళిదాసకృత రఘువంశం లోని కథ

రఘువంశపు రాజైన దిలీపునికి చాలా కాలం వరకూ సంతానం కలుగలేదు. తన అర్థాంగి అయిన సుదక్షిణాదేవితో సహా సద్గురు దర్శనం కోసం వసిష్ఠ మహర్షి ఆశ్రమానికి వెళ్ళాడు. తనకుగల చింతను వ్యక్తపఱచాడు. ఒక్క నిమిషము ధ్యానముచేసి వసిష్ఠుల వారు ఇలా అన్నారు “నాయనా! నీవు ఒకసారి దేవేంద్రలోకం వెళ్ళి తిరిగి వస్తున్నప్పుడు కల్పవృక్ష ఛాయలో ఉన్న కామధేనువును గమనించలేదు. గోవు కనబడగానే నమస్కరించి ప్రదక్షిణము చేయాలి. ఇక కామధేనువు మాట వేరే చెప్పాలా? సర్వధర్మాలు తెలిసిన నీవు అప్పుడు ఋతుస్నాత అయిన నీ భార్య దగ్గర ఉండాలన్న ధర్మము పాటించే తొందరలో వేగముగా నీ మందిరము చేరదామని వస్తున్నావు. ఆ కారణముగా నీవు ఆ కామధేనువును గమనించకే వచ్చేశావు. నీచే పూజ్యపూజావ్యతిక్రమము జరిగినది. పూజ్యులను గుర్తింపక పోవుట శ్రేయస్సుకు భంగకరము కదా!

అప్పుడు కామధేనువు “రాజా! నన్ను పూజించకనే తొందరలో ఉండి వెళ్ళిపోతున్నావు. నా సంతానామును సేవించిన కానీ నీకు సంతానం కలుగదు” అని చెప్పినది. కానీ రథవేగము వలని వాయుధ్వని కారణముగా నీకుగానీ నీ సారథికిగానీ ఆ కామధేనువు చెప్పిన మాటలు వినబడలేదు. నాయనా! తెలిసిచేసినా తెలియకచేసినా కర్మఫలం అనుభవించక తప్పదు. చేసిన తప్పును సరిదిద్దుకుని ప్రగితిపథంలో నడిచేవాడు ఉత్తముడు. కావున నీవు గోసేవ చేసి శ్రేయస్సును పొందు. వరుణుని యజ్ఞములో పాలు నేయి ధనధాన్యాలు సమకూర్చుటకై కామధేనువు పాతాళలోకానికి వెళ్ళినది. ఆ గోమాత తరిగి వచ్చేంత వరకూ ఆమె సంతానమైన ఈ నందినీధేనువును సేవించి తరించు”.

ఇలా వసిష్ఠులవారు హితవు చెప్తుండగానే ఆ నందినీధేనువు రానేవచ్చింది. దిలీపుడు పరమసాధ్వి అయిన సుదక్షిణాదేవీ ఆ నందినీధేనువును సేవించుట ప్రారంభించారు. ఆ రాజదంపతులు నందినీధేనువును నీడలాగా అనుసరించి సేవించారు. ఆ ధేనువు నిలిచిన నిలిచి కూర్చున్న కూర్చుని నీళ్ళు త్రాగిన త్రాగి ఆ నందినీధేనువును ఆరాధించారు. ఇలా 21 దివసములు ఆ రాజదంపతులు ధేనువ్రతమును పరమభక్తితో చేశారు. వారి సేవకు సంతోషించిన నందినీధేనువు వారి భక్తిని పరీక్షిద్దామని హిమాలయములో ఒక గంభీర బిలంలోకి ప్రవేశించింది. త్రుటిలో ఒక సింహం ఆ హోమధేనువు మీద పడబోయింది. వెంటనే రాజు ఆ ధేనువును కాపాడటానికి ధనుర్బాణాలు తీయబోయాడు. కానీ ఆశ్చర్యం! చిత్రపటంలో వీరునిలాగా ఉండిపోయాడు. ఆ సింహము మాయ వలన స్థాణువుగా ఉండిపోయాడు. ప్రగల్భముగా అప్పుడు సింహమన్నది “రాజా! గిరిజాపతి ఆజ్ఞపొంది నేనీ పరిసరాలలో విహరిస్తున్నాను. శివ కింకరుడను. నా మీద నీ శక్తులేమీ పనిచేయవు. నేను మామూలు సింహాన్ని కాను. ప్రతిదినము పరమేశ్వరుడు నందిని ఆరోహించేటప్పుడు నన్ను పాదపీఠికగా నియోగించి అనుగ్రహిస్తాడు. నేను నికుంభ మిత్రుడనైన కుంభోదరుడను. పార్వతీదేవికి పుత్రప్రాయమైన ఈ దేవదారు వృక్షాన్ని కాపాడటానికి పరమశివుడు నన్నిక్కడ నియంమించాడు. ఈ ప్రాంతాలకి వచ్చే ఏ మృగాన్నైనా భక్షించే అధికారం నాకు ఉన్నది”.

“నా పరాక్రమం బాహుబలం వృథా అవుతున్నవే! ఈ నందినీ ధేనువును కాపాడలేక పోతున్నానే” అని అనుకుంటున్న రాజు “నేను కుంభోదరుడను. శివ కింకరుడను” అన్న మాటలు వినగానే కొంచెం కుదుటపడ్డాడు. “భగవత్ శక్తి ముందు మానవశక్తి అత్యల్పమే కదా!” అని అనుకున్నాడు. ఆ కుంభోదరునితో ఇలా అన్నాడు “ఓ దివ్య సింహమా! సృష్టి స్థితి లయ కారకుడైన ఆ పరమేశ్వరుడు నీకువలె నాకుకూడా పరమ పూజ్యుడు. కానీ హోమధేనువైన ఈ నందినిని కాపాడటము ధర్మమే కదా! మన ఇద్దరికీ శ్రేయోదాయకమైనది చెప్తాను. నా ఈ శరీరాన్ని ఆహారముగా స్వీకరించి నా గురుధనమైన ఈ నందినీధేనువును వడిచిపెట్టు”.

ఇది వినగానే కుంభోదరుడు నవ్వి “ఓ రాజా! నీవు చాలా మూఢుని వలెనున్నావు. నీవు ఈ భూమండలానికి ఏకఛత్రాధిపతివి. యవ్వనములో ఉన్న మన్మథాకారుడవు. ఒక్క గోవు కోసం అన్నీ వదులుకుంటావా? అల్పకారణానికి అధికమూల్యం ఎందుకు చెల్లిస్తావు? ఈ ఆవు కాకపోతే ఇలాంటివి కోటి మీ గురువు గారికి ఇవ్వచ్చు. నీ పాలనలో సుఖంగా ఉండే కోట్లాది ప్రజలను అనాథలను చేసి ఈ గోవు కోసం శరీర త్యాగముచేస్తావా? నీకు ఎట్టి అపకీర్తి రాదు. గురుద్రోహం అంటదు” అని అన్నాడు దిలీపుని ప్రలోభపెడదామని. అది విని ధర్మాత్ముడైన దిలీపుడు “క్షతము (ఆపద) నుండి రక్షించేవాడే క్షత్రియుడు. అట్లు చేయనివాడు రాజు ఎట్లా అవుతాడు? అదీ కాక ఎదుఱుగా హింస జరుతున్నా కాపాడకుండా చూస్తూన్న ప్రాణాలు ఎందుకు? ఓ శివ కింకరుడా! నీవు దేవతామూర్తివి. నా శరీరము స్వీకరించి ఈ ధేనువును విడిచి నా ప్రార్థన మన్నించు” అని అన్నాడు.

ఎట్లాగో చివరికి ఒప్పుకున్నది సింహం. స్థాణువుగా ఉన్న రాజు మామూలుగా కదలగడిగాడు. తనును తాను సింహానికి అర్పిద్దామని మోకాళ్ళ పై కూర్చుని తలవంచుకుని సింహం వేటుకై ఎదుఱు చూస్తున్న దిలీపుడి మీద పుష్పవృష్టి కురిసింది! నందినీధేనువు దివ్యాకృతి దాల్చి “రాజా! వసిష్ఠ మహర్షి తపశ్శక్తి వలన నన్ను ఈ సింహమే కాదు విశ్వంలో ఏ శక్తీ హానికలిగించలేదు. నిన్ను పరీక్షిద్దామనే ఇలా చేశాను. నీ భక్తితో నన్ను మెప్పించావు. దివ్యమైన నా క్షీరము స్వీకరించు. సంతానవంతుడివి అవుతావు” అని అన్నది నందినీధేనువు.

అప్పుడు ధర్మజ్ఞుడైన దిలీపుడిలా అన్నాడు “తల్లీ! నీ కరుణ అమోఘం. నన్ను నా అర్థాంగిని ధన్యుల్ని చేశావు. లేగ దూడ నీ పాలకై ఎదుఱు చూస్తుంది. మహర్షులు యజ్ఞార్థము నీ క్షీరమునకై నిరీక్షిస్తూ ఉంటారు. వారు తీసుకున్న తరువాత మిగిలిన దానిలో ఆఱోవంతు తీసుకుంటాను (ధర్మాత్ముడైన రాజు ప్రజలనుండి 1/6 మాత్రమే కప్పముగా తీసుకుంటాడు)”. “తథేతి” అని ఆశీర్వదించింది నందినీ. ధేనువ్రత మహిమ వలన రఘు మహారాజును పుత్రునిగా పొందినాడు దిలీపుడు.

god_b_12.jpg

పిల్లలూ! ఈ కథలోని నీతులను మరొక్కమాఱు చూద్దామ్:

  1. పూజ్యులను ఎల్లవేళలా యథావిధిగా పూజించాలి. తొందరలో ఉండి కామధేనువును గమనించకుండా వెళ్ళిపోవుట వలనే దిలీపునికి శ్రేయస్సు ఆగిపోయింది. కావున పెద్దలను సాధు సజ్జనులను గోవులను ఎల్లప్పుడూ గౌరవించడం మన విధి.
  2. ఆపదలో ఉన్న గోమాతను కాపాడటానికి తన ప్రాణాలను సైంత ఇద్దామనుకున్న దిలీపుడు ఉత్తముడు. అతని గురుభక్తి ధేనువ్రత దీక్ష అసామాన్యాలు.
  3. “దూడ త్రాగిన తరువాత మహర్షులు తీసుకున్న తరువాత పాలుతీసుకుంటాను” అని అన్నప్పుడు దిలీపుని మహోన్నత వ్యక్తిత్వం మనకు తెలిసినది. 1/6 మాత్రమే తీసుకుంటాను అన్నప్పుడు ఆ రాజు యొక్క ధర్మబుద్ధి మనకు అవగతమైనది. ఇట్టి ధర్మాత్ములే మనకు ఆదర్శపురుషులు.

Search Terms: Dilipa, Dileepa, Diliipa, Sudakshina, Vasishtha, Nandinii, Nandini, Kamadhenu, Kaamadhenu


కుశిక మహారాజు కథ

నవంబర్ 5, 2006

(kushikamaharajukatha.pdf)

శ్రీమహాభారతం లోని కథ

ఒకసారి మహాతోజోమయుడైన చ్యవన మహర్షి కుశిక మహారాజును పరీక్షించుటకు ఆయన కడకు వచ్చెను. వచ్చుచున్న చ్యవన మహర్షిని చూచి కుశికుడు ఎదురేగి అర్ఘ్యపాద్యాదులిచ్చి “మహాత్మా! మీ రాకతో మా నగరము పావనమైనది. ఏదో బలీయమైన కారణముంటేగాని మీ వంటి తపోధనులు రారు. మీ అభీష్టమేమో సెలవీయ్యండి. మీకు సేవచేసే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి” అని అర్థించాడు. చ్యవనుడు “రాజా! నీ వినయవిధేయతలు మెచ్చితిని. నీకడ కొన్నాళ్ళు ఉండవలెనని వచ్చితిని. నాకేలోటు రాకుండా నీవు నీ భార్య నాకు పరిచర్యలు చేయాలి. నా కోరిక తీర్చగలవా?” అని అన్నాడు. సాధు సజ్జన సేవే మహాభాగ్యమని కుశికుడు చ్యవనుడుండడానికి హృద్యమైన మందిరం చూపించాడు.

రాజదంపతులు చ్యవనుడు ఆ సాయంకాలం ఆహ్నికాలు దేవతార్చన చేసుకొన్నారు. తరువాత మునీశ్వరునకు మృష్టాన్నమిచ్చి సంతృప్తి పఱచినాడు కుశికుడు. భోజనానంతరము చ్యవునుడు “రాజా! నేనిక నిద్రిస్తాను. నీవు నీ భార్య నిద్రాహారాలు మాని నా పాదసేవ చేయండి. నా అంతటనేను లేవనంతవరకు నన్ను లేపకండి” అని యోగనిద్రలోకి వెళ్ళిపోయాడు చ్యవనుడు. మహర్షి పాదసేవే మహాభాగ్యం అని కుశికుడు అతని అర్థాంగి ఏకాగ్రచిత్తంతో పాదసేవ చేయసాగారు.

ఇలా 21 దివసములు గడిచాయి. మఱునాడు చ్యవనుడు మేల్కొని ఏమీ మాట్లాడకుండా అంతఃపురం వదలి నడువసాగాడు. ముని వెంటపోయిన రాజదంపతులను తన మాయతో భయభ్రాంతుల్ని చేశాడు. మరల నిదుర పోయాడు. కుశిక దంపతులు యథావిధిగా పాదసేవ చేశారు. మళ్ళీ 21 దినములు కడచెను. ఆ తరువాత “రాజా! నేను రథమెక్కి యాచకులకు సువర్ణము రత్నములు గోవులు అశ్వములు దానమిచ్చుచుందును. మీరిద్దరు నా రథమును గుఱ్ఱములకు బదులుగా లాగవలెను” అన్నాడు. కుశికుడు ముందర రాణి వెనుక ఉండి రథములాగినారు. చ్యవనుడు మునికోలతో రక్తంవచ్చేటట్టు వారిని కొట్టుచు యాచకులకు వస్తువులిచ్చుచూ రథంమీద వెళ్ళాడు. రథం ఊరి చివరికి వెళ్ళాక ముని రథము దిగి ఏమాత్రమూ చలించని రాజదంపతులని చూశాడు. కుశికుడు అతని భార్య మనస్సులలో కొంచెంకూడా కోపంగానీ విసుకుగానీ మరి ఏ వికారము కానీ లేవు. వారి నిర్మల హృదయం ఆశ్చర్యంతో చూసి ముని వారి శరీములు తాకి ఇలా అన్నాడు “రాజా మీరింక వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. ఱేపు గంగాతీరం వద్దనున్న వనానికి రండి”.

వారి శరీరముల పైని గాయాలు అన్ని మాసిపోయాయి! కుశికుడు “మహాత్మా! నీ చర్యలు అద్భుతాలు. మాకే శ్రమ లేదు. మీబోటి మహనీయుల మహిమ ఎఱుగుట ఎవరి తరము”? అని అన్నాడు. మఱునాడు చ్యవనుడు చెప్పిన ప్రదేశానికి కుశికుడు అతని భార్య వచ్చారు. అక్కడ స్వర్గమును బోలు దివ్య భవనమున్నది. రాజు రాణి ఆ దివ్య భవమును చూచి మిక్కిలి ఆనందమునొందిరి. చ్యవన మహర్షి వారిని దగ్గరికి పిలిచి “రాజా! మీ శాంత స్వభావము లోకోత్తరం. మీ సాధుజన సేవాభావం అద్వితీయం. ఇంత ఇంద్రియ నిగ్రహము కలమీకు వరమిచ్చెద కోరుకొనుము” అని అన్నాడు.

కుశికుడు “మౌనివరేణ్య! నీ సేవా భాగ్యము దొఱకుటే మాకు వరము. మీ దయే చాలు. మాకింకే కోరికా లేదు” అన్నాడు. రాజదంపతుల వైరాగ్యబుద్ధికి మెచ్చి చ్యవనుడిలా అన్నాడు “ఓ రాజా! మీ వంశమునేకాక ఈ విశ్వాన్నే తరింపచేసే మనుమడు పుడతాడు. అతడు బ్రహ్మర్షి అయ్యి పరమాత్మ ఐన శ్రీ రామునకు గురుస్థానమున ఉండగలడు. అతడు విశ్వామిత్రుడు. నీ వలన కౌశికుడే నామధేయంతో ప్రసిద్ధికెక్కుతాడు”.

పిల్లలూ! ఈ కథలోని నీతిని మరొక్కమాఱు చూద్దాం:

సాధుసేవ యొక్క ప్రాధాన్యత శాంత స్వభావము యొక్క ఔన్నత్యం మనకు కుశిక దంపతులు బోధించారు. వారు ౨౧ దినములు నిద్రాహారాలు మాని ఏకాగ్రచిత్తంతో మునీశ్వరునికి పాదసేవ చేశారు. మహర్షి మునికోలతో కొట్టి వారిచేత రథం లాగించినా వారికే మాత్రము కోపము రాలేదు. విరాగులైన కుశిక దంపతులు ధన్యులు.

Search Terms: Kushika, Kusika, Chyavana, Chavana, Cyavana