కృష్ణం వన్దే జగద్గురుమ్ – ౬

జూన్ 6, 2008

శ్రీమద్భాగవతములోని కథ

(ఈ కథ యొక్క ఉత్తర భాగము)

(PDF)

శ్రీకృష్ణుడు గోపబాలురతో కలిసి వింతవింత ఆటలాడి చూసే వారికి కన్నులపండుగ చేసెడివాడు. కన్నయ్య దేహానికి అంటిన దుమ్ము భూతిభూషణుడు ప్రీతితో అలంకరించుకొను విభూతి వలె కనిపించెడిది. ఉంగరాలజుట్టు పై యశోద అలంకరించిన ముత్యాలమాల ఇందుశేఖరుడు తలదాల్చిన చంద్రుని పోలి ఉండెడిది. నుడుటి మీది ఎఱ్ఱని కస్తూరి తిలకం “కామారి మూడవ నేత్రమా?” అన్నట్లు ఉండెడిది. రత్నాలహారం లోని నీలమణి గరళకంఠుని కృపావృష్టికి నిదర్శనమైన హాలాహలపు మచ్చవలె శోభిల్లెడిది. మెడలోని ముత్యాలహారాలు నాగభూషణుని అలంకరించు సర్పహారాల వలెనుండెడివి. సామవేదసారుడైన కృష్ణస్వామి వేణువు ఖట్వాంగుని దణ్డమును పోలి ఉండెడిది. ఇలా “శివుడూ నేనూ ఒకటేసుమా!” అని హెచ్చరిస్తున్నాడా? అన్నట్టు కనిపించేవాడు బాలకృష్ణుడు.

ఒకనాడు శ్రీకృష్ణుడు ఆటలమధ్యలో ఒక గోపిక ఇంటిలోకి జొరపడి కడవలలోని నేతినంతా త్రాగివేశాడు! అంతేకాక ఖాళీ కడవలను తీసుకువచ్చి ప్రక్క ఇంటిలో పడవేసి వెళ్ళిపోయాడు. తరువాత ఆ ఇంటివారికీ ఈ ఇంటివారికీ పెద్దపోట్లాట జరిగింది. ఈ అల్లరి వివరిస్తూ గోపిక యశోదతో ఇలా అన్నది:

వా రిల్లు సొచ్చి కడవలఁ
దోరంబగు నెయ్యి ద్రావి తుది నా కడవల్
వీరింట నీ సుతుం డిడ
వారికి వీరికిని దొడ్డవా దయ్యె సతీ!

పిల్లలూ! మరి జగద్గురువైన శ్రీ కృష్ణుడు ఈ కథ ద్వారా ఏమి బోధించాలనుకున్నాడో తెలుసుకుందామా?
నెయ్యి జ్ఞానానికి సంకేతము. జ్ఞానాన్ని వస్తు రూపములో భద్రపఱచిన (కడవలలో నెయ్యి ఉంచిన) గోపిక నిజానికి జ్ఞానమును ఆర్జించుకోలేదు. దీనికి నిదర్శనం నిజానిజాలు తెలుసుకోకుండా ప్రక్క ఇంటివారితో పోట్లాడడమే. కృష్ణస్వామి నేతిని త్రాగివేసి జ్ఞానమునెన్నడు స్వార్థముతో దాచుకోరాదు (దాచుకోలేరు) అని చూపించినాడు. అంతే కాక ఆర్జించిన జ్ఞానమును ఇతరులకు పంచాలని చూపించడానికి కడవలను ప్రక్క ఇంటిలో పడవేశాడు. ఐతే జ్ఞానము స్వానుభవైకవేద్యమైనది కావున జ్ఞానమును పదార్థ రూపములో (నేతి రూపములో) పంచలేము. జ్ఞానబోధకు ఏకైకమార్గం జ్ఞానార్జన పై జిజ్ఞాస కలిగించడం. అందుకనే శుద్ధజ్ఞాన పరాత్పరుడైన శ్రీకృష్ణుడు కమ్మని నేతివాసనలు వచ్చే ఖాళీ కడవలను ప్రక్క ఇంటిలో పడవేశాడు.

కాబట్టి జగద్గురువైన శ్రీ కృష్ణుడు ఈ కథ ద్వారా మనకు జ్ఞానమెన్నడూ స్వార్థబుద్ధితో దాచుకోరాదని, దానిపై జిజ్ఞాస కలిగే రీతిలో అందఱికీ అందించాలని బోధించినాడు. అంతేకాక జ్ఞానమును సంపూర్ణముగా ఆస్వాదించి గురుత్వమును పొందిన తరువాతనే ఇతరులకు బోధించాలి అని శ్రీ కృష్ణ పరమాత్మ ఈ కథ ద్వారా చూపినాడు. అందుకనే నెయ్యి మొత్తం త్రాగివేసి (గురుత్వమును సంపాదించిన) తరువాతనే ప్రక్క ఇంటిలో కడవలను పడవేసి జ్ఞానబోధ చేసినాడు.


దీపకుని గురుసేవ

డిసెంబర్ 19, 2006

(deepaka.pdf)

పెద్దలు చెప్పిన నీతికథ

పూర్వం దీపకుడనే నైష్ఠిక బ్రహ్మచారి ఉండేవాడు. అతడొకనాడు శాస్త్రాలలో చెప్పబడిన ఈ సుక్తిని చదివినాడు “పతివ్రతకు భర్త పుత్రునికి తల్లిదండ్రులు శిష్యునకు గురువు దైవసమానులు. వీరిని మించిన దైవము లేదు. వీరి సేవను మించిన తీర్థాలు వ్రతాలు ఉపవాసాలు లేవు. తరించుటకు ఇదియే అతిసులభ మార్గము” అని చదివినాడు. వెంటనే గురువును అన్వేషించుటకు బయలుదేరినాడు. పవిత్ర గోదావరీనదీ తీరమున వేదధర్య మహర్షి ఆశ్రమము ఉన్నదని ఆయన సకల వేదవేదాంగాలు తెలిసినవాడని ఉత్తమ గురువు అని ఎందఱో చెప్పగా విని ఆయనను ఆశ్రయించి సాష్టాంగ నమస్కారము చేసినాడు. వినయవంతుడైన దీపకుని శిష్యునిగా స్వీకరించినాడు వేదధర్యుడు. గురుసేవ ప్రభావం వలన తన చిత్తశుద్ధి ఏకాగ్రతల వలన అచిరకాలంలోనే దీపకుడు సకల శాస్త్రాలు నేర్చాడు. అనన్య గురుసేవా నిరతుడై ప్రకాశించాడు.

శిష్యుని విద్యాతేజస్సు చూసి వేదధర్యుడు ఒకనాడు “కుమారా! నేను పూర్వజన్మలలో చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తము చేసుకున్నాను. కానీ రెండు భయంకరమైన పాపాల ఫలము ఇంకా అనుభవించాలి. చేసిన కర్మ చెడని పదార్థముకదా. నేను అతిపురాతనము సనాతనము పవిత్రము సాక్షాత్ విశ్వనాథుని ధామమైన కాశీ క్షేత్రములో ఆ పాపాలకు ప్రాయశ్చిత్తము చేయదలచినాను. పుణ్యక్షేత్రములో ఏ కార్యానికైనా ఫలితము రెండింతలు కదా!

నేను ఆ పాపాలను ప్రాయశ్చిత్తార్థము ఆవాహన చేయగానే భయంకరమైన కుష్ఠురోగం వస్తుంది. శరీరమంతా చీము నెత్తురు కారుతుంటుంది. వికారరూపము అంధత్వము వస్తాయి. నాలో సహనం సాధుత్వం ఆది సద్గుణాలు నశిస్తాయి. కఠినాత్ముడనై ఇతరుల సేవలకై దీనముగా ఎదురు చూస్తుంటాను. అట్టి దుస్థితిలో నీవు నాకు సేవ చేయగలవా”? అని అడిగినాడు వేదధర్యుడు.

గురుసేవయే పరమభాగ్యమని త్రికరణశుద్ధిగా నమ్మిన దీపకుడు “గురూత్తమా! నేను మీ పాపాలను ఆవహింప చేసుకొని పాపఫలితాన్ని అనుభవిస్తాను. నాకా అవకాశాన్ని ప్రసాదించండి” అని అన్నాడు. “దీపకా! నీ వంశాన్నంతా దీపింపచేయగల వాడవు అలా అనక ఏమంటావు? కానీ ఎవరు చేసిన కర్మకు వారే బాధ్యులు కదా! పుణ్యమైనా పాపమైనా ఫలితమును అనుభవించక తప్పదు కదా! నా పాపాలను కడుక్కుంటే గాని ఈశ్వర సాన్నిధ్యాన్ని పొందలేను” అని వేదధర్యుడు చెప్పినాడు. గురు ఆజ్ఞప్రకారమే చేశాడు దీపకుడు. ఇద్దరు మణికర్ణికా ఘాట్ కు ఉత్తరంగా ఉన్న కమలేశ్వర మహాదేవ మందిరం వద్దకు చేరి అక్కడ బస ఏర్పాటు చేసుకున్నారు. కశీ విశ్వనాథునికి అన్నపూర్ణాభవానీకి పూజలుచేసి పాపాల ఆవాహన చేశాడు వేదధర్యుడు. గురువుగారు చెప్పినట్టే జరిగింది.

గురువుగారి దుస్థితి చూసి ఎంతో బాధపడ్డాడు దీపకుడు. చీము నెత్తురు తుడిచి కట్టు కట్టి మలమూత్రాదులను కడిగి అతని శుభ్రపఱచే వాడు దీపకుడు! ప్రతిపూట దీపకుడు తెచ్చిన భిక్షను తానే తినేసి “ఇంత కొంచెం తెచ్చావెందుకు” అని నిష్ఠూరాలాడేవాడు వేదధర్యుడు. అతడెంత కోపించినా గద్దించినా ధర్మనిష్ఠతో నిరంతర గురుసేవ చేసినాడు ఆనందపరశుడై దీపకుడు.

అంబికానాథుడు దీపకుని అసమాన గురుభక్తి మెచ్చి “వత్సా! నీ అనన్య గురుసేవా దీక్షను మెచ్చినాను. ఏమి వరము కావాలో కోరుకో” అని అన్నాడు. గుణనిధి అయిన దీపకుడు “స్వామి! నాకు ఈ లోకములో గురుసేవ తప్ప ఏదీ తెలియదు. వారి అభీష్టమేమో కనుక్కొని చెప్తాను” అని అన్నాడు దీపకుడు. గురువుగారికీ విషయం చెప్పి “గురుదేవా! మీకు స్వస్థత కోరుతాను” అని అన్నాడు. వేదధర్యుడు “నాయనా! ఎవరు చేసిన పాపాలకు ఫలితం వారు అనుభవిస్తేనే పోతాయి” అని చెప్పాడు.

మరునాడు విశ్వనాథుని ఆలయానికి వెళ్ళి ఏ వరమూ కోరలేదు దీపకుడు. భగవంతుడు ఆ దీపకుని చూసి మురిసిపోయి జగజ్జనని అయిన పార్వతీదేవితో అతని విషయం చెప్పి సంబరపడిపోయాడు. తరువాత నిర్వాణ మండపములో ఉన్న శ్రీమన్నారాయణునికి సమస్త దేవతలకు దీపకుని సంగతి చెప్పి పొగిడినాడు. మహావిష్ణువు “పరమశివుని మెప్పించిన నీ గురుభక్తి అసామాన్యము. నీ మనోభీష్టమును కోరుకో” అని అన్నాడు. అందఱికీ సాష్టాంగవందనము చేసి ఆనందాశ్రువులతో “స్వామీ! నాకు అచంచలమైన గురుభక్తిని ప్రసాదించు” అని అడిగినాడు. “తథాస్తు” అని దీవించి దీపకుని కృతార్థుని చేసినాడు మహావిష్ణువు.

పిల్లలూ! ఈ కథలోని నీతులను మరొక్కమాఱు చూద్దాము:

  1. గురువును సేవిస్తే సకల దేవతలనూ సేవించిన ఫలితం వస్తుంది. దీపకుడు తన గురుసేవానిరతితో త్రిమూర్తుల సమస్త దేవతల అనుగ్రహాన్ని పొందినాడు.
  2. కర్మ పాశం తెగనిది. పాపకర్మలకు ప్రాయశ్చిత్తము ఎంత ఘోరముగా ఉన్నదో మనము ఈ కథలో చూచినాము. కావున పాపకర్మలెన్నడు చేయరాదు.

Search Terms: Deepaka, Dipaka, Diipaka, Vedadharya


పద్మపాద బయన్న కథ

నవంబర్ 27, 2006

(padmapada.pdf)

జగద్గురువులైన ఆది శంకరాచార్యులవారికి సనందుడనే శిష్యుడుండేవాడు. ఆ సనందుడు మిక్కిలి గురుభక్తి విద్యలపై ఆసక్తి కలవాడు. తన ఎకాగ్రత వినయవిధేయతల వలన కొద్దికాలం లోనే విద్యలునేర్చి శంకరభగవత్పాదులకు ప్రియ శిష్యుడైనాడు పద్మపాదుడు. “ఏ కారణముగా సనందుడు గురువుగారికింత ప్రియుడైనాడో” అని చర్చించుకుంటున్న తన శిష్యులను విన్నారు శంకరులు. వారికి సనందుని అపారమైన గురుభక్తిని చూపాలని నిశ్చయించుకున్నారు.

ఒకసారి ఆది శంకరులు తమ శిష్యసమేతముగా గంగాతీరమునకు వెళ్ళినప్పుడు ఆవలి గట్టునున్న సనందుని చూచి “నాయనా! సనందా శీఘ్రముగా ఇటు రా!” అని పిలిచినారు. గురు ఆజ్ఞయే తప్ప ఇతరము గూర్చి ఆలోచించని సనందుడు వెంటనే కళ్ళుమూసుకుని అనన్యమైన గురుభక్తితో ఇవతలి గట్టుకి నీటి మీద నడచి వచ్చాడు! అప్పుడు సనందుడు నీటిలో మునిగిపోకుండా అతని పాదాల క్రింద పద్మాలను మొలిపించింది గంగాభవానీ. ఆ ఆశ్చర్యకరమైన సంఘటన చూసి ముగ్ధులైన శిష్యులు సనందుని గురుభక్తి తెలుసుకున్నారు. అప్పటి నుంచి సనందుడు పద్మపాదుడనే పేరుతో ప్రసిద్ధుడైనాడు.

చోళదేశంలో పుట్టిన పద్మపాదుడు బాల్యము నుంచి అఖండ నృసింహభక్తుడు. స్వామి సాక్షాత్కారము కోసం పవిత్రమైన అహోబిల అడవులలో ఎన్నో ఏండ్లు తీవ్ర తపస్సును చేసినాడు. కాని నరహరి కరుణించలేదు. శిష్యుని భక్తి పరిపక్వమైనదని గ్రహించిన ఆది శంకరులు ఒకనాడు పద్మపాదుని పిలిచి దగ్గరలో ఉన్న చెంచుగుడెం లోని కొండగుహలో నృసింహస్వామికై తపస్సు చేయమని ఆజ్ఞాపించాడు. గురు ఆజ్ఞపై పద్మపాదుడు కొండగుహ చేరి ఘోర తపస్సు ప్రారంభించాడు.

తాపసి వచ్చాడని తెలియగానే పరుగు పరుగున సాధుసేవ చేదామని వచ్చాడు చెంచుగుడెం దొర బయన్న. “సామీ! నేను బయన్నను. ఈ నేల ఏలికను. దేని కోసం నీవు ఇక్కడికి వచ్చావు దొరా”? అని అడిగాడు. “సింహం ముఖముతో మనిషి శరీరంతో ఉండే దేవుని వెదుకుతున్నా” అన్నాడు పద్మపాదుడు. అడవినంతా ఎఱిగిన ఆ బయన్న తానెన్నడూ అట్టి వింత జంతువును చూడలేదన్నాడు. బయన్న మూఢభక్తుడు. ఉంది అని రూఢిగా చెప్పిన పద్మపాదుని మాటలువిని “సామీ! ఆ ముగము నిజంగా ఉంటే కట్టేసి తెస్తా లేకుంటే పానాలు వదిలేస్తా” అని ఆ నరసింహమును వెదుక బయలుదేరాడు బయన్న!

పద్మపాదుడు వర్ణించిన నృసింహస్వామి అద్భుత రూపాన్ని మనస్సులో ముద్రించుకున్నాడు బయన్న. ఏకాగ్రచిత్తంతో నిద్రాహారాలు మాని అడవంతా తిరిగాడు బయన్న. ఎంత శ్రమించినా అణువణువూ పరీక్షగా చూచినా ఎక్కడా కనబడలేదు స్వామి. “నీవు కనిపించని ప్రాణమెందులకు?” అని బయన్న ప్రాణాత్యాగం చేయబోయాడు. బయన్న నిస్వార్థ నిష్కల్మష మూఢభక్తికి మెచ్చి నృసింహుడు ప్రత్యక్షమయ్యాడు. వెంటనే స్వామిని తీగలతో కట్టేసి పద్మపాదుని ముందర నిలబెట్టాడు బయన్న!

కళ్ళముందరే బయన్నకు కనబడుతున్న నృసింహుడు పద్మపాదునకు కనబడలేదు. “స్వామీ! ఏమి నా పాపము?” అని ఆక్రోశించాడు పద్మపాదుడు. “నాయనా! పద్మపాదా! కోటి సంవత్సరములు నా రూపాన్ని ధ్యానం చేసినా అలవడని ఏకాగ్రత భక్తి ఈ బయన్న ఒక్కరోజులో సాధించాడు. ఈ సత్పురుషుని సాంగత్యం వలనే నీకు నా మాటలు వినబడుతున్నాయి. నీవు విచారించకు. నీ అఖండ గురుభక్తికి మెచ్చాను. అవసరమైనప్పుడు నేనే నీకు దర్శనమిచ్చి నిన్ను కాపాడెదను” అని ఆశీర్వదించి అదృశ్యమయ్యాడు స్వామి.

పిల్లలూ! ఈ కథలోని నీతులను మరొక్కమాఱు చూద్దాము:

  1. పద్మపాదుని గురుభక్తి అనన్యము. గురుకృప లేని ఏవిద్య రాణించదు. ఇహపరసాధనానికి దిక్కైన గురువుని అత్యాదరముతో పూజించాలి.
  2. ఏకాగ్రత నిశ్చల భక్తి యొక్క గొప్పతనము మనకీ కథలో బయన్న ద్వారా తెలిసినది. నిద్రాహారాలు మాని ఏకాగ్రచిత్తంతో స్వామిని వెదకిన బయన్నను కరుణించాడు నృసింహుడు.

Search Terms: Padmapaada, Padmapada, Sunanda, Adi Shankaracharya, Bayanna


కాకభుశుండి పూర్వజన్మవృత్తాంతము

నవంబర్ 25, 2006

(kakabhushundi.pdf)

శ్రీతులసీదాస కృత రామచరితమానసము లోని కథ

నారద మహర్షి పంపగా గరుడ భగవానుడు మేఘనాథుని చేతిలో తనకు తానే బంధింపబడిన శ్రీరాముని బంధములను తొలగించెను. శ్రీరాముని మాయావశుడైన గరుడుడు ఇలా ఆలోచించసాగెను “సర్వవ్యాపకుడు నిర్వికారుడు వాగాధిపతి మాయాతీతుడు అయిన పరమేశ్వరుడు ఈ భూమిపై శ్రీరామునిగా అవతరించెనని విన్నాను. శ్రీరామ నామమును జపించినంత మాత్రముననే మానవులు భవబంధవిముక్తులు అగుదురనీ విన్నాను. కానీ అట్టి మహిమాన్వితుడైన శ్రీరాముడు ఒక రాక్షసాధముని నాగపాశముచే బంధింపబడుట ఏమి”? ఇలా మాయామోహితుడై వ్యాకులచిత్తుడైన గరుడుడు బ్రహ్మర్షి అగు నారదుని కడకేగి తన సందేహమును వ్యక్తపఱచి కాపాడమని ప్రార్థించెను. నారదుడు గరుడుని సందేహనివారణార్థం సృష్టికర్త అయిన బ్రహ్మదేవునికడకు పంపెను. తన వద్దకు వచ్చిన గరుడునితో బ్రహ్మదేవుడిలా అన్నాడు “ఓ విహగేశ్వరా! పరమశివుడు శ్రీరాముని మహిమను బాగా ఎఱుగును. కావున నీవు ఆ శంకరునే శరణువేడుము”. కుబేరుని కడకు వెళుతున్న మహాదేవుని కలిసి గరుడుడు తన సందేహమును చెప్పెను. “ఓ పక్షీంద్రా! ఎంతో కాలము సజ్జనుల సేవను చేసిగానీ జ్ఞానమును పొందలేము. నిన్ను నిరంతర రామకథాప్రసంగములు జరిగే దివ్యమైన నీలగిరిలోని పరమ భాగవతోత్తముడైన కాకభుశుండి ఆశ్రమమునకు పంపెదను” అని పార్వతీనాథుడు ఆనతిచ్చెను.

వేయి మందిలో ఒక్కడే ధర్మపథమును సర్వకాల సర్వావస్థలయందూ అనుసరించును. అట్టి కోటి ధర్మాత్ములలో ఒక్కడు పేరాశకులోనుకాక విరాగి వలె ఉండును. అట్టి కోటి విరాగులలో ఒక్కడు జ్ఞాని అగును. అలాంటి జ్ఞానులలో కోటికొక్కడే జీవన్ముక్తుడగును. అట్టి వేయిమంది జీవన్ముక్తులలో అరుదుగా ఒక్కడు బ్రహ్మైక్యమును పొందును. అలా బ్రహ్మైక్యమును పొందినవారిలో మిక్కిలి అరుదుగా సంపూర్ణముగా మాయావిముక్తుడై శ్రీరాముని భక్తిలో లీనమైన ప్రాణి ఉండును. అట్టి దుర్లభమైన నిష్కల్మష రామభక్తి ఉన్న కాకభుశుండి కడకు గరుడుడు వచ్చెను. వచ్చిన గరుడుని తగిన రీతిలో గౌరవించి కుశలమడిగి సముచిత ఆసనముపై కూర్చుండబెట్టి గరుడునికి సంక్షిప్త రామాయణము మొదలగు ఎన్నెన్నో అతిరహస్యములైన తత్త్వములను వివరించి గరుడుని కోరికపై తన పూర్వజన్మ కథను ఇలా చెప్పాడు రామభక్తుడైన కాకభుశుండి

“పూర్వము ఒకానొక కల్పములో కలియుగము ఆరంభమైనది. కలికాలము మిక్కిలి కలుషితమైనది. స్త్రీ పురుషులందఱూ పాపకర్మనిరతులై వేదవిరుద్ధముగా మోహాధీనులై క్షణికమైన జీవితకాలము కలిగియూ కల్పాంతములు దాటే గర్వము దంభము అహంకారమును కలిగియుందురు. పాషండులు తమవిపరీత బుద్ధులతో క్రొత్తక్రొత్త సాంప్రదాయాలను ఆచారాలను కల్పించి ప్రచారం చేయుదురు. ఎవరికి ఏది ఇష్టమో అదే ధర్మమని అందురు. ఒక వైపు బ్రహ్మజ్ఞానముగూర్చి మాట్లాడుతూ మఱొక వైపు లోభముచే ఎంత మహాపాపకార్యమైనా చేయుటకు వెనుకాడరు. తాము స్వయముగా భ్రష్టమగుటే కాక సన్మార్గమున నడచువారినికూడా భ్రష్టుపఱచెదరు. వర్ణాశ్రమధర్మాలు అడుగంటుతాయి. ప్రజలలో సామరస్యం సమైక్యభావం నశిస్తుంది. నిష్కారణ వైరములతో కక్షలతో ఉండెదరు. వేదశాస్త్ర పురాణములను గౌరవించరు. కుతర్కములతో వేదశాస్త్రపురాణ నిందచేసి అనంతపాపరాశిని సొంతం చేసుకుంటారు. పూజలు దానధర్మాలు స్వార్థబుద్ధితో తామసముతో చేసెదరు. విద్యను అన్నమును అమ్ముకొనెదరు. ధనవంతులకే గౌరవమివ్వబడును. గురుశిష్య భార్యభర్త మాతాపితభ్రాత అను సంబధములకు విలులేకుండును. ఆడంబరముగా జీవించుచూ వేదమార్గమును త్యజించి దిగంబరత్వము సమర్థించి ఆపాదమస్తకమూ కపటత్వముతో నిండియున్న వారు గురువులై అధర్మబోధలు చేశెదరు. అమంగళకరమైన వేషభూషణాదులను ధరించి శిరోజములను విరియబోసుకొనెదరు. తినదగినది తినగూడనిది అను విచక్షణ తినుటకు సమయం అసమయం అను విచక్షణ చేయక అన్నింటిని అన్నివేళలా తినెదరు. అలా పాపకూపములో పడి ఇహములో పరములో బహు క్లేశాలను అనుభవించెదరు.

కానీ ఈ కలియుగమున ఒక గొప్పగుణము కలదు. “కలౌ సంకీర్తనాన్ముక్తిః”. యొగ యజ్ఞ పూజాదులకు ఆస్కారములేని ఈ యుగములో భగన్నామస్మరణ చేసి జనులు ముక్తిని పొందెదరు. ఓ పన్నగాసనా! ఇంద్రజాలికుడు ప్రదర్శించుమాయ చూచువారిపైనే ప్రభావమును చూపును. కానీ అతనిసేవకులను అది ఏమీ చేయదు. అట్లే మాయకుమూలమైన భగంవంతుని శరణుజొచ్చిన వానికి ఆ అనూహ్యమైన మాయ అంటదు.

అట్టి కలియుగములో నేను భూవైకుంఠమైన అయోధ్యానగరములో ఒక శూద్రునిగా జన్మించినాను. మనోవాక్కర్మలచే నేను అఖండ శివభక్తుడను. కానీ నా బుద్ధిమాన్యముచే ఇతరదేవతలను దూషించుచుండెడి వాడను. అతిగర్వముతో ధనగర్వముతో నేనుండగా ఒకసారి అయోధ్యలో కఱవు వచ్చింది. దరిద్రుడనై దుఃఖితుడనై ఉజ్జయినీ నగరము చేరి అక్కడ కొంత ధనము సంపాదించి పరమ శివుని ఆరాధన కొనసాగించితిని. ఒక్కడ అతిదయాళువు నీతిమంతుడు పరమసాధువైన ఒక విప్రోత్తముడు వైదికపద్ధితిలో అహర్నిశలూ శివుని ఏకాగ్రచిత్తముతో నిష్కల్మషముగా పూజించుచుండెను. అతడు ఎన్నడునూ విష్ణు నింద చేయలేదు. కపటబుద్ధితో నేనతనికి సేవ చేయుచుండెడివాడను. ఆ భూసురుడు నన్ను పుత్రవాత్సల్యముతో చూచుచూ బోధించుచుండెను. శివభక్తినే కాక ఇతరములైన ఎన్నో నీతులను నాకతడు బోధించెను. నేను ప్రతి దినమూ దేవాలయమునకు పోయి శివనామస్మరణము చేసెడివాడను కానీ నా అహంకారమును నేను విడువలేదు. హరిభక్తులను పండిత సజ్జనులను ద్వేషించెడివాడను.

నా గురువు నా ప్రవర్తన చూసి చాల బాధపడి నిత్యమూ ఎన్నో సదుపదేశములిచ్చెడివాడు. ఆ ఉపదేశములను పెడచెవిన పెట్టి గురుద్రోహము చేయుచూ నాలోని కోపాగ్నిని ప్రజ్వలింప చేయుచూ జీవించుచుంటిని. ఇలా ఉండగా ఒక రోజు నా గురువు నన్ను పిలిచి శివకేశవుల అభేదత్వము బోధించి “పరమాత్మ అయిన శ్రీరామునికి సర్వదేవతలు బ్రహ్మ శివుడు నమస్కరించెదరు. అట్టిది నీవు ద్వేషించుట తగదు” అని అనెను. అది వినడంతో నా కోపాగ్ని మింటికెగసెను. అనర్హుడనైన నాకు విద్యనొసగిన నా గురువునకే ద్రోహము తలపెట్టాను. అయినా క్రోధాదులను జయించిన అతడు నాపై ఏమాత్రమూ కోపపడలేదు.

ఒక రోజు నేను శివాలయములో శివనామము జపించుచుండగా నా గురూత్తముడు అచటికి వచ్చెను. నా గర్వము వలన లేచి ఆయనకు నమస్కరించలేదు. దయానిధి అయిన నా గురువుకు నా దౌష్ట్యము చూచియు కొంచెముకూడా కోపమురాలేదు! కాని గురువును నిరాదరించుట మహాపాపము. పరమశివుడు ఇది చూసి సహింపలేక “ఓరీ మూర్ఖుడా! పూర్ణజ్ఞాని అయిన నీ గురువును అవమానించినావు. నీవు క్షమార్హుడవు కాదు. సద్గురువుపై ఈర్షగొన్నవాడు కోట్లాదియుగములు రౌరవాది నరకములలో పడి తరువాత పశుపక్షాది జన్మలు పొంది అటుపై వేలకొలది జన్మలు క్లేశములభవించును. నీ విప్పుడే అజగరమువై ఒక చెట్టుతొఱ్ఱలో పడివుండు” అని నన్ను శపించెను. భయకంపితుడనైన నన్ను చూసి నా గురువర్యుడు రుద్రాష్టకముతో శివుని ప్రసన్నుని చేసుకుని పశ్చాత్తాపముతో దుఃఖిస్తున్న నాకు శాపావశానము ప్రసాదించమని వేడుకొనెను. అంతట పరమేశ్వరుడు

“ఓ కృపానిధీ! మహాపకారికైనా మహోపకారము చేయు నిన్ను మెచ్చితిని. నీ శిష్యునికి శాపావశానమిచ్చెద” అని నన్ను చూసి “చేసిన తప్పుకు శిక్ష అనుభవింపక తప్పదు. నీవు దుర్భరమైన వేయి జన్మలెత్తుతావు. కానీ నీ గురువు మహిమవల్ల దివ్యమైన అయోధ్యానగరమున పుట్టినందువల్ల నీ మనస్సును నాయందు పెట్టి నన్ను పూజించినందువల్ల నీలో అచంచలమైన రామభక్తి ఉదయిస్తుంది. ప్రతి జన్మలో నీకు పూర్వజన్మ స్మృతి ఉంటుంది. వత్సా! ఇంకెప్పుడూ సాధుసజ్జనవిప్రులను నిరాదరింపవద్దు. ఇంద్రుని వజ్రాయుధముతో నాత్రిశూలముతో యముని దండముతో శ్రీహరి చక్రముతో చంపబడనివాడు సజ్జనద్రోహమనెడి అగ్నిలో పడి మాడిపోతాడు” అని చెప్పి నాపై కృపావర్షం కురిపించినాడు ఉమానాథుడు. అప్పటినుంచీ ప్రతి జన్మలోనూ నేను చేసిన తప్పులకు ఎంతో పశ్చాత్తాపముతో దుఃఖిస్తూ రామునిపై భక్తిని మఱువక చివరికి కాకి జన్మనెత్తి మహనీయుడైన లోమశ మహర్షి వద్ద శ్రీరామచరితమానసము విని కాకభుశుండినై శ్రీరామునికి ప్రియుడనైనాను”.

పిల్లలూ! ఈ కథలోని నీతిని మరొక్కమాఱు చూద్దామ్:

  1.   గురుద్రోహం శివకేశవులను భేదబుద్ధితో చూడడం సాధుసజ్జనులను అవమానించడం ఘోరపాపములని మహాశివుడు కాకభుశుండితో చెప్పాడు. కావున మనము గర్వముతో ఇట్టి తప్పులెన్నడునూ చేయరాదు.
  2. కాకభుశుండి గురువు యొక్క దయాగుణం మనకు ఆదర్శం కావాలి. శిష్యుడెన్ని అవమానాలుచేసినా తను చెప్పిన హితవాక్యాలను పెడచెవిన పెట్టినా ఏమాత్రమూ కోపగించుకోలేదు.
  3. రామభక్తుడైన కాకభుశుండి కలియుగ వర్ణనము వలన మనకు చేయకూడనివి ఎన్నోతెలిసినాయి. ఇట్టి దుష్కృతాలకు దూరముగా ఉండి ధర్మమార్గములో నడచుచూ నిత్యం భగవన్నామస్మరణ చేయడమే మన కర్తవ్యమ్.

Search Terms: Kaaka, Kaka Bhushundi, Garuda, Rama, Raama, Lomasha


రఘుమహారాజు – కౌత్సుడు

నవంబర్ 7, 2006

(raghumaharajukautsudu.pdf)

శ్రీమద్రామాయణం లోని కథ

పూర్వం శ్రీ రామ చంద్రుని తాతగారైన రఘుమహారాజు ధర్మవర్తనుడై ప్రజలను పాలించుచుండెడివాడు. ఆ మహానుభావుని రాజ్యంలో అనేక గురుకులాలుండేవి. ఒక్కొక్క గురుకులంలో 1000 తక్కువ కాకుండా శిష్యులుండే వారు. ఆ కాలంలో గురు శిష్యుల అనుబంధం చాలా విశేషంగా ఉండేది. ఒకానొక గురుకులంలో ఓ శిష్యుని శిక్షణ పూర్తి అయింది. గురువుగారు “నాయనా! నాకు తెలిసిన విద్యలన్నీ నీకు నేర్పాను. నీవూ శ్రమించి శ్రద్ధగా విద్యను అభ్యసించావు. ఇక గృహస్థాశ్రమును స్వీకరించి సమాజ కళ్యాణానికి ఉపకరించు. స్వాధ్యాయం (శాస్త్ర పఠనం మొదలైనవి) ఎప్పటికీ మఱువకు” అని అన్నారు.

శిష్యుడైన కౌత్సుడు వినయపూర్వకంగా ఇలా జవాబిచ్చాడు “అయ్యా! నాకు విద్యాబుద్ధులు నేర్పించి సంస్కారవంతుడిని చేశారు. తల్లిదండ్రులను మఱిపించే ప్రేమాభిమానాలు చూపారు. కృతజ్ఞతా చిహ్నంగా గురుదక్షిణను ఇచ్చే అవకాశాన్ని ప్రసాదించండి”. “నిరుపేదవు నీవేమి ఇచ్చుకుంటావు నాయనా” అంటూ ఏమీ వద్దని ఎంతో నచ్చచెప్పాడు గురువు. ఎంత చెప్పినా వినని కౌత్సునితో విసిగి ఈతని పరీక్షిద్దామని గురువు ఇలా అన్నాడు “నీకు 14 విద్యలు నేర్పాను. ఒక మనిషి ఏనుగుపై నిలబడి రివ్వున ఓ రాయి విసిరితే ఎంత ఎత్తు వెళుతుందో అంత ధనరాశులు 14 ఇమ్ము”.

గురుదక్షిణ ఇద్దామన్న సత్సంకల్పమే కాని అది ఎలా నెరవేర్చాలో తెలియలేదు కౌత్సునికి. రాజు తండ్రివంటివాడు అని తలచి రఘుమహారాజు వద్దకు వచ్చాడు కౌత్సుడు.

అంతకు ముందు రోజే రఘుమహారాజు విశ్వజీ అనే మహాయజ్ఞం చేశాడు. ఆ యజ్ఞదానాల్లో తనకున్న సర్వస్వం (సుమారు 14 కోట్ల దీనారాలు) దానం చేశాడు! కౌత్సుడొచ్చేసరికి రఘుమహారాజు మట్టికుండలు పెట్టుకోని సంధ్యావందనం చేస్తున్నాడు. రఘుమహారాజు దానగుణాన్ని చూసి ఆశ్చర్యపోయాడు కౌత్సుడు. కౌత్సుని చూచి వచ్చిన కారణమేమని అడిగాడు రఘుమహారాజు. “రాజా! అది కష్టములే. నేను వెళతాను” అంటూ వెళిపోతున్న కౌత్సుని పిలిచి రాజు “వట్టి చేతులతో వెను తిరిగి పోవటమా! సంశయించక అడుగు నాయనా” అని అన్నాడు. వచ్చిన పని చెప్పి తలదించుకుని నిలుచున్నాడు కౌత్సుడు. “ఱేపు ప్రొద్దున్న రా. నీవు కోరిన ధనం ఇస్తా” అని చెప్పి పంపాడు రఘుమహారాజు.

పురత: (అందరికంటే ముందుగా) హితం చేసే వాడు పురోహితుడని ఎఱిగిన రఘుమహారాజు తన గురువైన వసిష్థ మహర్షి వద్దకు వెళ్ళి సమస్యను వివరించాడు. మహాజ్ఞాని అయిన వసిష్ఠుడు “రాజా! నీవు సంపాదించి ఇవ్వడానికి వ్యవధిలేదు. ఇంద్రునిపై దండెత్తు” అని హితం చెప్పాడు. విజయ భేరీలు మ్రోగాయి. ఆ భీకర భేరీనినాదాలు వజ్రి చెవులకు వినిపించాయి. రఘుమహారాజు రాజ్యంనుంచి వస్తున్నాయని తెలుసుకొని దేవేంద్రుడు “ఎంతో ధర్మాత్ముడు రఘుమహారాజు. ఆయన కోశాగారాలన్నీ ధనంతో నింపమని” ఆజ్ఞాపించాడు. రాజబంట్లు కోశాగారాలు నిండి ఉన్నాయని రఘుమహారాజుతో విన్నవించారు. దండయాత్రకు స్వస్తిచెప్పి కౌత్సుడు రాగానే “మీ ధనం కోశాగారాల్లో ఉంది. తీసుకు వెళ్ళండి” అన్నాడు.

తను అడిగినదానికన్నా ఎక్కువుందని తెలిసిన కౌత్సుడు “రాజా! నాకు కావలసినవి ౧౪ రాశులే. మిగతా ధనం నాది కాదు” అని వెళిపోయి గురుదక్షిణ చెల్లించుకున్నాడు. “మరి ఈ ధనమెవరిది” అని రఘుమహారాజు మిగిలనదంతా దేవేంద్రునికి పంపివేశాడు! అంతటి ధర్మాత్ముడు కాబట్టే పరమాత్మ అతని పౌత్రునిగా పుట్టినాడు.

పిల్లలూ! ఈ కథలోని నీతులను మరొక్కమాఱు చూద్దాం:

  1. గురు శిష్యుల అన్యోన్యమైన సంబంధం ఈ కథలో మనకు తెలిసింది. ప్రతిఫలం ఆశించకుండా సర్వవిద్యలూ నేర్పే గురువులు గురువుని దైవంగా పూజించి కృతజ్ఞత తెలియ చేయాలనుకునే శిష్యులు ఉన్న భారతదేశం భూలోక స్వర్గం.
  2. రఘుమహారాజు యొక్క దానగుణం ఈ కథలో వ్యక్తమైంది. ఆతుడు సంపాదించినదంతా దానం చేసేవాడు. దానం చేయటానికి మళ్ళీ సంపాదించేవాడు.
  3. కౌత్సుడియొక్క రఘుమహారాజుయొక్క నిజాయితీ శ్లాఘనీయం. ధర్మపరంగా వారికెంతకావాలో అంతే తీసుకుని మిగిలినది ఇంద్రునికి ఇచ్చివేశారు.

Search Terms: Raghu Maharaja, Kautsa, Kauthsa