ఇంద్రద్యుమ్నుని కథ

డిసెంబర్ 20, 2006

(indradyumna.pdf)

మహాభారతము లోని కథ

పూర్వం ఇంద్రద్యుమ్నుడనే రాజేంద్రుడు ఉండేవాడు. అతడు ఎన్నో దానధర్మాలు చేసి ధర్మాచరణలో తనంతటి వాడు లేడనే ఖ్యాతిని పొందినాడు. లెక్కగట్టలేనన్ని గో భూ హిరణ్య దానములు పాత్రులైన వారికిచ్చి అనంత పుణ్యసంపదను ఆర్జించుకొన్నాడు. రాజర్షి అయ్యి ప్రజారంజకముగా పాలన చేసినాడు. అలా ఎన్నో వర్షములు రాజ్యపాలనము చేసి తన పుణ్యనిధి ప్రభావముతో కాలం చెల్లాక స్వర్గం చేరుకొన్నాడు. చాలాకాలము స్వర్గభోగాలు అనుభవించిన తరువాత ఒకరోజు దేవేంద్రుడు ఇంద్రద్యుమ్నుని పిలిపించి

“మహాత్మా! నీవు అనేక దానధర్మాలు చేసి ఎంతో పుణ్యమును ఆర్జించినావు కనుక ఇంత దీర్ఘకాలము స్వర్గములో ఉండగలిగినావు. కానీ పరమేశ్వరుని శరణువేడి ఆయన కృపతో పోందెడి మోక్షపదము ఒక్కటే శాశ్వతమైనది (ఇతరములు శాశ్వతములు కావు). నీ పుణ్యఫలమును అనుభవించినావు కావున సర్గమును వీడు సమయము వచ్చినది” అని చెప్పినాడు. స్వర్గాధిపతి మాటలు విని ఇంద్రద్యుమ్నుడు ఇంతకొద్ది కాలములోనే తన పుణ్యరాసులు ఎలా కరిగిపోయినాయి? అని ఆశ్చర్యపోయినాడు. అది చూసి శచీపతి “రాజా! భూలోకములో నిన్ను కానీ నీవుచేసిన సత్కర్మలను కానీ గుర్తుపెట్టుకొన్న వానిని నాకు చూపిస్తే నీవు స్వర్గములోనే ఉండవచ్చు. చేసిన దానములు మహనీయములు కాకపోతే జనులు చిరకాలము గుర్తుంచుకొనరు కదా! కావున నీ దానములను ఎంతకాలము ప్రజలు ఉపయోగింతురో అంతకాలము నీవిక్కడనుండవచ్చు” అని హితవు చెప్పినాడు. ఇంద్రుని ఆజ్ఞతీసుకొని అట్టివారు ఉన్నారేమో వెదకటానికి బయలుదేరినాడు ఇంద్రద్యుమ్నుడు.

చిరంజీవి అయిన మార్కండేయ మహర్షి వద్దకువెళ్ళి నమస్కరించి “ఓ తపస్విచంద్రమా! నన్ను మీరు ఎఱుగుదురా”? అని అడిగినాడు. అప్పటికి ఎంతోకాలముగా తీర్థయాత్రలుచేసి ఉపవాస వ్రతాలు చేసి కృశించి ఉన్న మార్కండేయ మహర్షి గుర్తులేదని చెప్పినాడు. అప్పుడు ఇంద్రద్యుమ్నుడు “స్వామి! చిరంజీవులైన మీకంటే ముందుపుట్టిన ప్రాణి ఏదైనా బ్రతికి ఉన్నదా”? అని అడిగినాడు. “పవిత్ర హిమాలయ పర్వత ప్రాంతములో ప్రావారకర్ణం అనే గుడ్లగూబ ఉన్నది” అని బదులిచ్చినాడు మార్కండేయ మహర్షి.

వెంటనే ఆ ఉలూకము వద్దకు చేరి “అయ్యా! నెన్నెఱుగుదువా”? అని ప్రశ్నించినాడు. తెలియదు అని చెప్పి “ఇక్కడికి కొన్ని యోజనాల దూరములో ఇంద్రద్యుమ్నమను సరోవరమున్నది. ఆ సరోవరములో నాడీజంఘమనే కొంగ ఉన్నది” అని ప్రావారకర్ణం చెప్పగా ఇంద్రద్యుమ్నుడు బ్రహ్మదేవుని స్నేహితుడైన నాడీజంఘుని వద్దకు చేరి “ఓ బకరాజా! నన్ను మీరు గుర్తుపట్టినారా”? ప్రశ్నించినాడు. “లేదు. ఈ సరోవరములో ఆకూపారమనే తాబేలు ఉన్నది. అది నాకంటే పెద్దది. దానికి నీవు తెలుసేమో కనుక్కో” అని చెప్పినది.

ఇంద్రద్యుమ్నుని చూడగానే ఆకూపార కళ్ళుచెమ్మగిల్లాయి “అయ్యా! వెయ్యి యజ్ఞములు సాంగముగా చేసి వెయ్యి యూపస్తంభాలు కట్టించినావు. ఆ యజ్ఞదానాలలో లెక్కకట్టలేనన్ని గోదానాలు ఇచ్చినావు. నీవు దానము ఇచ్చిన గోవుల రాకపోకలతో ఈ భూమి దిగబడి యింత సరోవరము అయినది. ఇది అంతా నీ చలవే” అని కృతజ్ఞతాపూర్వకముగా చెప్పినది. మరుక్షణం దేవతలు దివ్యవిమానములో ఇంద్రద్యుమ్నుని స్వర్గానికి తీసుకొని వెళ్ళినారు.

పిల్లలూ! ఈ కథలోని నీతులను మరొక్కమాఱు చూద్దాము:

  1. మన సత్కీర్తి భూలోకములో ఉన్నంత కాలము సర్గలోకము కరతలామలకము. ఆకూపార ఇంద్రద్యుమ్నుడు చేసిన దానములు మరువలేదు కావున ఇంద్రద్యుమ్నునికి పునః సర్గలోక ప్రాప్తి కలిగినది. కానుక మనము నలుగురుకీ ఉపకరించే పనులు చేయాలి. అవియే మనలను రక్షించు సంపదలు (ధనము కాదు).
  2. దేవేంద్రుడు చెప్పినట్టు మోక్షము ఒక్కటే శాశ్వతపదము. ఇంత పుణ్యాత్ముడు కాబట్టే మహావిష్ణువు గజేంద్ర రూపములో ఉన్న ఇంద్రద్యుమ్నునిచే “నీవేతప్ప హితః పరంబెఱుగను …” అని అనిపించి అతనికి శాశ్వతమైన మోక్షమును ప్రసాదించినాడు (గజేంద్ర మోక్షము కథ). కావున మోక్షమునకు పుణ్యమే ప్రథమ సోపానము.

Search Terms: Indradyumna, Gajendra, Indra.


భక్త పురందరదాసు కథ

డిసెంబర్ 2, 2006

(purandara.pdf)

పూర్వం విక్రమార్క శకం 16వ శతాబ్దములో నవనిధి శ్రీనివాసనాయకుడనే గొప్పధనవంతుడు ఉండేవాడు. అతడు పరమ లోభి. భార్య సరస్వతీబాయి భక్తురాలు దానగుణశీలి. పతియే ప్రత్యక్షదైవమని నమస్కరించిన ఆ సాధ్వితో శ్రీనివాసనాయకుడిలా అనేవాడు “ఏమని ఆశీర్వదించను? అంకా దానధర్మాలు చేయమనా?” “స్వామీ! మీ ఆనుజ్ఞ తీసుకునే నేనీ వ్రతము ఆచరించితిని కదా!” అని బదులిచ్చిన భార్యతో “ఆ! ఆ! పొందితివి పొందితివి. తులసీపూజయే కదా ఖర్చు ఉండదులే అనుకున్నాను. కాని ఆ పేరుతో దంపతి పూజలు దానాలు ఒక్కటేమిటి అన్నీ చేశావు. నీ సుపుత్రుడు వరదుడు లెక్క చూపిన తరువాతే నాకీ విషయం తెలిసింది. నువ్విలాంటి నాగులు వ్రతాలు చేస్తే చాలు మనమందఱము తలకొక జోలె పట్టుకోవలసి వస్తుంది” అని అనేవాడు శ్రీనివాసనాయకుడు.

“రామ! రామ! అట్లా అనకండి. భగవంతుడు మనకు ఇచ్చినప్పుడే దానాదులు చేయకుంటే లేనప్పుడీయ గలమా”? అని సత్యం పలికిన సరస్వతీబాయితో శ్రీనివాసనాయకుడు “ఇందులో భగవంతుడిచ్చినది ఏమున్నది? మా తాతముత్తాతలు మా నాన్నగారు నేను ఎంతో శ్రమించి ఆర్జించినదే కదా!” అని అనేవాడు. “దానధర్మాదులకు ఉపయోగపడని ధనమెందులకు స్వామి? ఇట్టి సత్కార్యములే సద్గతులకు చద్ది మూటలని సాధుసజ్జనులంటారు” అని హితవు చెప్పిన భార్యతో భర్త “ఆ సన్యాసుల మాటలకేమిలే వాళ్ళలానే అంటారు. అవన్నీ ఆచరిస్తూ కూర్చుంటే మనకు మిగిలేది బూడిదే! చూడు సరస్వతీ! ధనమూలమిదం జగత్ అన్నారు. ఆ సిరి యొక్క గరిమ ఎంతో కష్టపడి సంపాదించిన నాకు తెలుసు” అని అనేవాడు. ఆ భార్యా భర్తల సంభాషణములు ఇలా ఉండేవి!

శ్రీనివాసనాయకుని అనంత పూర్వజన్మ పుణ్యమో లేక సరస్వతీబాయి అఖండ సౌశీల్య మహాత్మ్యమో పుట్టు లోభి అయిన శ్రీనివాసనాయకుని భక్త పురందరదాసుగా మార్చా అనుకున్నాడు పాండురంగ విఠ్ఠలుడు. ఏ దుర్గుణాన్నైనా నివారించవచ్చును కానీ లోభగుణాన్ని మార్చుట దుష్కరం అని అనుకున్న స్వామి స్వయంగా ఆ శ్రీనివాసనాయకుని వద్దకు ఒక బ్రాహ్మణుని వేషంలో వచ్చాడు. ఎవరి పాదాలకు సకల చరాచర జీవులు ముక్తికై చేతులుజోడించి నమస్కరిస్తాయో అట్టి స్వామి శ్రీనివాసనాయకుని ముందర నిలిచి ఏదైనా దానమివ్వమని యాచించేవాడు! కసురుకుంటూ వెళ్ళగొట్టేవాడు నాయకుడు.

భగవంతుడు శ్రీనివాసనాయకుడెన్ని అవమానాలు చేసినా రోజూ పుత్రవాత్సల్యంతో వచ్చి ఏదో ఒకటి దానమిమ్మని అర్థించేవాడు. భగవంతుడు ఎన్ని సార్లు అడిగినా ఆ శ్రీనివాసనాయకుడు ఒక్కసారికూడా ఏమీ ఇవ్వలేదు. ఇలా ప్రతిరోజు ఆ లక్ష్మీపతి శ్రీనివాసనాయకుని మార్చడం కోసం పడరాని పాట్లు పడ్డాడు. బహుశః ఇందుకేనేమో ఆ భగవంతుడు ఆశ్రితపక్షపాతి అని నిందింపబడినాడు. నీవే తప్ప ఇతరమెఱుగనని శరణువేడిన సరస్వతీబాయిని రక్షించటానికే నేమో ప్రాయశః స్వామి ఇన్ని పాట్లుపడ్డాడు. లేదా కర్మయే పరమాత్మ అన్న నిజం నిరూపించేలా శ్రీనివాసనాయకుని పూర్వజన్మల పుణ్యానికి ఫలముగా ఇలా అనుగ్రహించదలచినాడో స్వామి. ఆ పన్నగశాయి లీలలు అర్థం చేసుకోవటం ఎవరి తరము?

“ఏమైనా సరే నీకేమీ ఇవ్వను” అని నిక్కచ్చగా అన్నాడు ఒకరోజు విప్రవేషంలో ఉన్న భగవంతుని చూసి శ్రీనివాసనాయకుడు. “అయ్యా! వీడు నా ఒక్కగానొక్క కొడుకు. వీడికి ఉపనయనం చేయాలని సంకల్పించాను. ఓం ప్రథమంగా మీ వద్దకొచ్చాను. మీరు దయతో ఏది ఇచ్చినా తీసుకుంటాను” అని అడిగాడు భగవంతుడు. “ఏది ఇచ్చినా తీసుకుంటావా?” అని రెట్టిస్తూ “నేను ఇచ్చేది కిం అనక తీసుకు వెళిపోవాలి” అని అంటూ ఇల్లంతా వెతికి వెతికి తుప్పు పట్టిన కాణీ బిళ్ళ తెచ్చి విఠ్ఠలునికి ఇచ్చి పంపించి “పీడా వదిలింది” అనుకున్నాడు.

ఏదో పనిమీద నాయకుడు బయటికెళ్ళాడోలేదో మళ్ళీ ప్రత్యక్షమయ్యాడు విఠ్ఠలనాథుడు. “అమ్మా! నాకు సహాయం చేయండి” అని అన్నాడు స్వామి. “ఇందాకే కదయ్య మా ఆయనిచ్చారు?” అని అన్నది ఆ ఇల్లాలు. ఆ తుప్పుపట్టిన కాణీ చూపించాడు స్వామి. ఖిన్నురాలై నిస్సహాయిగా నిలుచున్న ఆమెను చూసి పరమాత్మ “అమ్మా! మీ ముక్కెర ఇప్పిస్తే నా అవసరం తీరుతుంది” అని అన్నాడు. నీళ్ళునములుతూ యాచించిన ఆ పేద బ్రాహ్మణుని చూసి జాలిపడి సరస్వతీబాయి వెంటనే తన ముక్కెర తీసి ఇచ్చింది. మనసారా ఆశీర్వదించి ముక్కెర తీసుకుని స్వామి వెళ్ళిపోయాడు.

విప్రునికి ముక్కెర ఇచ్చింది కాని భర్తకు ఏమని సమాధానం చెబుతుంది? ఏమి చేయాలిరా భగవంతుడా అని వ్యాకుల పడుతుండగా ఆమె ప్రాణాలపాలిటి రెండో కాలునిలా శ్రీనివాసనాయకుడు వచ్చి “ఏదీ నీ ముక్కెర?” అని ప్రశ్నించాడు. లోభికి ధనం తప్ప ఇంకేదీ కానరాదు కదా! ఎక్కడుందో వెతికి తెమ్మన్నాడు భర్త. “రంగ రంగ! ఏమి లీల స్వామి? నాకు దిక్కెవ్వరు?” అని భగవంతునికి మొరపెట్టుకుంది సరస్వతీబాయి. “ఇది ఏమైనా సత్యయుగమా చమత్కారాలు జరగడానికి?” అని అనుకుని మరణమే శరణ్యమని నిశ్చయించుకున్నది.

ప్రేమతో అటుకులిచ్చినందుకే స్వామి సుదామునికి అనంత ఐశ్వర్యాలు కడకు కైవల్యమిచ్చాడు. ఇక అవసరానికి ఏమీ సంకోచించక అడిగనదే తడవుగా ముక్కెర ఇచ్చిన ఆ సాధ్విని మఱుస్తాడా స్వామి? “సాధ్వీ! నీ దానగుణానికి భక్తికి మెచ్చాను. ముక్కెర ధారపోసి ముక్తేశుడనైన నన్ను కొన్నావు. ఇదుగో! ముక్తిని తులతూచిన నీ ముక్కెర” అన్న భగవంతుని అంతర్వాణి వినిపించింది సరస్వతీబాయికి. ఎంతో సంతోషంతో ముక్కెర తీసుకొని భర్త దగ్గరకు వెళ్ళింది. అదిచూసి అవాక్కయ్యాడు నాయకుడు. విప్రుడు తన వద్దకే వచ్చి ముక్కెర అమ్మాడు. విషయము తెలిసింది ఆ దంపతులకు. రోజూ విప్రవేషంలో వచ్చి యాచించినది ఆ విఠ్ఠలేశుడే అని అవగతమైంది ఆ దంపతులకు. “వడివాయక తిరిగే ప్రాణబంధుడు స్వామి” అన్న సత్యం తెలుసుకున్నాడు నాయకుడు. ఆ రోజునుండి ఎన్నో దానధర్మాలుచేస్తూ భగవంతుని భక్తితో కొలుస్తూ తరించారు ఆ దంపతులు. దాదాపు నాలుగు లక్షల సంకీర్తనలు గానంచేసి భక్త పురందరదాసుగా ప్రసిద్ధికెక్కాడు శ్రీనివాసనాయకుడు.

purandara.jpg

పిల్లలూ! ఈ కథలోని నీతిని మరొక్కమాఱు చూద్దాము:

1. కర్మఫలం అమోఘమైనది. శ్రీనివాసనాయకుని పూర్వ పుణ్యం వలన భగవంతుడు స్వయంగా వచ్చి అతనిలోని లోభగుణాన్ని పోగొట్టి కాపాడినాడు.
2. ఇంటికి దీపం ఇల్లాలు అని పెద్దలంటారు. ఆ సూక్తికి తార్కాణం సరస్వతీబాయి. సుశీలవతి అయిన సరస్వతీబాయి తన సుగుణాలతో స్వామిని మెప్పించి తనను తానే కాక తన భర్తను కుడా తరింపచేసింది.
3. లోభం చాలా భయంకరమైన దుర్గుణము. సాక్షాత్ ఆ భగవంతునికే శ్రీనివాసనాయకుని లోభగుణం మార్చడానికి అంత శ్రమ పడవలసి వచ్చింది. మనమెన్నడూ ధనకాంక్షులము కారాదని దానధర్మాలు చేయాలని మనకీ కథద్వారా తెలిసినది.


భూదాన మహిమ

నవంబర్ 22, 2006

(bhudanamahima.pdf)

భరద్వాజ సంహిత లోని కథ

ఒకసారి దేవేంద్రునికి దేవగురువైన బృహస్పతులవారు భూదానము యొక్క గొప్పతనమును గూర్చి వివరిస్తూ ఈ కథ చెప్పారు:

మాళవ దేశములో ఒక ఘోరారణ్యమున్నది. సూర్యరస్మి కూడా చొచ్చుకు పోలేనంత దట్టమైన అడవి. ఆ మహారణ్యములో ఒక పెద్ద బూఱుగు చెట్టు ఉన్నది. శాఖోపశాఖలతో బాగా విస్తరించి ఉన్న ఆ శాల్మలీవృక్షం ఎన్నెన్నో పక్షులకు జంతువులకు సమాశ్రయాన్ని కల్పిస్తున్నది. చిలుకల కలకలరవాలతో జలపాతాల శబ్దాలతో పచ్చగా కన్నులకు పండుగగా ఉన్నది ఆ అడవి.

ఆ బూఱుగు చెట్టు కొమ్మపై తామ్రతుండం అనే ఒక రామచిలుక కాపురముండేది. ఆ శుకం తన పిల్లలకు నివ్వరిపైరు ఆహారముగా పెట్టేది. తామ్రతుండం పిల్లలు ఆ వడ్లను ఎలా తినాలో కూడా తెలియని పసికూనలు. అందుకని ముక్కుతో ఆ వడ్లను తీసుకుని పిల్లల నోటిలో పడేశేది తామ్రతుండం. ఇలా వడ్లు పెట్టేటప్పుడు కొన్ని గింజలు క్రింద పడేవి. కొన్నాళ్ళకు అవి మొలకలెత్తి కాలక్రమేణ ఒక చిన్న వరిపైరు తయాఱయింది!

ఒకరోజు ఎక్కడా సరి అయిన పచ్చగడ్డి దొరకని ఒక ఆవు ఆకలిదప్పికలతో అలసి ఆ శాల్మలీ వృక్షం దగ్గరకు వచ్చినది. తామ్రతుండం ముక్కునుండి జారిన వడ్లతో పెరిగిన పైరు చూసి సంతోషించి స్వేచ్ఛగా తిని తృప్తి చెంది వెళిపోయింది. తరువాత ఆ గోవు తినగా మిగిలిన యవలతో ఒక విప్రోత్తముడు పంచయజ్ఞాలు చేశాడు.

అలా దైవికంగా తామ్రతుండానికి మహాపుణ్యం వచ్చింది. కాలధర్మం చేశాక అది చేసుకున్న సుకృతము వలన ధనికుడనే ఒక ధర్మాత్ముడైన వైశ్యునిగా జన్మించింది. ఓడవ్యాపారి అయిన ఆ ధనికునికి పూర్వజన్మ స్మృతి ఉన్నది. అజ్ఞానవశః తన ముక్కునుండి జారిపడిన ధాన్యం మొలకెత్తి ఒక గోవు ఒక విప్రుడు ఆ పంటను ఉపయోగించినందుకే తనకి ఇంత ఫలితం వచ్చిందని తెలిసిన ఆ ధనికుడు ఎన్నో ఫలవంతాలైన మంచి మాగాడి భూములను పండితులకు దానము చేశాడు. ఆ పుణ్యఫలముతో ఇహములో సర్వభోగాలు అనుభవించి కడకు విష్ణులోకం చేరుకున్నాడు.

పిల్లలూ! ఈ కథలోని నీతిని మరొక్కమాఱు చూద్దామ్:

సస్యసంపూర్ణము ఫలవృక్ష సమన్వితము అయిన భూమిని భక్తితో సత్పాత్రునకు సమర్పించిన వాడికి బ్రహ్మలోకం కరతలామలకం. అజ్ఞానతః తన భూమిలోని పైరు ఇతరులకి ఉపయోగ పడినందుకే తామ్రతుండానికి అంత పుణ్యం వస్తే ఇక జ్ఞానపూర్వకముగా ఫలవృక్షములున్న భూమిని అర్హునికి దానముచేస్తే ఎంత ఫలమో ఆ పరమేశ్వరునికే తెలుసు.


భరతుని కథ

నవంబర్ 11, 2006

(bharatunikatha.pdf)

శ్రీమద్భాగవతం లోని కథ

శ్రీ హరి అంశతో పుట్టిన భరతుడు కణ్వాశ్రమంలో తన బాల్యాన్ని గడిపినాడు. వనమే అతని క్రీడారంగం మృగాలే అతని స్నేహితులు. ఆ బలశాలి సింహం పిల్లలతో ఆటలాడే వాడు! ఆ పసివాడి బలపరాక్రమాలు చూచి ఆశ్చర్యచకిత అయ్యేది తల్లి శకుంతల. స్వయంగా కణ్వమహర్షే భరతునికి జాతక కర్మలు చేసి విద్యాబుద్ధులు నేర్పినాడు. కుమారుడైన భరతుని తీసుకుని కణ్వ మహర్షి అనుజ్ఞపై ఆ సాధ్వి దుష్యంతుని వద్దకు వెళ్ళింది.

రాజు యొక్క జీవతం కత్తిమీద సాము వంటిది. అతడు ఏది చేసినా ప్రజల హితం కోరి వారి ఆమొదంపైనే చేయాలి. శకుంతల భరతుని తీసుకొని వచ్చి ఈతడే నీ వారసుడు అని చూపినది. ఆ విషయం నిజం అని తనకి శకుంతలకి కణ్వమహర్షికే తెలుసు. అది ప్రజులకు విశ్వసనీయమైన రీతిలో తెలియ చేయాలని తలచి ఆ ధర్ముడే రక్షిస్తాడని నమ్మి ఏమనక ఊరకున్నాడు దుష్యంతుడు. అప్పుడు ధర్మాత్ముడైన దుష్యంతుని కరుణించి ఆకాశవాణి అందఱికీ తెలిసే లాగా స్పష్టంగా ఈ భరతుడే దుష్యంతుని పుత్రుడు కాబోవు చక్రవర్తి అని చెప్పినది. ఆ వాక్కు విని దుష్యంతుడు శకుంతల సంతసించి పుత్రినికి పట్టాభిషేకం చేసి ఐహిక విషయాల మీద మనసు పెట్టక తపోవనాలకు వెళ్ళిపోయారు.

భరతుడు సమర్థమైన తన భుజస్కంధాలపైన ఈ భూభారాన్నంతా నిలిపి ధర్మపాలన చేశాడు. ధర్మస్థాపన కోసమే యుద్ధం చేసేవాడు. తన దిగ్విజయ యాత్రలో సనాతన ధర్మానికి విరుద్ధమైన శక కబర బర్బర కష కిరాతక హూణ మ్లేచ్ఛ దేశాల రాజులను అణచాడు. పాతాళంలో దేవతాస్త్రీలను చెఱబెట్టిన రాక్షసులను శిక్షించి ఆ స్త్రీలను వారి భర్తలకు అప్పగించినాడు. త్రిపురరాక్షసులను జయించి దేవతలను వారి వారి పదవులయందు నిలబెట్టినాడు. సత్యం శౌచం దయ తపస్సు స్థిరంగా భరతుని రాజ్యంలో ఉండటంతో ప్రకృతి సహజంగా జనాలు కోరినవన్నీ ఇచ్చేది.

ఈ భూమండలం అంతా భరతుని పాలనలో ఉన్నా కర్మ భూమి అయిన ఈ భరతఖండంలోనే అన్ని యజ్ఞ యాగాదులు దాన ధర్మాలు చేశాడు. దీర్ఘతపుడను మర్షిని పురోహితునిగా చేసుకుని యమునా తీరమునందు 78 అశ్వమేధయాగాలు చేశాడు. గంగాతీరం పొడుగునా 55 అశ్వమేధాలు చేసి దేవేంద్రుని అతిశయించిన వైభవంతో శోభించినాడు.

13084 పాడి ఆవుల మందను ద్వంద్వం అంటారు. అట్టి 1000 ద్వంద్వాలను దూడలతోపాటు బంగారముతో గిట్టలు కొమ్ములు అలంకరించి బాగా పండితులైన 1000 మంది విప్రోత్తములకి దానం చేశాడు. బంగారు నగలతో శోభించేవీ తెల్లని దంతాలు కలవీ అయిన 1400000 నల్లని ఏనుగులను మష్కారతీర్థం ఒడ్డున దాన మిచ్చినాడు!

కుబేరునితో సమానమైన సంపద సాటిలేని శౌర్యం దేవేంద్రునితో సమానమైన విభవం మహర్షులతో సరితూగే తపశ్శక్తి ఉండికూడా భరతుడు ఎన్నడూ గర్వించక అర్థశరీరాలు తృణప్రాయంగా భావించి శాంతికాముకుడై భగవత్భక్తితో జీవించాడు. ఈ విధముగా 27000 యేండ్లు రాజ్యపాలన చేసినాడు. ఈ భరతుని సంతతి వారము కనుక మనం భారతీయులం అయ్యాము.

పిల్లలూ! మనం ఈ కథలోని నీతులను మరొక్కమాఱు చూద్దామ్:

ఒక మనిషి నిజంగా మనస్సుపెట్టి ధర్మబుద్ధితో పరిశ్రమ చేస్తే దేవతలనే మించిన మహామనీషి అవుతాడని భరతుడు మనకు నిరూపించాడు. అతడు తన బలపరాక్రమాలను ఉపయోగించి యుద్ధములలో విజయుడై భూమండలం అంతటా ధర్మస్థాపన చేశాడు. ప్రజల హితార్థం ఎన్నో యజ్ఞ యాగాదులు చేశాడు. నభూతో నభవిష్యతి అనే రీతిలో ఎన్నో దాన ధర్మాలు చేసి యశశ్వి అయ్యాడు.

భారతీయుల ఆధ్యాత్మ చింతన ఈ కథలో మనకు తెలిసింది. దుష్యంతుడు శకుంతల అన్ని ఐశ్వర్యాలను రాజభోగాలను పుత్రపౌత్రాది ఆకర్షణను త్యజించి తపోవనాలకి వెళ్ళి తపస్సు చేసుకొన్నారు. అలాగని కర్తవ్యాన్ని విస్మరించకుండా ఎంతో కాలం ధర్మం తప్పకుండా రాజ్యపాలన చేసి కర్తవ్యం పూర్తి చేసుకొని ఆ తరువాతే వానప్రస్థం స్వీకరించారు.

Search Terms: Bharata, Bharatha, Dushyanta, Dushyantha, Shakuntala, Shakunthala, Kanva


రఘుమహారాజు – కౌత్సుడు

నవంబర్ 7, 2006

(raghumaharajukautsudu.pdf)

శ్రీమద్రామాయణం లోని కథ

పూర్వం శ్రీ రామ చంద్రుని తాతగారైన రఘుమహారాజు ధర్మవర్తనుడై ప్రజలను పాలించుచుండెడివాడు. ఆ మహానుభావుని రాజ్యంలో అనేక గురుకులాలుండేవి. ఒక్కొక్క గురుకులంలో 1000 తక్కువ కాకుండా శిష్యులుండే వారు. ఆ కాలంలో గురు శిష్యుల అనుబంధం చాలా విశేషంగా ఉండేది. ఒకానొక గురుకులంలో ఓ శిష్యుని శిక్షణ పూర్తి అయింది. గురువుగారు “నాయనా! నాకు తెలిసిన విద్యలన్నీ నీకు నేర్పాను. నీవూ శ్రమించి శ్రద్ధగా విద్యను అభ్యసించావు. ఇక గృహస్థాశ్రమును స్వీకరించి సమాజ కళ్యాణానికి ఉపకరించు. స్వాధ్యాయం (శాస్త్ర పఠనం మొదలైనవి) ఎప్పటికీ మఱువకు” అని అన్నారు.

శిష్యుడైన కౌత్సుడు వినయపూర్వకంగా ఇలా జవాబిచ్చాడు “అయ్యా! నాకు విద్యాబుద్ధులు నేర్పించి సంస్కారవంతుడిని చేశారు. తల్లిదండ్రులను మఱిపించే ప్రేమాభిమానాలు చూపారు. కృతజ్ఞతా చిహ్నంగా గురుదక్షిణను ఇచ్చే అవకాశాన్ని ప్రసాదించండి”. “నిరుపేదవు నీవేమి ఇచ్చుకుంటావు నాయనా” అంటూ ఏమీ వద్దని ఎంతో నచ్చచెప్పాడు గురువు. ఎంత చెప్పినా వినని కౌత్సునితో విసిగి ఈతని పరీక్షిద్దామని గురువు ఇలా అన్నాడు “నీకు 14 విద్యలు నేర్పాను. ఒక మనిషి ఏనుగుపై నిలబడి రివ్వున ఓ రాయి విసిరితే ఎంత ఎత్తు వెళుతుందో అంత ధనరాశులు 14 ఇమ్ము”.

గురుదక్షిణ ఇద్దామన్న సత్సంకల్పమే కాని అది ఎలా నెరవేర్చాలో తెలియలేదు కౌత్సునికి. రాజు తండ్రివంటివాడు అని తలచి రఘుమహారాజు వద్దకు వచ్చాడు కౌత్సుడు.

అంతకు ముందు రోజే రఘుమహారాజు విశ్వజీ అనే మహాయజ్ఞం చేశాడు. ఆ యజ్ఞదానాల్లో తనకున్న సర్వస్వం (సుమారు 14 కోట్ల దీనారాలు) దానం చేశాడు! కౌత్సుడొచ్చేసరికి రఘుమహారాజు మట్టికుండలు పెట్టుకోని సంధ్యావందనం చేస్తున్నాడు. రఘుమహారాజు దానగుణాన్ని చూసి ఆశ్చర్యపోయాడు కౌత్సుడు. కౌత్సుని చూచి వచ్చిన కారణమేమని అడిగాడు రఘుమహారాజు. “రాజా! అది కష్టములే. నేను వెళతాను” అంటూ వెళిపోతున్న కౌత్సుని పిలిచి రాజు “వట్టి చేతులతో వెను తిరిగి పోవటమా! సంశయించక అడుగు నాయనా” అని అన్నాడు. వచ్చిన పని చెప్పి తలదించుకుని నిలుచున్నాడు కౌత్సుడు. “ఱేపు ప్రొద్దున్న రా. నీవు కోరిన ధనం ఇస్తా” అని చెప్పి పంపాడు రఘుమహారాజు.

పురత: (అందరికంటే ముందుగా) హితం చేసే వాడు పురోహితుడని ఎఱిగిన రఘుమహారాజు తన గురువైన వసిష్థ మహర్షి వద్దకు వెళ్ళి సమస్యను వివరించాడు. మహాజ్ఞాని అయిన వసిష్ఠుడు “రాజా! నీవు సంపాదించి ఇవ్వడానికి వ్యవధిలేదు. ఇంద్రునిపై దండెత్తు” అని హితం చెప్పాడు. విజయ భేరీలు మ్రోగాయి. ఆ భీకర భేరీనినాదాలు వజ్రి చెవులకు వినిపించాయి. రఘుమహారాజు రాజ్యంనుంచి వస్తున్నాయని తెలుసుకొని దేవేంద్రుడు “ఎంతో ధర్మాత్ముడు రఘుమహారాజు. ఆయన కోశాగారాలన్నీ ధనంతో నింపమని” ఆజ్ఞాపించాడు. రాజబంట్లు కోశాగారాలు నిండి ఉన్నాయని రఘుమహారాజుతో విన్నవించారు. దండయాత్రకు స్వస్తిచెప్పి కౌత్సుడు రాగానే “మీ ధనం కోశాగారాల్లో ఉంది. తీసుకు వెళ్ళండి” అన్నాడు.

తను అడిగినదానికన్నా ఎక్కువుందని తెలిసిన కౌత్సుడు “రాజా! నాకు కావలసినవి ౧౪ రాశులే. మిగతా ధనం నాది కాదు” అని వెళిపోయి గురుదక్షిణ చెల్లించుకున్నాడు. “మరి ఈ ధనమెవరిది” అని రఘుమహారాజు మిగిలనదంతా దేవేంద్రునికి పంపివేశాడు! అంతటి ధర్మాత్ముడు కాబట్టే పరమాత్మ అతని పౌత్రునిగా పుట్టినాడు.

పిల్లలూ! ఈ కథలోని నీతులను మరొక్కమాఱు చూద్దాం:

  1. గురు శిష్యుల అన్యోన్యమైన సంబంధం ఈ కథలో మనకు తెలిసింది. ప్రతిఫలం ఆశించకుండా సర్వవిద్యలూ నేర్పే గురువులు గురువుని దైవంగా పూజించి కృతజ్ఞత తెలియ చేయాలనుకునే శిష్యులు ఉన్న భారతదేశం భూలోక స్వర్గం.
  2. రఘుమహారాజు యొక్క దానగుణం ఈ కథలో వ్యక్తమైంది. ఆతుడు సంపాదించినదంతా దానం చేసేవాడు. దానం చేయటానికి మళ్ళీ సంపాదించేవాడు.
  3. కౌత్సుడియొక్క రఘుమహారాజుయొక్క నిజాయితీ శ్లాఘనీయం. ధర్మపరంగా వారికెంతకావాలో అంతే తీసుకుని మిగిలినది ఇంద్రునికి ఇచ్చివేశారు.

Search Terms: Raghu Maharaja, Kautsa, Kauthsa