దురాశ దుఃఖములకు చేటు

డిసెంబర్ 10, 2006

(durashaduhkhamulakucetu.pdf)

శ్రీరామచరిత మానసము లోని కథ

కైకయ రాజైన ప్రతాపభానుడు సద్గుణసంపన్నుడు మరియు గొప్పయోధుడు. అతని ప్రియసోదరుడు అరిమర్దనుడు. అరిమర్దనుడు మహాబలశాలి వీరుడు. ప్రతాపభానుని మంత్రి ధర్మరుచి. అతడు నీతజ్ఞుడు బుద్ధిమంతుడు రాజనీతిలో శుక్రుని తోటివాడు శ్రీహరిభక్తుడు రాజుకు హితైషి. దిగ్విజయయాత్రలో ఆ రాజు సప్తద్వీపాలనూ జయించి సమస్త భూమండలమునకు ఏకైకచక్రవర్తి అయ్యాడు. మంత్రి అయిన ధర్మరుచి ప్రభావమువలన ఆ రాజు గురువులను దేవతలను సాధుసజ్జనులను పితరులను భూసురులను భక్తివిశ్వాసాలతో సేవించుచుండెడివాడు. రాజధర్మములను వేదోక్తముగా పాటిస్తూ నిత్యమూ అనేక దానధర్మాలు చేసేవాడు. పురాణేతిహాసములను భక్తిశ్రద్ధలతో వినేవాడు. ఎన్నో బావులు చెఱువులు ఉద్యానవనాలు దేవతామందిరాలు కట్టించి ప్రజారంజకముగా రాజ్యపాలన చేసేవాడు.

వనాలలో ఆశ్రమములను నిర్మించుకొన్న మహర్షులు తమ తపశ్శక్తిలో ఆఱవభాగము రాజులకు ధారపోస్తారు. ఆ శక్తితో రాజులు ధర్మబద్ధముగా రాజ్యపాలన చేయుచుందురు. కావున లోకహితైషులైన మహర్షులను క్రూరమృగములనుండి కాపాడంటం రాజుల విధి. ఒకసారి ప్రతాపభానుడు వింధ్యాటవికి శాస్త్రప్రకారము చంపదగిన మృగములను వేటాడుటకై వెళ్ళెను. ఆ సుందరారణ్యములో ఒక పెద్ద అడవిపందిని చూసి దానివెంటబడ్డాడు రాజు. ఆ వనవరాహము ఎంత ప్రయత్నించినా తనకి చిక్కలేదు. ఎంతో దూరం పరుగెత్తి ప్రవేశించుటకే దుర్గమమైన ఘనారణ్యములోకి వెళ్ళిపోయింది ఆ వరాహము. ధీరుడైన ప్రతాపభానుడు తనప్రయత్నం మానక ఆ దట్టమైన అడివిలోకి ఏకాకిగా ప్రవేశించాడు. చివరికి ఆ వరాహం ఒక గుహలోకి దూరింది. గుహలోకి వెళ్ళుటకు వీలులేక నిరాశతో ప్రతాపభానుడు వెనుకకు మఱలాడు. కాని ఆ ఘోరారణ్యములో దారితప్పిపోయాడు.

ఆ వనములో తిరిగి తిరిగి బాగా అలసిపోయి ఒకచోట సొమ్మసిల్లి పడిపోయాడు. కొంతసేపటికి తేరుకుని నిర్మానుష్యమైన అడవిలో ఒక ఆశ్రమాన్ని కనుగొన్నాడు. ఆ ఆశ్రమము ఒక కపటసన్యాసిది. ఆ కపటవేషధారి పూర్వం ప్రతాపభానునిచే యుద్ధములో ఓడిపోయి పాఱిపోయిన శత్రురాజు. హృదయములో ప్రతాపభానునిపై ద్వేషమును నింపుకొని ఆ అడవిలో ఉంటున్నాడు. ప్రతాపభానుని చూడగానే అతనిని గుర్తుపట్టాడు. కానీ అలసిపోయి ఉన్న ప్రతాపభానుడు వాడిని గుర్తించలేదు! దాహముతో బాధపడుతున్న రాజుకు ఒక సరోవరం చూపించాడు. ప్రతాపభానుడు సరోవరములో స్నానముచేసి శుచి అయ్యి నీరు త్రాగినాడు. ప్రతాపభానుని ఆశ్రమములోపలికి ఆహ్వానించాడు ఆ కుహనాసన్యాసి. “నాయనా! నీవెవఱు? ప్రాణాలకు తెగించి ఈ ఘోరాటవిలోకి ఎందులకు వచ్చావు”? అని అడిగినాడు కపటసన్యాసి. రాజనీతి తెలిసిన ప్రతాపభానుడిలా సమాధానమిచ్చినాడు “ఓ మహాత్మా! మీ సహాయమునకు కృతజ్ఞుడను. నేను ప్రతాపభానుడనే రాజు యొక్క మంత్రిని. వేటకై వచ్చి తప్పిపోయాను. నీ దర్శభాగ్యము కలుగుట నా అదృష్టము”. “ఓ సజ్జనుడా! బాగా చీకటి పడినది. నీ రాజ్యము ఇక్కడికి డెబ్బది యోజనములున్నది. కావున నీవు ఈ రాత్రికి నా ఆశ్రమములో విశ్రాంతి తీసుకుని ఱేపు వెళ్ళు” అని చెప్పాడు ఆ కపటుడు. సన్యాసి దయాగుణాలను ఎన్నో విధాల పొగిడి ఆ రాత్రికి అక్కడే ఉండటానికి నిశ్చయించుకున్నాడు రాజు.

మాయమాటలతో రాజును తనను నమ్మేలాచేసి ఈర్షాగ్నితో కాలిపోతున్న ఆ కపటసన్యాసి నిర్మలుడైన ప్రతాపభానుడు అర్థించుటచే తన వృత్తాంతమును ఇలా చెప్పసాగాడు “సోదరా! వినుము. నేనిచట చాలా కాలముగా ఉంటున్నాను. ఇంతవఱకూ నా వద్దకు ఎవరూ రాలేదు. నా గురించి నేనెవరికీ చెప్పుకోలేదు. లోపప్రతిష్ఠ తపస్సును దగ్ధముచేసే అగ్నివంటిదికాదా! అందుకనే ప్రపంచానికి దూరముగా ఉంటున్నాను. శ్రీహరితో తప్ప నాకింకెవరితోను పనిలేదు”. వైరాగ్యబుద్ధి కలిగి శ్రీహరిభక్తుడై ఉన్నాడని తెలియగానే ప్రతాపభానునికి ఆ బకధ్యానిమీద గౌరవం పెరిగిపోయింది. ప్రతాపభానుడు పూర్తిగా తన వశుడైనాడని తెలుసుకొని “పుత్రా! నా పేరు ఏకతనుడు. సృష్టిప్రారంభములో నేను జన్మించాను. తరువాత మఱియొకదేహము దాల్చలేదు అందుకే నన్ను ఏకతనుడంటారు”. ఆశ్చర్యముగా వింటున్న ప్రతాపభానునికి అప్పుడు కపటసన్యాసి ఎన్నో ప్రాచీనగాథలు పురాణేతిహాసములు సృష్టిస్థితిలయములను గూర్చిన వింత వింత కథలెన్నో చెప్పాడు. జ్ఞానవైరాగ్యాల మీద వ్యాఖ్యానాలిచ్చాడు. ఇవన్నీ విని పరవశుడై రాజు “స్వామీ! నేను ప్రతాపభానుడను” అని చెప్పాడు. “రాజా! గురుకృపవల్ల నాకు అంతా తెలుసు. మీ తండ్రి పేరు సత్యకేతువు. నీ రాజనీతి మెచ్చుకుంటున్నాను. తెలియని వానితో పేరు చెప్పిన రాజ్యమునకే అపాయము అని తెలిసి నీవు ఇందాక నీ పేరు చెప్పలేదు. నేనెంతో ప్రసన్నుడనైనాను. నీకొక వరమిస్తాను కోరుకో” అని అన్నాడు ఆ కపటసన్యాసి.

సద్గుణ సంపన్నుడైనా ప్రతాపభానునకు ఒక తీరనికోరిక ఉండేది. దురాశ అనే హాలాహలముచే బాధింపబడుతున్న ఆ రాజు ఇలా కోరాడు “ఓ దయాసాగరా! నా శరీరము జరామరణదుఃఖ రహితమగుగాక. యుద్ధములో నన్నెవరూ జయింపకుండు కాక. భూమిపై నూఱుకల్పములు నా ఏకచ్ఛత్రాధిపత్యము నిలిచియుండుగాక”. ధర్మరుచి ప్రభావము వలన తాను చేసే కర్మ అంతా శ్రీహరికి అర్పించి “సర్వం కృష్ణార్పణమ్” అని అంటున్నా ప్రతాపభానుడు ఆ సూక్తిలోని ఆంతర్యమును అర్థంచేసుకోలేదు. పూర్వం హరణ్యకసిపుడు కోరిన వరము వెలెనున్న ఈ దురాశాభూయిష్టమైన వరమును కోరినాడు. నిజమైన సన్యాసి అయితే ఈ కోరిక విని “నాయనా! ఈ శరీరము శాశ్వతము కాదు. ఎందులకు దీనిమీద ఇంత మక్కువ? భగవద్భక్తి ఒక్కటే శాశ్వతము శ్రీహరిని శరణు వేడు” అని హితవు చెప్పేవాడు. కానీ కపటుడగుటచే ఆ సన్యాసి “తథాస్తు. నిన్ను సర్వప్రాణులనుండి కాపాడతాను. నా ప్రభావం వల్ల యముడు కూడా నీ దగ్గరకు రాలేడు. కానీ ఒక్క విప్రశాపం నుండి నేను నిన్ను రక్షించలేను” అని అన్నాడు. “గురూత్తమా! విప్రులను ప్రసన్నము చేసుకునే ఉపాయము దయతో నాకు సెలవీయ్యండి” అని ప్రార్థించాడు రాజు. “సరే. కానీ నీవీ విషయము చాలా రహస్యముగా ఉంచాలి. నన్ను కలుసుకున్నట్టు ఎవరితో నైనా చెపితే నీకు బహుదుఃఖములు కలుగుతాయి. నీ మంచి కోరే చెపుతున్నాను. మూడోకంటికి ఈ విషయము తెలిసిందా నీవు నశిస్తావు” అని అన్నాడు సన్యాసి.

“గురువర్య! త్రిమూర్తులు కోపగించినా గురు రక్షిస్తాడు కానీ గురువే కోపిస్తే రక్షించేవాడుండడు. మీ ఆజ్ఞ అతిక్రమించను. ఆజ్ఞ ఇవ్వండి. శిరసావహిస్తాను” అని అన్నాడు ప్రతాపభానుడు. ఆహా! ఆశ ఎంత దారుణమైనది! ఇన్ని ఏండ్లుగా విద్యాబుద్ధులు నేర్పించి సంస్కారాన్ని ప్రసాదించిన తన నిజగురువును ఒక్క నిమిషములో వదిలేసి కపటసన్యాసి గురించి ఏమీ తెలియకుండానే వాడిని నమ్మి “గురూత్తమా!” అని సంబోధించేలా చేసింది. అప్పుడు ఆ బకధ్యాని “విప్రులను స్వాధీనపఱచుటకు అనేక మార్గములు కలవు. నీకు అన్నిటికన్నా సులభమార్గము చెప్పెదను. ఒక సంవత్సరముపాటూ ప్రతిరోజు లక్షమంది ఉత్తములైన విప్రులను కుటుంబసహితముగా అహ్వానించు. నేను నా తపశ్శక్తిచే మీ పురోహితుని వేషముదాల్చి వారికి వండిపెట్టెదను. ఇప్పుడు నీవు విశ్రాంతి తీసుకో. నా తపశ్శక్తిచే నిన్ను నీ అంతఃపురములో చేరుస్తాను. సరిగ్గా మూడు రోజుల తరువాత నీ పురోహితుని రూపములో నీకు దర్శనమిస్తాను. అన్ని ఏర్పాట్లు చేసివుంచు” అని అన్నాడు. రాజు ఎంతో సంతోషించి బాగా అలసిపోయినందు వలన గాఢనిద్రపోయాడు.

ఇంతలో కపటసన్యాసి స్నేహితుడైన కాలకేతు రాక్షసుడు వచ్చాడు. వాడే వరాహవేషము దాల్చి ప్రతాపభానుని దారిమఱల్చినాడు. స్త్రీలను సజ్జనులను దేవతలను హింసిస్తున్న కాలకేతు నూర్గురుకుమారులను పదిమంది సోదరులను యుద్ధములో చంపి దుష్టసంహారం చేశాడు ప్రతాపభానుడు. దీనిని గుర్తుపెట్టుకుని అతనిపై ద్వేషం పెంచుకున్నాడు కాలకేతువు. కపటసన్యాసి కాలకేతువు కలిసి నాటకమాడి ప్రతాపభానుని నాశనం చేయదలచారు! కాలకేయుడు తన మాయతో ప్రతాపభానుని అంతఃపురంలో చేర్చి పురోహితుని ఒక గుహలో బంధించి తానే పురోహితునిగా కామరూపం ధరించాడు. తరువాతరోజు ప్రతాపభానుడు నిద్రమేల్కొని తాను అంతఃపురములో ఉన్న విషయము గ్రహించి ఆ కపటసన్యాసి శక్తిని చూసి ఆశ్చర్యపోయాడు. మూడురోజులు క్షణమొక యుగముగా గడిపినాడు. శ్రీహరి ధ్యానం వదిలి ప్రతిక్షణం ఆ కుహనాసన్యాసి పాదాలనే ధ్యానించసాగినాడు.

అనుకున్న ప్రకారం లక్షమంది ఉత్తమ విప్రులను ఆహ్వానించాడు ప్రతాపభానుడు. ఆ కుహనాపురోహితుడు తన మాయచేత లెక్కలేనన్ని వ్యంజనములు నాలుగురకాలైన వంటలను పాకశాస్త్రమును అనుసరించి షడ్రసోపేతముగా సిద్ధంచేసినాడు. కానీ వానిలో అనేకజంతువుల మాంసములేకాక బ్రాహ్మణులమాంసము కూడా కలిపి వడ్డించినాడు. భోజనార్థము విప్రులు సిద్ధమగుతుండగా కాలకేతుడు ఆకాశవాణిని సృష్టించి “ఓ విప్రోత్తములారా! ఈ భోజనము హానికరము. దీనిలో జంతువిప్ర మాంసమున్నది. దీనిని భుజింపవద్దు” అని పలికించెను. ఆకాశవాణి వినగానే ఆ లక్షమంది విప్రులు “ఓ క్షత్రియాధమా! మమ్ము సపరివారముగా భ్రష్టులను చేయ తలచితివి. నీవుకుటుంబ సహితముగా రాక్షసుడవై జన్మించు. ఒక్క సంవత్సరములో నీవు నీవంశంతో సహా నశిస్తావు. మీకు తిలోదకాలిచ్చెడివారు కూడా ఉండరు” అని ఘోరశాపాన్నిచ్చారు. తమయుక్తి సఫలమైనదని కాలకేతుడు కపటసన్యాసి సంతోషించారు. కపటసన్యాసి శత్రురాజులందఱిని కూడబెట్టుకోని ప్రతాపభానునిపై దండెత్తినాడు. వీరుడైన రాజు అరిమర్దనుడు ఎంతో కాలం వారితో యుద్ధం చేశారు. చివరికి ఒక సంవత్సరం తరువాత తన వంశముతో సహా ప్రతాపభానుడు నశించినాడు. కొలది కాలము తరువాత వారందఱూ రాక్షసులై జన్మించినారు. ప్రతాపభానుడు రావణునిగా అరిమర్దనుడు కుంభకర్ణునిగా ధర్మరుచి విభీషణునిగా జన్మించిరి. ఒకానొక కల్పములో శ్రీరామావతారమునకు ఇదియే నాంది.

పిల్లలూ! ఈ కథలోని నీతులను మరొక్కమాఱు చూద్దాము:

 1. మానవునకు ఆశ ఉండవచ్చు. కాని “అతి సర్వత్ర వర్జతే”. సమస్త భూమండలానికి ఏకచ్ఛత్రాధిపతి అయికూడా ప్రతాపభానుడు కపట సన్యాసిని అడగరాని వరంకోరి చివరికి నాశనమైనాడు.
 2. మన శాస్త్రాలలో గురువుని ఎలా వెతకాలో వివరించారు. ఎంతో అన్వేషించి ఉత్తముడైన వానిని గురువుగా స్వీకరించాలి. ప్రతాపభానుడు తన దురాశ వలన ఒక్క రాత్రి పరిచయంతోనే కపటుని గురువుగా స్వీకరించాడు.
 3. బహిశ్శత్రువులైనా అంతశ్శత్రువులైనా (కామ క్రోధాదులు) హాని చేయకమానవు. కావున ఎల్లప్పుడూ అప్రమత్తులమై ఉండాలి. ప్రతాపభానుడు శత్రువులైన కాలకేతు కపటసన్యాసులను గమనించక వారిచేత మోసగించబడినాడు.

Search Terms: Pratapabhanu, Prataapabhaanu, Ravana.


సత్యసంధః

నవంబర్ 14, 2006

(satysandhah.pdf)

శ్రీమద్రామాయణం లోని కథ

మునివేష ధారులైన శ్రీరామ సీతా లక్ష్మణులు శరభంగముని ఆశ్రమము చేరిరి. శ్రీ రాముని కమనీయ దివ్యమంగళ స్వరూపమును చూచుచూ శరభంగుడు శరీర త్యాగము చేసి విష్ణుపదమును చేరెను. అనంతరము దండకారణ్యములో నివసించు మునీశ్వరులందరూ శ్రీ రామ చంద్రుని దర్శనార్థం శరభంగ ముని ఆశ్రమమునకు వచ్చినారు.

ఆ మునీంద్రులను చూచి మాయామానుష రూపుడైన శ్రీ రాముడు సీతా లక్ష్మణ సమేతంగా వారందఱికి సాష్టాంగ ప్రణామములు చేసెను. ఆ మునులు సర్వజ్ఞుడైన శ్రీ రామస్వామిని స్తుతించి సమస్త ముని ఆశ్రములు చూచి వారిని అనుగ్రహించమని కోరిరి. మునీంద్రుల వెంట సీతారామలక్ష్మణులు తపోవనములను చూచుటకు బయలుదేరిరి. ఆ ప్రదేశములలో చాలా చోట్ల పుఱ్ఱెలు ఎముకల గుట్టలు కానవచ్చెను. “పవిత్రమైన ఈ తపోభూములలో ఈ అస్థికలు ఎలా వచ్చాయి”? అని ప్రశ్నించాడు స్వామి. వారు “సర్వేశ్వరా! సమాధిస్థితిలో ఉన్న మునీశ్వరులను దుష్టులైన రాక్షసులు తనివేయగా మిగిలిన ఎముకలివి” అని తమ దైన్యతు వ్యక్తపఱచినారు. కళ్ళుచెమ్మగిల్లిన స్వామి “ఈ దండకారణ్యమును రాక్షసులనుండి విముక్తము చేసెదను” అని ప్రతిజ్ఞ చేసెను. పరమానందముతో మునులు ధర్మస్థాపకుడైన శ్రీ రామునికి జయ జయ ధ్వానాలు చేసినారు.

సీతారామలక్ష్మణులు అగస్త్యమునిని సేవించి సుతీక్షుని వద్ద సెలవు తీసుకుని పంచవటికి వస్తుండగా పరమ సాధ్వీమణి లోకమాత జానకీ ఈ విధముగా భర్తతో మధుర సంభాషణము చేసినది “ప్రాణనాథా! ధర్మవర్తనము అతి సూక్షమైన పద్ధతిని అవలంభించవలెను. ఎవడైతే ప్రలోభాలకు వ్యసనాలకూ దూరముగా ఉంటాడో వాడే సర్వదా ధర్మపరుడై ఉండగలడు. మనము ప్రస్తుతము మునివేషములలో ఉన్నాము. తపము ఆచరించుట మన కర్తవ్యం. తపస్సునకు శాంతి పునాది. అయిననూ మనము ధనుర్బాణములు ఏల ధరించి రాక్షసులను సంహరించుచున్నాము?”. రాక్షసులతో ప్రత్యక్షముగా వైరము లేకుండానే మునులను రక్షించుట అనే “వ్యసనంతో” రాక్షసులను సంహరించుట తనకు ఇష్టములేదన్నట్టు సూచిస్తూ ఆ పతివ్రతాశిరోమణి శ్రీ రామునకు ఈ నీతికథ చెప్పినది

“పూర్వం ఒక మునివల్లభుడు ప్రశాంతమైన ఓ ఆశ్రమములో తపమాచరిస్తూ ఉండేవాడు. అతడు సత్యవాది. ఆయన సత్యప్రభావముచే జంతువులు కూడా సహజ వైషమ్యాలను మఱచి హాయిగా సహజీవనం చేసేవి. అలా ఉండగా దేవేంద్రుడు అతని పరీక్షించుటకై భటుని వేషంలో వచ్చి “స్వామీ! ఈ కత్తిని మీ వద్ద భద్రంగా ఉంచండి. మళ్ళీ వచ్చి నేను తీసుకుంటాను” అని అన్నాడు. ఎంతో కాలము ఆ ఆయుధం సమీపంలో ఉన్న కారణముగా ఆ మునిలో క్రూర లక్షణాలు బైటపడ్డాయి! ఆయుధం దగ్గర ఉండుటచే ఆ ముని తన కర్తవ్యాన్ని విస్మరించి హింసమీద అభిరుచి కలిగినవాడై క్రూర కృత్యాలుచేసి చివరికి ఘోర నరకమును పొందినాడు. తపస్సు చేసే మనమెక్కడ? దుష్టసంహారం చేసే క్షత్రియ ధర్మమెక్కడ? స్వామీ! చపల బుద్ధితో నాకు తెలిసినది చెప్పాను. నీవు సత్యసంధుడవు. ఏది సత్యమో ఏది అసత్యమో నీవే నిర్ణయించు” అని అనిన జానకితో శ్రీ రాముడిలా ఉన్నాడు

“దండకారణ్యము లోని మునులు నిరాడంబరముగా తపస్సు చేయుచుండగా మాంసభక్షకులైన రాక్షసులు వారిని భక్షిస్తున్నారు. ఈ మునీశ్వరులు ఆ మదాంధులకు శాపం ఇచ్చుటకు సమర్థులై కూడా శాపం ఇవ్వలేదు. వారిని చంపినా కూడా కోపము తెచ్చుకోకుండా పరమశాంత చిత్తంతో తపమాచరిస్తున్నారు. దీనులై నన్ను ఆశ్రయించినప్పుడు రాక్షస సంహారము చేసెదనని ప్రతిజ్ఞ చేసినాను. అసలు ఆ యోగులు అడిగేవరకూ నేను ఆగనక్కరలేదు. ఎందుకంటే నా తండ్రిగారు భరతునకు నగర రాజ్యము నాకు వనరాజ్యము ప్రసాదిస్తున్నానని స్పష్టముగా చెప్పిరి. కావున తపముచేసినా దుష్టులను శిక్షించటం ఆర్తులను రక్షించటం వనరాజుగా నా కర్తవ్యం.

సీతా! నేను నా ప్రాణాలనైనా వదులుతా. నా ప్రియభ్రాత అయిన లక్షణునైనా విడనాడుతాను. చివరకు నా హృదయేశ్వరివైన నిన్నైనా వదులుతాను కానీ సత్యమును మాత్రమూ ఎన్నడునూ వీడజాలను! అందునా ఇట్టి తాపసులకు ఇచ్చిన ప్రతిజ్ఞ ఎప్పటికీ విడువలేను”. ఇలా అద్భుతంగా సంభాషణము చేసి సుందరములైన వనభూముల వైపు నడువసాగారు. ఇట్టి సత్యసంధుడైన శ్రీ రాముని పాద స్పర్శ పొందిన ఈ భారతభూమి ధన్యం. భారతీయులు ధన్యులు.

పిల్లలూ! మనం ఈ కథలోని నీతులను మరొక్కమాఱు చూద్దామ్:

 1. వ్యాస భగవానుడు చెప్పినట్టు సత్యం ఈ 13 విధాలైనది: నిష్పక్షపాతం ఆత్మనిగ్రహం అణకువ సిగ్గు ఓరిమి తాలిమి సంయమం దయ అహింస అనసూయత త్యాగం చింతన శీలసంపద. ఇన్ని విషయాలను సమగ్రంగా ఆలోచించి వీటిని అనుసంధానము చేసుకుని ఎల్లవేళలా సత్యమే ఆచరించినాడు శ్రీ రాముడు. ధర్మసమ్మతమైన ప్రతిజ్ఞ చేసి ఆ ప్రతిజ్ఞను కాపాడటానికి ఏమైనా వదులుతాను కానీ సత్యాన్ని మాత్రము విడువనని అన్నాడు.
 2. మంచైనా చెడైనా చాలాకాలం సహవాసం చేస్తే ఆ గుణాలకు దెగ్గరవుతాయనే నీతికథను మనకు సీతమ్మ చెప్పినది. అందుకే మనపెద్దలు సత్సంగత్యమే చేయమని అంటారు.

Search Terms: Rama, Raama, Sita, Seetha, Lakshmana, Sutikshna, Sutiikshna, Panchavati, Sharabanga, Agastya


ధర్మజ్ఞః

నవంబర్ 3, 2006

(dharmagnyah.pdf)

శ్రీమద్రామాయణం లోని కథ

“శరణు శరణు సురేంద్రసన్నుత శరణు శ్రీసతి వల్లభా!” అంటూ భక్తశిఖామణియైన విభీషణుడు రావణునిచే తరస్కరింపబడ్డవాడై శ్రీ రామ చంద్రుని శరణువేడినాడు. విభీషణుడు తన మంత్రులతో వచ్చి ఆకాశమార్గాన నిలిచి శ్రీ రాముని శరణు కోరుచున్నాడని వానరులు వచ్చి విన్నవించారు. ఆ వార్త విని వినయకోవిదుడైన రఘురాముడు సుగ్రీవుని “మిత్రమా! నీ అభిప్రాయమేమి”? అని అడిగినాడు. రాజశ్రేష్ఠుడైన సుగ్రీవుడిలా అన్నాడు “ప్రభూ! రాక్షసులు మాయావులు కామరూపధారులు. వారి నిజస్వరూపం గుర్తించడం కష్టమ్. పైగా వచ్చినది సీతాపహారి ఐన రావణుని తమ్ముడు. ఈతడు బలశాలి. సాయుధులైన నలుగురు మంత్రులతో వచ్చాడు. మన రహస్యములు తెలుసుకొనుట వారి ఆంతర్యం కావచ్చు. ఇందుకని వీరిని బంధించాలని నా ఉద్దేశ్యం”.

స్మితపూర్వావిభాషి ఐన శ్రీ రాముడు ఇట్లు ధర్మ్యము పల్కెను “సుగ్రీవా! తన భార్యను వలపన్ని పట్టిన బోయవాడు ఆర్తుడైవచ్చినప్పుడు ఆ కపోతరాజు బోయవానికి శరణమీయలేదా! (కపోత కపోతి కథ చూడండి) అదే అట్లు చేసిన ఇక మానవులైన మన సంగతేమిటి? పూర్వం కండువ మహర్షి ఈ కథను పల్కి ధర్మసమ్మతమైన గాధలు గానం చేశాడు:

దీనుడై ప్రార్థించుచు శ్రణుజొచ్చిన శత్రువునైనా చంపకూడదు. సజ్జనుడు తన ప్రాణాలసైతం ఇచ్చి శరణార్థి ఐన శత్రువు నైనా కాపాడతాడు”. ఇలా కండువ మహర్షి ఆలపించిన ధర్మాలు గుర్తుచేసి రఘువరుడిలా అన్నాడు “ఎవడైనా వచ్చి నేను నీవాడను అని ఒక్క మాట అన్న చాలు వానిని సకల ప్రాణులనుండి అభయమిచ్చెదను. ఇది నా వ్రతం.

అతడే స్థితిలోనున్నను ఏ ఉద్దేశ్యముతో వచ్చినను వెంటనే అతనిని ఇక్కడకు తీసుకురండి. వచ్చినవాడు రావణుడైనా సరే వానికి శరణమిస్తాను”. ఎక్కడా కనీ వినీ ఎఱుగని ధర్మజ్ఞతను శ్రీ రాముని లో చూసి వానరులు “శ్రీ రామ చంద్ర మూర్తి కీ జై” అని జయజయ ధ్వానాలు చేశారు.

vibhishanasharanagati.jpg

పిల్లలూ! ఈ కథలోని నీతిని మరొక్కమాఱు చూద్దాం:

ఒకడు లోక నిందకు భయపడి రాజధర్మం పాటించవచ్చు. అలాగే సమాజధర్మం గృహధర్మం కులధర్మం పాటించటానికి ఏదో ఒక హేతువుండచ్చు. కానీ వ్రతం (నియమం) అనేది తనకు తానుగా నియమించుకున్నది. అది పాటించకపోయినా ఎవ్వరూ అడగరు. అందుకే వ్రతధర్మం పరమోత్కృష్టమ్. ఎటువంటి హేతువూ లేకుండా కేవలం ధర్మసమ్మతమైన వ్రతనియమం పాటిస్తూ శ్రీ రాముడు విభీషణునికి శరణాగతి ఇవ్వడం ధర్మవర్తనానికి పరాకాష్ట.

ఇదే సదేశం ధర్మరాజు కూడా ఇస్తాడు: ఒక సారి పరమసాధ్వి ఐన ద్రౌపదీ దేవి రాజసూయయాగం చేసి రాజులచే జే జే లందుకున్న ధర్మరాజు కష్టాలు పడటం చూసి బాధతో ఇలా అడిగింది “స్వామీ! మీరు ధర్మంకోసం ఇన్ని త్యాగాలు చేశారు. ధర్మం పాటించడం వల్ల మీకేమి వచ్చింది”? భారతీయుని హృదయాన్ని వ్యక్తపఱస్తూ ధర్మరాజు ఇలా అన్నాడు:

“ద్రౌపదీ! ధర్మం ఆచరించడం నా స్వభావం. అంతే కాని ధర్మం ఏదో ఇస్తుందని నేను ఆచరించలేదు. అలాగే కనక నేను చేస్తే ధర్మంతో వ్యాపారం చేసిన వాడినౌతాను. ధర్మంతో వాణిజ్యం చేసినవాడు నీచుడు పురుషాధముడు”. కనుక స్వాభావికంగా ఏ ప్రతిఫలమూ ఆశించకుండా ధర్మం పాటించాలని శ్రీ రాముడు ధర్మరాజు మనకి చెప్పారు.

Search Terms: Raama, Rama, Vibhiishana, Vibhishana, Vibheeshana, Yudhishthira


వినయం వివేక లక్షణమ్

అక్టోబర్ 28, 2006

(vinayamvivekalakshanam.pdf)

శ్రీమద్రామాయణం లోని కథ

పరమాత్ముడైన శ్రీ రామ చంద్రుడు అమిత పరాక్రమశాలి మహావీరుడు ధనుర్విద్యానిపుణుడు. శ్రీ రాముడు బ్రహ్మర్షి అగు వసిష్ఠ మహర్షి వద్ద సకల శాస్త్రములు ధనుర్విద్య అభ్యసించినాడు. గాయత్రీ మంత్రద్రష్ట అగు విశ్వామిత్ర బ్రహ్మర్షి వద్ద బల అతిబలాది విద్యలు మఱియు ఎన్నెన్నో అతి రహస్యములైన అస్త్రములను నేర్చినాడు. ఈ అస్త్రములు కేవలము విశ్వామిత్రులవారికే తెలియును. ఇదియే కాక పరమపూజనీయుడగు అగస్త్య మహర్షి శ్రీ రామ చంద్రునకు దివ్య ధనువు అక్షయ తూణీరము రత్నఖచిత ఖడ్గమును ప్రసాదించెను.

 • ఒక్క బాణముతో శ్రీ రామ చంద్ర మూర్తి మహాబలశాలియైన తాటకను నేలకూల్చెను
 • ఒకేమాఱు రెండు బాణములు వదిలి సుబాహు సంహారము చేసి మారీచుని సప్తసముద్రాలకు అవతల పారవేశను
 • మహాభారవంతమైన శివచాపమును అవలీలగా ఎత్తి ఎక్కుపెట్టిన అది విరిగెను
 • శ్రీ రాముడొక్కడే ప్రహరార్ధకాలములో (90 min.) ఖర త్రిశిర దూషణాదులను వారి సేనలను సంహరించెను

ఇంత ప్రతాపవంతుడైనప్పటికీ శ్రీ రాముడు ఎప్పుడూ తనకుతానుగా బలప్రదర్శనము చేయలేదు. ఆ దయార్ద్ర హృదయుడు సర్వదా వినయవంతుడై వర్తించెను. దీనికి తార్కాణము సముద్రుని గర్వభంగ ఘట్టము.

శ్రీ రాముని సైన్యము సముద్ర లాంఘనము చేయుసమయము వచ్చెను. సర్వజ్ఞుడైన రాముడు ఉపాయము ఎఱిగియు సహజ వినయవంతుడగుటచే పరమభాగవతోత్తముడైన విభీషణుని సలహా అడిగెను. విభీషణుడు ఇట్లు పల్కెను “ఓ రఘునాయకా! మీ బాణమొక్కటే కోటి సముద్రములనైనను శుష్కింప చేయగలదు. ఐనను సముద్రునే ఉపాయమడుగ ఉత్తమమని నా యోచన”.

రావణుడు తనను వివాహమాడమని హెచ్చరించి సీతమ్మవారికి నెల రోజుల గడువు ఇచ్చెను. భరతుడు పదునాలుగేండ్లపై ఒక్క నిమిషము కూడా శ్రీ రామునికి దూరంగా ఉండజాలక శ్రీ రాముడు ఆలస్యమైన పక్షంలో శరీరత్యాగం చేసెదనని ప్రతిజ్ఞబూనెను. ఈ రెండు కారణముల వలన శ్రీ రాముని వద్ద అప్పటికి పట్టుమని ౩౦ రోజులుకూడాలేవు. ఐనను రఘురాముడు తన బలప్రదర్శనము చేయక వినయముతో సాగరుని ప్రార్థింప నిశ్చయించెను.

శ్రీ రాముడు ఉదధిని సమీపించి సముద్రునకు శిరసా ప్రణమిల్లెను. పిదప తీరమున దర్భలు పరచి ఆ దర్భాసనం పైన కూర్చుని తదేక దృష్టితో సముద్రుని ప్రార్థించెను. ఇట్లు ౩ దివసములు సముద్రునికై ప్రార్థించినను ఆ సముద్రుడు రాడాయె. చివరకు శ్రీ రాముడు “ఈతనికి సామముగా చెప్పిన వినడాయె. ఇటువంటి వారికి దండోపాయయే సరియైనది” అని సముద్రునిపై అస్త్రం సంధించెను. శ్రీ హరి కోపమును భరింపగలవారెవ్వరు? వెంటనే సముద్రుడు ప్రత్యక్షమయ్యెను. అంత దయాళువైన శ్రీ రాముడు సముద్రుని క్షమించి తాను ఎక్కుపెట్టిన అమోఘ బాణము దేనిమీద ప్రయోగింపవలెనని అడిగెను. సముద్రుడు ఉత్తరాన దుష్టులైన కాలకేయ రాక్షసులు ఉన్నారని సూచించెను. అంతట శ్రీ రాముడు ఆ అస్త్రముతో ఆ రాక్షసుల సంహారముచేసి ఆ కాలకేయులుండే పర్వతం ఔషధాలకు నిలయమై ప్రజాహితం చేకూర్చునని ఆశీర్వదించెను.

ramasamudram.jpg

పిల్లలూ! మనం ఈ కథలోని నీతులను మరొక్కమాఱు చూద్దామ్:

 1. శ్రీ రాముడు ఎంత బలశాలి ఐననూ సముద్రునిపై బలప్రదర్శనము చేయక వినయముతో ప్రార్థించెను. వినయం సజ్జనుని భూషణమ్.
 2. మనకు ఉపాయము తెలిసినను తోటివారిని గౌరవించి వారి సలహా తీసుకుని ధర్మసమ్మతమైన పని చేయుట ఉత్తమ పురుషుని లక్షణమ్. అందుకనే శ్రీ రాముడు విభీషణుని సలహా అడిగెను.
 3. దయాగుణం ఉత్తమగుణమ్. సముద్రుడు తనకు చేసిన అపకారమును మన్నించి శ్రీ రాముడు అతనిని కాచెను.
 4. సజ్జనులు అప్రయత్నంగానే లోకహితం చేస్తారు. వారు ఏది చేసినా అది లొకహితమే అవుతుంది. శ్రీ రాముడు సముద్రునిపై కినుకబూని అస్త్రం సంధించినా అది చివరకు కాలకేయులను సంహరించి లోకహితం చేసింది.

Search Terms: Rama, Raama, Ocean, Samudram, Sagaram, Saagaram, Vibhishana, Vibheeshana, Vibhiishana