నచికేతుని పితృభక్తి

(naciketa.pdf)

కఠోపనిషత్తు లోని కథ

పూర్వం వాజస్రవసుడను సత్పురుషుడుండేవాడు. గౌతమవంశజాతుడైన అతనికి గౌతముడు, ఔద్దాలకుడు మరియు ఆరుణి అను పేరులు కూడా కలవు. అతడొకసారి విశ్వజిత్ యజ్ఞము చేసినాడు. ఆ బృహత్ యజ్ఞం చేసినవారు యాగాంత్యములో తమ సర్వస్వమునూ దానము చేయవలెను! వాజస్రవసుడు కూడా తనకున్నదందా దానంచేయసాగినాడు.

భారతీయులకు పశువృక్షములు ముఖ్యమైన సంపదలు. అందునా గోసంపద అతి ముఖ్యమైనది. మణిమరకతాలకంటే హిరణ్యరజితాదులకంటే గొప్పది గోసంపద. కావున వాజస్రవుడు ఋత్విజులకు గోదానాలు చేయసాగినాడు. వాజస్రవసునకు మహాబుద్ధిశాలి గుణోన్నతుడు పితృభక్తి పరాయణుడగు నచికేతుడను పుత్రుడు కలడు. అతడు చిన్నవాడైనా సకల ధర్మశాస్త్రాలు బాగా అభ్యసించినాడు. నచికేతుని దృష్టి తన తండ్రియిచ్చే గోవుల మీద పడినది. తండ్రి దానమిచ్చే గోవులు చాలమటుకు ముసలివి పండ్లులేనివి పాలిచ్చుటకు ప్రసవించుటకు శక్తిలేనివి అని కనుగొన్నాడు. మిక్కిలి దుఃఖమును చెంది నచికేతుడిలా అనుకున్నాడు

శాస్త్రాలు ఎవడైతే నిస్సారమైన గోవులను దానంచేస్తాడో వాడికి సద్గతులుండవు అని ఘోషిస్తున్నాయి. “అయ్యో! మహనీయుడైన మా తండ్రిగారు విశ్వజిత్ వంటి విశిష్టమైన యజ్ఞము చేసియూ ఈ తామస దానము వలన పూర్ణఫలమును పొందకుండుట పాడిగాదు” అని పలువిధాల ఆవేదనపడి చివరి నిమిషములోనైనా తండ్రిగారికి హితం చేద్దామని తలచి ఇలా అన్నాడు

“తండ్రీ! ఈ యజ్ఞములో నీకున్నవన్నీ దానము చేయాలి కదా? మరి నన్ను ఎవరికిస్తావు”? అని అడిగినాడు. బాలచేష్ట అనుకుని బదులివ్వలేదు వాజస్రవసుడు. నచికేతుడు మళ్ళీ “నన్నెరికిస్తావు నాన్నా”? అని అడిగినాడు. “సహనావవతు …” మొదలైన శాంతిమంత్రాలతో ప్రతిధ్వనిస్తున్న యాగశాలలో ఉన్న వాజస్రవసుడు సహనం వహించాడు. తండ్రికి మహాపుణ్యాన్ని ఎలాగైనా కట్టబెట్టాలని దృఢనిశ్చయంతో ఉన్న నచికేతుడు మూడవమాఱు అదే ప్రశ్నవేశాడు. సహనమును కోల్పోయి వాజస్రవసుడు “నిన్ను యమునికిస్తాను” అని అన్నాడు!

“అయ్యో! కోపముతో నేనెంతమాటన్నాను? ఆహా! తన కోపమే తన శత్రువు అను సూక్తిని చిన్నప్పటినుంచి వింటూవచ్చినా ఒక్క క్షణం సహనాన్ని కోల్పోయి ఎంత తప్పుచేశాను!” అని బాధపడ్డాడు వాజస్రవసుడు. నచికేతుడు తన మదిలో “దానమిచ్చేటప్పుడు గ్రహీతకు అక్కరకు వచ్చే వస్తువును ఇవ్వాలి. నావంటి సామాన్యుడు ధర్మప్రభువైన యమునికి ఏమి అక్కరకు రాగలను? అయిననూ పితృవాక్యపాలనమే తనయుల ధర్మం” అనుకొని చింతిస్తున్న తండ్రిని చూచి “తండ్రీ! విచారించవలదు. మన పూర్వీకులందఱూ సత్యనిష్ఠాగరిష్ఠులు అన్నమాటను ఎన్నడూ జవదాటి ఎఱుగనివారు. సత్యమే ఈ చరాచర సృష్టికి ఆధారము. సత్యభ్రష్టుడైన వానికి నరకము తప్పదుకదా! తండ్రీ! నీవాడిన మాటను నేను సత్యముచేసెదను. నాకై విచారించకుము.

పైరు మొలచి పండి ఆపై ఎలా జీర్ణమవుతుందో అదేవిధముగా పాంచభౌతిక శరీరము పుట్టి పెరిగి మరల ఆ పంచభూతముల లోనే లీనమగును కదా! కావున ఈ శరీరము శాశ్వతము కాదు. సత్యమొక్కటే శాశ్వతము. సత్యమే భగవంతుడు. కనుక విచారించక యముని వద్దకు పోవుటకు ఆజ్ఞనొసంగుము”. ఇలా తన అమృతవాక్కులతో సుధావర్షమును కురిపించినాడు నచికేతుడు. ఎలాగైతే దశరథ మహారాజు మహాదుఃఖముతో దాశరథిని కానలకు పంపినాడో అలా వాజస్రవసుడు నచికేతుని యముని వద్దకు పంపినాడు.

ఆ యమపురమునకు దారి అతిదుర్గమమైనది. ఎంతో పుణ్యశీలులు కూడా సులభముగా దాటలేని వైతరణీనదిని నచికేతుడు తన సత్యసంధత్వ పితృభక్తి ప్రభావములచే సునాయాసముగా దాటి యమపురిని చేరినాడు. యమధర్మరాజు నగరములో లేరని తెలుసుకుని ద్వారమువద్ద నిరీక్షించినాడు. మూడురోజులు అన్నపానీయాదులు లేకుండా ఆ పసివాడు కాలునికై నిరీక్షించినాడు. మూడురోజులకు ధర్ముడు వచ్చినాడు. మహాతేజస్సుతో అగ్నివలె వెలిగిపోతున్న నచికేతుని చూచి

“అయ్యో! తెలియకనే నావలన ఎంత అపరాధము జరిగినది? ధర్మానికి రాజునైన నా ఇంటనే ఇంతటి అధర్మము జరిగినదే! ఇంటివారిచే తప్పు జరిగినా ఆ తప్పుకు బాధ్యుడు యజమానియే కదా! అగ్నితుల్యుడైన అతిథి ఎవరింట్లో పస్తుంటాడో వాడి ఇష్టాపూర్తులు పుత్రులు మొదలైన సంపదలు నశిస్తాయి కదా! నిప్పుని తెలిసి తాకినా తెలియక తాకినా కాలకమానదు. అటులే తెలిసిచేసినా తెలియక చేసినా తప్పుకు శిక్షను అనుభవించక తప్పదు. ఈ అధర్మకార్యానికి ఫలితము నాకు రాకమానదు. ఇప్పటికైనా ఆ అతిథికి అర్ఘ్యపాద్యాదులిచ్చి సత్కరించెదను” అని నిశ్చయించి యముడు నచికేతుని వద్దకువెళ్ళి “ఓ బ్రహ్మన్! అభ్యాగతః స్వయం విష్ణుః. కావున చిన్నవాడివైనా నీకు నమస్కరిస్తున్నాను. నా నమస్కారమును స్వీకరించు. ఇంటికి వచ్చిన అతిథి అగ్నిదేవునితో సమానుడని తెలిసికూడా నిన్ను మూడు దినములు నిరీక్షింపచేసినాను. నన్ను క్షమించు. నాకు శుభం కలిగేటట్టు ఆశీర్వదించు. మూడురోజులు నిన్ను కష్టపెట్టినందుకు ప్రాయశ్చిత్తముగా నీకు మూడు వరాలు ఇస్తాను. కోరుకో” అని అన్నాడు.

వంశదీపకుడైన నచికేతుడిలా కోరినాడు “ఓ యమధర్మరాజా! మా తండ్రిగారు ఆందోళనారహితుడు శాంతచిత్తుడు అగునట్టు ఆశీర్వదించు. నేను ఇంటికి చేరిన తరువాత ఆయన నాపై కోపమును విడుచు నట్లు ఆశీర్వదించు. నాకు అగ్నివిద్యను ఉపదేశించు” అని కోరినాడు. యముడు ఆ వరములను ప్రసాదించి మూడవ వరము కోరుకొమన్నాడు. అప్పుడు నచికేతుడు “స్వామి! ఆత్మ శాశ్వతమని కొందఱు కాదని మరికొందఱు అంటున్నారు. ఈ సందేహము తీరునట్లుగా నాకు అతిరహస్యమైన బ్రహ్మవిద్యను ఉపదేశించుము”.

ఆత్మవిద్యను యోగ్యతార్హతలున్న వానికే బోధించాలి. అనర్హునకు బోధించిన ఆతనికి సమాజమునకు హానికరం అని ఎఱిగిన యమధర్మరాజు నచికేతుడు జ్ఞానోపదేశానికి అర్హుడోకాదో అని పరీక్షచేసినాడు. “ఈ విద్యనేర్చుకొనుట చాలా కష్టము. ఇంకేదైనా కోరుకో. ఉత్తమ సంతానం, ఏనుగులు, గుఱ్ఱాలు, ఆవులు సిరిసంపదలు ఇంకా మానవులకు దుర్లభమైన భోగభాగ్యాలనేవైనా కోరుకో తీరుస్తాను. ఈ భూమండలాన్నంతా కోరినా ఇస్తాను. దీర్ఘాయువు అమరత్వము కోరుకొనుము ప్రసాదించెదను. కానీ ఆత్మవిద్యను కోరవద్దు” అని ప్రలోభ పెట్టినాడు కాలుడు. ధీరుడైన నచికేతుడు ఐహికార్థాలను తృణప్రాయముగా ఎంచి ఆత్మవిద్య నేర్చుటకు ఉత్సుకతను చూపించినాడు. నచికేతుని పట్టుదల చూచి సంతోషించి ప్రలోభాలకు లొంగని అతడు అర్హుడని నిశ్చియించి ఆత్మవిద్యను నేర్పినాడు.

పిల్లలూ! ఈ కథలోని నీతులను మరొక్కమాఱు చూద్దాము:

 1. దానమిచ్చే సమయములో మనవద్దనున్నవానిలో మంచివి గ్రహీతకు ఉపకరించేవి ఇవ్వాలని నచికేతుడు మనకు బోధించినాడు. ఇదే ఉత్తమ దానము యొక్క లక్షణము.
 2. పితృవాక్యపాలనము తనయుల ప్రథమ కర్తవ్యము. అంతేకాక తండ్రి అడుగకుండానే తండ్రికి హితవు (ప్రియము కాదు) చేయాలని తపించేవాడు ఉత్తమ పుత్రుడు. శ్రీరాముడు, భీష్మపితామహుడు, నచికేతుడు ఈ త్రోవకు చెందినవారు. నచికేతుడు తండ్రికి పూర్ణదాన ఫలం ఇప్పిద్దామని దృఢసంకల్పము చేసినాడు. తండ్రి అన్నమాటను సత్యంచేయుటకు తన ప్రాణాలనే తృణప్రాయముగా ఎంచి యమపురికి బయలుదేరినాడు. ఇట్టి పితృభక్తి పరాయణులు మనకు ఆదర్శప్రాయులు.
 3. కోపము ఒక్క నిమిషములో మనచేత ఎంత తప్పునైనా చేయిస్తుంది. వాజస్రవసుడు సహనం వహించక “యమునికిస్తాను” అని తరువాత పశ్చాత్తాపపడినాడు. కాబట్టి మనము ఎల్లప్పుడు శాంతచిత్తముతో ఉండాలి.
 4. “అభ్యాగతః స్వయం విష్ణుః” అన్న సూక్తిని మనకు చూపించినాడు యమధర్మరాజు. అతిథిని నిరీక్షింపచేయవలసి వచ్చినదే అని ఎంతో బాధపడ్డాడు. దిక్పాలకుడు అయికూడా “నన్ను క్షమించు” అని ఒక పసిబాలునితో అన్నాడు!
 5. ఎన్నో విషయాలు తెలిసినా నచికేతుడు “నావంటి సామాన్యుడు యమునికేమి అక్కర”? అని అనుకొని తన వినయవైభవాన్ని మనకు చూపినాడు.

Search Terms: Nachiketa, Yama, Vasusravasa

ప్రకటనలు

2 Responses to నచికేతుని పితృభక్తి

 1. radhika అంటున్నారు:

  ఇంతకి ఆ బాలుడు ముసలి గోవుల గురించి తండ్రికి ఎలా [ఎక్కడ]చెప్పాడు.కధలో నాకు ఆ విషయం కనిపించలేదు.కాని కధ మొత్తం లో చాలా నీతి వుంది.
  Reply by Moralstories:

  nacikEtuDu sahaja vinayavaMtuDu. kAbaTTi taMDriki nItulu ceppAlani anukOlEdu. kAnI taMDriki dAnaphalaM rAvAlani uMdi. kAvuna taMDritO tananu evarikainA dAnamu cEsi tatphalitAnni poMdamani kathalO ceppina mATalalO ceppADu.

  నచికేతుడు సహజ వినయవంతుడు. కాబట్టి తండ్రికి నీతులు చెప్పాలని అనుకోలేదు. కానీ తండ్రికి దానఫలం రావాలని ఉంది. కావున తండ్రీతో తనను ఎవరికైనా దానము చేసి తత్ఫలితాన్ని పొందమని కథలో చెప్పిన మాటలలో చెప్పాడు.

 2. Lourdu Reddy అంటున్నారు:

  Yamadharmaraju sachikethuniki brahma vidhya bodhinchadani
  Cheppabadindi Mari aa brahmavidya emiti telupagalaru

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: