అన్నమాటకి కట్టుబడిన అర్జునుడు

(annamatakikattubadinaarjunudu.pdf)

మహాభారతము లోని కథ

పరమేశ్వరుని వరప్రభావముతో సక్షాత్ విష్ణుస్వరూపుడైన వ్యాసుని శాసనముపై ధర్మబద్ధముగా జరిగింది ద్రౌపదీ పాండవుల కళ్యాణము. దేవశిల్పి అయిన విశ్వకర్మచే నిర్మించబడిన ఇంద్రప్రస్థములో ఉన్న ద్రౌపదీ పాండవుల వద్దకు నారదుడు వచ్చి సంసారజీవములో వారుపాటించ వలసిన నీతినియమాలను వివరించాడు. అన్ని విషయాలు వివరిస్తూ ఇలా అన్నాడు “ఓ పాండవులారా! విమలబుద్ధితో వినండి. ద్రౌపదీదేవి మీ ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కయేడాది క్రమముగా ఉంటుంది. ఆ కమలాక్షి ఉన్న ఇంటి యజమానికి తెలియకుండా మీరెవరైనా ఆ అంతఃపురానికి వెళితే ప్రాయశ్చిత్తముగా ఒక ఏడాది కఠిన వ్రతనియమాలు పాటించి తీర్థయాత్రలు చేయాలి”. పాండవులందఱూ నారదుని చెప్పిన ఆ సమయనియమాన్ని శిరసావహిద్దామని నిశ్చయించుకున్నారు.

ఇట్లా ఉండగా ఒక రోజు ఒక బ్రాహ్మణుడు దొంగలచేత తన హోమధేనువును పోగొట్టుకున్నవాడై తనను రక్షించమని ఆక్రోశించాడు. ఆ విప్రుని ఆర్తనాదం విన్న అర్జునుడు దుఃఖమునకు కారణమడిగి ఏమి జరిగినదో తెలుసుకున్నాడు. అర్జునుడి ధనుస్సు ధర్మరాజు ఆయుధశాలలో ఉన్నది. అప్పుడు ద్రౌపదీదేవి ధర్మరాజు అంతఃపురములో ఉన్నది. ఆ కారణముగా ఆయుధశాలకి ప్రవేశించిన నారదుడు వారికి విధించిన నియమముభంగము అవుతుందని తెలిసినా ప్రాయశ్చిత్త క్లేశమునకు జంకక ఆ వీరాధివీరుడైన అర్జునుడు ఆర్తరక్షణకై ఆయుధాలయం ప్రవేశించి తన ధనువు తీసుకుని ఆ దొంగలను వెంబడించాడు. దుష్టులు వీరులు అయిన ఆ దొంగలను శిక్షించి విప్రుని హోమధేనువు అతనికి తిరిగి ఇచ్చివేశాడు.

తరువాత సత్యవంతుడైన అర్జునుడు ధర్మరాజు వద్దకువెళ్ళి జరిగినది చెప్పి తనకు తీర్థయాత్రలు చేసి ప్రాయశ్చిత్తము చేసుకునే అవకాశం ఇవ్వమని కోరినాడు. అంతట ఆ ధర్మనందనుడిలా అన్నాడు “సోదరా! క్రూరకర్ములై ఆ విప్రుని హోమధేనువును అపహరించిన ఆ దొంగలను శిక్షించి నీవు ధర్మమే చేశావు. ఇట్టి దుష్టులను ఉపేక్షించిన మహాపాపము. అందుకని సమయభంగమైనది నీవు విచారపడనక్కరలేదు. ధర్మరక్షణకై చేశావు కనక నీవు ఎందుకు తీర్థయాత్రలకు వెళ్ళటం”?

అప్పుడు శ్రీకృష్ణ ప్రియసఖుడైన అర్జునుడిలా అన్నాడు “అన్నయ్యా! ప్రజారక్షణ అనే వ్యాజముతో (వంకతో) నేను ఆడిన మాట తప్పుట మంచిదికాదు కదా! నా పాపము తీరే విధముగా తీర్థయాత్రలు చేసేందుకు నాకు అనుజ్ఞ ఇవ్వండి”. తమ్ముని సత్యవాక్ పరిపాలనకు సంతోషించి అతనికి దూరముగా ఉండట ఇష్టములేక పోయినా తీర్థయాత్రలకు పంపించాడు. తరువాత ఆచార్యుల పెద్దల అనుమతి తీసుకుని అర్జునుడు రాజభోగాలన్నీ తృణప్రాయంగా ఎంచి వేదవేదాంగ విదులైన పండితులను సహాయముగా తీసుకుని సకల తీర్థాలూ సేవించి పావనుడైనాడు.

పిల్లలూ! ఈ కథలోని నీతిని మరొక్కమాఱు చూద్దామ్:

కఠినమైన వ్రతనియమాలతో ఉండి రాజ భోగాలు విడిచి తీర్థయాత్రలు చేయాలని తెలిసినా అర్జునుడు తన కర్తవ్య పాలన చేయడానికి వెనకాడకుండా ఆయుధాలయానికి వెళ్ళి ధనువు తెచ్చి దుష్టశిక్షణ చేశాడు. తనంతట తాను వేళ్ళి తన తప్పుకు ప్రాయశ్చిత్తము చేసుకునే అవకాశమీయ మని ధర్మరాజును ప్రార్థించి తన సత్యవాక్ పరిపాలనా దీక్షను మనకు చూపించాడు.

Search Terms: Arjuna, Narada, Yudhishthira, Pandava, Draupadi

2 Responses to అన్నమాటకి కట్టుబడిన అర్జునుడు

 1. రానారె అంటున్నారు:

  ఓ పాండవులారా! విమలబుద్ధితో వినండి. — ఈ వాక్యం ఒక్కటి చాలు నారదుడు ఎంత ప్రశాంతవదనంతో పాండవుల శ్రేయస్సు అభిలషించి ఈ విషయాన్ని చెప్పదలచుకొన్నాడో, బుద్ధిమంతులైన పాండవులెంత శ్రధ్ధగా వినివుంటారో వూహించటానికి.
  విషయం తెలిసిన అనుభవజ్ఞులైన పెద్దలు చెప్పే మాటలను పిన్నలెలా వినాలో తెలియజేసే గొప్ప వాక్యమది. మంచి కథనం.

  చిన్నప్పుడు మనకు కథలు చెప్పే అవ్వలు, తాతలు వుండేవాళ్లు.
  మనల్ని మైమరపించి కథలో లీనమయేలా చేయగల నిపుణులు వాళ్లు.
  ఆ కథల ప్రభావం మనల్ని మంచి వ్యక్తులుగా ఉండిపోయేలా చేస్తుంది.
  ఆ సంస్కారాన్ని మనలో నిలబెట్టుకుని మనం కూడా ఆ అవ్వలు తాతల నైపుణ్యాన్ని సంపాదించాలి.
  మన పిల్లలు సంస్కారవంతులు కావాలంటే మనం చెప్పే కథలను పిల్లలు ఆసక్తిగా వినాలి.
  కథ చేప్పే నైపుణ్యాన్ని పక్కన పెడితే, చెప్పడానికి కథలే తెలియని తరం మనదిప్పుడు.
  ఇక, పుస్తకం అనేది మూతపడిపోయి ఇంటింటా ఇపుడీ ఇంటర్నెట్ తెరచుకొంటోంది.
  ఈ నేపధ్యంలో మీరు ఈ బ్లాగు ద్వారా చేస్తున్నది సంఘసేవ అంటాన్నేను.
  ఇందుకు మూలకారణమైన మీ మాతృ భ్రాత్ర మిత్ర బృందానికి ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: