ద్రౌపదీదేవి – ఆదర్శ భారతనారి

(draupadi.pdf)

శ్రీమద్భాగవతం లోని కథ

మహాభారత యుద్ధములో సర్వనాశనమైన కౌరవపతి దుర్యోధనుని సంతృప్తి పఱచుటకై అశ్వత్థామ తన స్వభావానికి భిన్నముగా ప్రవర్తించి అతి కిరాతకముగా ఉపపాండవులను (పాండవుల పుత్రులు) నిద్రిస్తుండగా వధించినాడు. ఆ ఘోరకృత్యం తెలుసుకున్న పాండవులు ద్రౌపదీదేవి దుఃఖానికి అంతులేదు. పసిపాపలైన బాలకులను నెత్తుటి మడుగులో చూసిన వారి గుండెలు పగిలినాయి. తన పుత్రులందఱినీ పోగొట్టుకుని విలపిస్తున్న ద్రౌపదీదేవిని ఓదార్చాడు అర్జునుడు. “ఇంత దారుణమైన పనిచేసిన ఆ అశ్వత్థామను నీ వద్దకు లాక్కువస్తాను” అంటూ పాఱిపోతున్న ఆ ద్రౌణి నెలకాల బడ్డాడు అర్జునుడు. శ్రీకృష్ణార్జునుల రథము తనను త్వరిత గతిలో సమీపిస్తున్నదని తెలిసిన అశ్వత్థామ ప్రాణరక్షణకై బ్రహ్మాస్త్ర ప్రయోగం తప్ప అన్యమేదీ తనను కాపాడజాలదు అనుకుని రథమాపి శుచి అయ్యి ఆచమించి మంత్ర ప్రయోగము చేశాడు. ప్రళయకాల రుద్రునిలా సమీపించే ఆ బ్రహ్మాస్త్రాన్ని చూసి శ్రీ కృష్ణుడు ప్రతి బ్రహ్మాస్త్ర ప్రయోగం చేయమని ఆజ్ఞాపించాడు.

అర్జునుడు కూడా శుచి అయ్యి ఆచమించి పరమాత్మకు ప్రదక్షిణము చేసి బ్రహ్మాస్త్ర ప్రయోగం చేశాడు. ఆ ఱెండు అస్త్రాలు సూర్యాగ్నుల వలె ప్రజ్వరిల్లాయి. వాటి ప్రభావము చతుర్దశ భువనాలను దహింపగలదని తెలిసిన శ్రీ కృష్ణుడు ఆ అస్త్రాలను ఉపసంహరించమనినాడు. అస్ఖలిత బ్రహ్మచారి అయిన శ్రీకృష్ణుని ప్రియమిత్రుడైన అర్జునుడు శాస్త్రకోవిదుడు. అందుకే గృహస్థుడైనా కూడా బ్రహ్మచర్యమును పాలించుటచే ఆ ఱెండు బ్రహ్మాస్త్రాలనూ ఉపసంహరించ గలిగినాడు. అలా లోకాలను తన బ్రహ్మచర్య శక్తితో కాపాడిన అర్జునుడు ఆ అశ్వత్థామను బంధించి ద్రౌపదీదేవి ముందుకు తెచ్చి పడేశాడు. చిన్న పిల్లల ప్రాణాలు తీసిన ఆ అశ్వత్థామ ద్రౌపదిముందు సిగ్గుతో తల ఎత్తలేకపోయాడు. పరాన్ముఖుడైన గురుపుత్రునికి నమస్కరించి సుగుణవతియైన ద్రౌపదీదేవి ఇలా ధర్మ్యభాషణం చేసింది

“నాయనా! మీ తండ్రిగారైన ద్రోణాచార్యుల వారి వద్ద మా మగవారు విద్యాభ్యాసం చేశారు. పుత్రరూపములో ఉన్న ద్రోణుడవు నీవు. మాకు గురుతుల్యుడవైన నీవు ఇలా నీ శిష్యనందనులను దారుణముగా వధించడం ధర్మమా? తమకి హాని కలిగించినా ఎదుఱుకోలేని పసివాళ్ళను నీకెన్నడూ అపకారము చేయని అందాలు చిందే పాపలను నిదురించి ఉండగా చంపటానికి నీకు చేతులెలా వచ్చాయి? ఓ గురుపుత్రా! ఇక్కడ నేను నా పుత్రులకై ఏడుస్తున్నట్లే అక్కడ నీ తల్లి కృపి నీకోసం ఎంతగా విలపిస్తున్నదో. అర్జునుడు బంధించి తీసుకు పోయాడన్న వార్త వినగానే ఎంత పరితాపమును చెందినదో”. ఇలా అని శ్రీకృష్ణార్జునుల వైపు చూసి

“ద్రోణాచార్యులవారు స్వర్గస్థులైనా ఇతని మీదే ఆశలుపెట్టుకుని జీవిస్తున్నది ఆ సాధ్వి కృపి. నాలాగే పిల్లవాడి కోసం ఎంతో బాధపడుతూ ఉంటుంది. గురుపుత్రుడైన ఈ అశ్వత్థామను వదిలి వేయండి! గురుపుత్రుని వధించుట ధర్మము కాదు” అని అన్నది పరమ పతివ్రత అయిన ద్రౌపదీదేవి.

ఈ ప్రకారం ద్రౌపదీదేవి ధర్మసమ్మతంగా దాక్షిణ్యసహితంగా నిష్కపటంగా నిష్పక్షపాతంగా న్యాయంగా ప్రశంసనీయముగా పిలికినది. పాంచాలి మాటలు విని ధర్మనందనుడు ఎంతో సంతోషించాడు. భగవంతుడైన శ్రీ కృష్ణుడు ఆమెను ఎంతగానో పొగిడినాడు. అక్కడ ఉన్న అందఱూ ఆమె మాటలను సమర్థించారు. కానీ భీమసేనుడు “కన్న కొడుకులను క్రూరముగా చంపినవాడు కళ్ళముందున్నా కోపం తెచ్చుకోకుండా విడవ మంటుందేమిటి? స్వాభావికముగా దయ ఉన్నవాడే బ్రాహ్మణుడు కానీ ఇలా ఘోరకృత్యం చేశిన ఈ అశ్వత్థామ క్షమార్హుడు కాదు” అంటూ ఆ అశ్వత్థామ పైకి దూకాడు.

తొందరలో ఏమి చేస్తాడో అని ఆ గురుపుత్రునికి అడ్డంగా నిలబడినది ద్రౌపదీదేవి!! శ్రీ కృష్ణుడు చతుర్భుజుడై ఱెండు చేతులతో భీమసేనుడిని మిగిలిన ఱెంటితో ద్రౌపదిని వారించి ఇలా ధర్మబోధ చేశాడు “శిశుఘాతకుడూ కిరాతకుడూ అయిన ఈ అశ్వత్థామ ముమ్మాటికీ చంపదగిన వాడే. కానీ గురుపుత్రుడు పైగా విప్రుడు అయినందువల్ల వీనిని చంపకుండా శిక్షించాలి. ఒక వీరునికి తలగొఱగటం కన్నా అవమానకరమైనది ఏదీ లేదు. ఈతని శిరోజాలు ఖండిచి అవమానించి పంపుదాం”. అప్పుడు విశ్వమంతా కొనియాడ తగ్గవాడూ వీరాధివీరుడూ అయిన అర్జునుడు ఆ అశ్వత్థామ శిరోజాలు ఖండించి అతని శిరస్సుమీదనున్న దివ్య (జ్ఞాన) మణిని తీసుకుని అవమానించి బయటికి గెంటివేశాడు. అనంతరం చనిపోయిన బంధువులందఱికీ దహన సంస్కారాలు చేశి గంగాతీరములో పొంగిపొఱలే దుఃఖాన్ని దిగమ్రింగుకుని మరణించిన వారికి తిలోదకాలిచ్చారు పాండవులు. తరువాత శ్రీ కృష్ణుడు పాండవులని గాంధారీ ధృతరాష్ట్రులని ఓదార్చినాడు. ఇలా శ్రీ కృష్ణుడు మహాభారత యుద్ధం ద్వారా దుష్టశిక్షణ చేశి భూభారాన్ని దించాడు.

aswatthama.jpg

పిల్లలూ! ఈ కథలోని నీతిని మరొక్కమాఱు చూద్దామ్:

పుత్రహంతకుడు కళ్ళ ఎదుటికి రాగానే “గురుపుత్ర! నమస్కారం” అని అనగలిగిన ద్రౌపదీదేవి మనస్సు యొక్క సౌందర్యం వర్ణణాతీతం. అంత దుఃఖములో ఉండికూడా ఏది ధర్మం ఏది అధర్మం అని ఆలోచించి మాట్లాడిన ఆమె ధర్మవర్తనం మనకు ఆదర్శప్రాయం. “నా వలె ఆ కృపి పుత్రుని కోసం ఎంతగా ఏడుస్తుందో” అని దయ జాలి కరుణ క్షమ అనే పదాలకు సీమాంతం చూపి మహాపకారికైనా మహోపకారం చేయగల ద్రౌపదీదేవి వంటి ఆదర్శ నారీమణులు పుట్టిన మన భారతదేశం మహోన్నతమైనది.

Search Terms: Draupadi, Pandava, Arjuna, Krishna

5 Responses to ద్రౌపదీదేవి – ఆదర్శ భారతనారి

 1. radhika అంటున్నారు:

  upa paamdavulanu champabaddaarani telusu gani taruvata imta kadha jarigindani teleedu.thanks.

 2. yrnr అంటున్నారు:

  నీతిని గుర్తుండిపోయేలా చెప్పడం అనే గొప్పకళ మీలోవుంది. చాలా చాలా బాగా చెబుతున్నారు.

 3. yrnr అంటున్నారు:

  Great blog. Manamu mana pillalu kramam tappaka chadava valasina blog.

 4. రానారె అంటున్నారు:

  అస్ఖలిత బ్రహ్మచారి అయిన శ్రీకృష్ణుని ప్రియమిత్రుడైన అర్జునుడు శాస్త్రకోవిదుడు. అందుకే గృహస్థుడైనా కూడా బ్రహ్మచర్యమును పాలించుటచే ఆ ఱెండు బ్రహ్మాస్త్రాలనూ ఉపసంహరించ గలిగినాడు — ఇది నాకు కొత్తగా వుంది. అర్జునుడు అస్ఖలితబ్రహ్మచారి ఎలా అయ్యాడు?

 5. moralstories అంటున్నారు:

  శ్రీ కృష్ణుడు అస్ఖలిత బ్రహ్మచారి అని మేము కథలో వ్రాసాము. ఈ విషయము శ్రీమద్భాగవతములో ఎన్నో చోట్ల చెప్పబడి ఉన్నది.

  ఇక అర్జునుని విషయానికి వస్తే ఆయన బ్రహ్మచారి అన్న విషయం తెలుస్తుంది. దీనికి ప్రత్యక్ష నిదర్శనం అతడు తన యొక్క, అష్వత్థామ యొక్క బ్రహ్మాస్త్రాలను ఉపసంహరించ గలిగినాడు. బ్రహ్మచారి కానివాడు బ్రహ్మాస్త్రమును ఉపసంహరించలేడు. మహాభారతము లో కూడా ఈ సంగతి మనకు భీష్మ పితామహుని ద్వారా తెలుస్తున్నది. ఆయన ఒకానొక సందర్భములో పరుశురాములవారిపై వేసిన బ్రహ్మాస్త్రమును ఉపసంహరించ గలిగినాడు. ఇలా చేయుటకు ఆయనకు శక్తి బ్రహ్మచర్యం వలనే వచ్చినది.

  ——–
  SrI kRShNuDu askhalita brahmacAri ani mEmu kathalO vrAsAmu. I viShayamu SrImadbhAgavatamulO ennO cOTla ceppabaDi unnadi.

  ika arjununi viShayAniki vastE Ayana brahmacAri anna viShayam telustuMdi. dIniki pratyakSha nidarSanam ataDu tana yokka, ashvatthAma yokka brahmAstrAlanu upasaMhariMca galiginADu. brahmacAri kAnivADu brahmAstramunu upasaMhariMcalEDu. mahAbhAratamu lO kUDA I saMgati manaku bhIShma pitAmahuni dvArA telustunnadi. Ayana okAnoka saMdarbhamulO paruSurAmulavAripai vEsina brahmAstramunu upasaMhariMca galiginADu. ilA cEyuTaku Ayanaku Sakti brahmacaryaM valanE vaccinadi.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: