విష్ణుచిత్తుని అతిథిసేవ

(vishnuchittuniatithiseva.pdf)

శ్రీకృష్ణదేవరాయ కృత ఆముక్తమాల్యద లోని కథ

అది కలియుగం ప్రారంభమైన 46వ సంవత్సరం (శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారి పరిశోధన ప్రకారం సుమారు 5000 యేళ్ళ క్రితం). పాండ్యదేశంలో శ్రీవల్లిపుత్తూరు అనే భవ్యనగరం ఉండేది. ఆ నగరం మింటినంటే మేడలతో హంసల క్రీంకారాలు ధ్వనించే కొలనులతో బాతులకు ఆశ్రయమైన కాలువలతో ఉద్యానవనాలతో మామిడి పనస అరిటి మెదలైన తోటలతో అతి రమణీయంగా ఉండేది. నాలుగు వర్ణస్థులు సుఖ శాంతులతో ఉండేవారు. ఆ ఊరి స్త్రీలు మేనికి పసుపు పూసుకుని చెరువులో స్నానమాడి ఆ ఊరి దేవుడైన శ్రీ మన్నారు కృష్ణస్వామి అభిషేకానికై బిందెలలో నీళ్ళు తీసుకొని పూజకు కలువలు కోసుకొనిపోయేవారు. గ్రంథాలను ప్రబంధాలను చదువుకుంటూ కాలక్షేపం చేశేవారు.

ఆ ఊరి ప్రజలు అతిథి కనబడగానే సాష్టాంగనమస్కారం చేసేవారు. స్వాగతం చెప్పి అతిథికి అర్ఘ్యపాద్యాదులిచ్చి సేద తీర్చేవారు. టెంకాయఆకుల చాపపై కూర్చోబెట్టి విశాలమైన అరటి ఆకు పఱచి భోజనం పెట్టేవారు. రాజనపు వరి అన్నం పప్పు నెయ్యి ఎన్నోరకాల కూరలు పాలు పెరుగు ఇచ్చేవారు. అతిథి తృప్తిగా భుజించిన తరువాత తాంబూలమిచ్చి పాదసేవ చేసేవారు. అతిథి “వెళ్ళి వస్తాను” అనగానే శక్తికొలది అతని సత్కరించి కొంత దూరం అతనితో నడచి అతనిని సాగనంపేవారు. సేవ చేయటానికి అంత కొంచం అవకాశం దొరికిందని విచారిస్తూ తిరిగి వచ్చేవారు. ఈ విధముగా అతి శ్రద్ధతో ప్రతిదినమూ అతిథి అభ్యాగతుల సేవ చేసేవారు ఆ ఊళ్ళోని గృహస్థులు.

అలాంటి ఉన్నత జీవనం సాగిస్తున్న శ్రీవల్లిపుత్తూరు ప్రజల మధ్యలో గరుత్మంతుడి అంశతో భట్టనాథుడనే భాగవతోత్తముడు జన్మించినాడు. అతడు సమవర్తి స్థితప్రజ్ఞుడు. కష్టసుఖాలను లెక్కించేవాడు కాడు. భట్టనాథుడు నిత్యం తులసిమాలలు చెంగల్వదండలు కట్టి మన్నారు కృష్ణస్వామికి సమర్పించేవాడు. దేవాలయంలో ఉన్న వటపత్రశాయిని సేవించడం అతని నిత్యకృత్యమ్. ఏమి విద్యలూ అభ్యసించకపోయినా జ్ఞానం వైరాగ్యం కలిగి ఉండేవాడు. ఎల్లప్పుడూ విష్ణువునే ధ్యానిస్తూ ఉండేవాడు. అతని నిష్కల్మష భక్తికి మెచ్చి శ్రీహరి అతని హృదయంలో ఎల్లప్పుడూ నివసించేవాడు. అందుకనే భట్టనాథునికి విష్ణుచిత్తుడనే సార్థకనామధేయం వచ్చింది.

“మానవ సేవే మాధవ సేవ భవతరణానికి నావ” అనే సూక్తిని త్రికరణ శుద్ధిగా నమ్మినవాడు విష్ణుచిత్తుడు. అతడు ఎంతో భక్తితో అతిథిని సేవించి సేద తీర్చేవాడు. వానాకాలంలో వరి అన్నం పప్పు నాలుగైదు కూరలు వరుగులు వడియాలు పెరుగు మొదలైన వాటితో అన్నం పెట్టేవాడు.

వేసవిలో ముందుగా అతిథికి శ్రీచందనం ఇచ్చేవాడు. తాపంతీరిన అతిథికి వేడి అన్నం తియ్యని చారు మజ్జిగ పులుసు చెఱుకురసం లేత టెంకాయనీళ్ళు భక్ష్యాలు ఫలాలు సుగంధభరితమైన చల్లని నీళ్ళు వడపిందెలు మజ్జిగ మొదలైన వాటితో విందు చేసేవాడు.

శీతాకాలంలో పునుగు వాసనగల రాజనపు అన్నం మిరియపుపొడి వేడి వేడి కూరలు ఆవపచ్చళ్ళు పాయసం ఊరగాయలు వేడిగావున్న నెయ్యి పాలు మెదలైనవాటినిచ్చి అతిథిని సంతృప్తి పఱచేవాడు.

ఈతడు ఎంతటి భక్తుడంటే ఏ విద్యలూ నేర్వకుండానే ఆ దేశపురాజైన వల్లభదేవునికి నారాయణుని పరతత్త్వం బోధించగలిగినాడు. సాక్షాత్కరించిన విష్ణువుకి తన దృష్టి తగులుతుందేమో నని పరమాత్మకే మంగళశాసనం చేశాడు! గోదాదేవిని శ్రీహరికి కన్యాదానం చేసి లోకనాథునికే మామ అయినాడు.

పిల్లలూ! ఈ కథలోని నీతులను మరొక్కమాఱు చూద్దామ్:

  1. ఏ కాలానికి హితమైన ఆహారము ఆ కాలంలో అతిథికి ఇచ్చి అద్వితీయ అతిథిసేవ చేసి మనకు మార్గదర్శి అయినాడు పరమ భక్తుడైన విష్ణుచిత్తుడు.
  2. ప్రపంచం ఇంకా కన్నువిప్పనినాడే అన్ని రంగాలలో అగ్రశ్రేణిలో ఉండదగిన శ్రీవల్లిపుత్తూరు వంటి నగరాలు ఎన్నెన్నో మన దేశంలో! ఆధ్యాత్మికతలోనే కాక నాగరిక జీవనంలో కూడా ప్రపంచానికి గురువై బోధించిన భారతదేశంలో పుట్టిన మనం అదృష్టవంతులమ్.

Search Terms: Vishnuchitta, Bhattanatha, Bhattanaatha, Shri valli puttur, Mannaaru Krishnasvaami, Periyalvar, Periyaalvaar, Godadevi, Andal

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: