శ్రీమద్భాగవతములోని కథ
(ఈ కథ యొక్క ఉత్తర భాగము)
(PDF)
చిన్నికృష్ణుడు గోపబాలురతో కలిసి ఎన్నో విచిత్రమైన ఆటలు ఆడేవాడు. “మీరందఱూ గోవులు నేను ఆబోతును” అంటూ ఆబోతులాగా రంకెలు వేస్తూ పరుగులెట్టేవాడు. “నేను రాజును మీరు భటులు” అంటూ అధికారం చూపుతూ వారికెన్నో పనులు చెప్పి చేయిస్తూ ఉండేవాడు. మూలమూలలా దాక్కొని దాగుడుమూతలాడే వాడు. అందఱితో కలిసి ఉయ్యాలాటలు, చేబంతులాటలు ఆడేవాడు. ఆహా! కఠోర నిష్ఠాపరులైన సంయమీద్రులకు సైతం అందని పరంధాముడు గోపబాలురతో కలిసి ఆటలాడుటకు వారెంత పుణ్యము చేసినారో!
ఒకరోజు కన్నయ్య ఆటకని బయలుదేరాడు. ఒకానొక గోపిక ఇంటిలోనికి వెళ్ళాడు. ఆ ఇంటి కోడలు నిద్రపోతూ ఉన్నది. బాలకృష్ణుడు వాళ్ళ ఇంట్లో ఉన్న పెరుగంతా త్రాగివేశాడు. వెళ్ళేవాడు వెళ్ళకుండా నిద్రిస్తున్న ఆ కోడలి మూతికి కొంచెం పెరుగు వ్రాసి వెళ్ళిపోయాడు. పెరుగంతా తానే తినివేసిందని భ్రమసి అత్తగారు కోడలిని కొట్టింది. ఆ అల్లరిపని లోని ఆంతర్యం గ్రహించలేక యశోదతో శ్రీకృష్ణుని గురించి ఇలా చెప్పుకుంది ఓ గొపిక
ఆడం జని వీరల పెరుఁ
గోడక నీ సుతుఁడు ద్రావి యొకయించుక తాఁ
గోడలి మూఁతిం జరిమినఁ
గోడలు మ్రుచ్చనుచు నత్త గొట్టె లతాంగీ!
పిల్లలూ! మరి జగద్గురువైన శ్రీ కృష్ణుడు ఈ కథ ద్వారా ఏమి బోధించాలనుకున్నాడో తెలుసుకుందామా?
ఈ సన్నివేశము జరిగిన సమయం రాత్రి కాదు. పైగా అది శ్రీకృష్ణుడు ఆటకై బయలుదేరిన సమయం కాబట్టి మనుషులు బాగా మేల్కొని ఉండి శ్రమించి తమ కర్తవ్యాలు నిర్వహించ వలసిన సమయం. అట్టి ఉపయోగకరమైన వేళలో ఆ ఇంటి కోడలు నిద్రించుట కృష్ణపరమాత్మకు నచ్చలేదు. అందుకనే ఆ విధంగా కోడలిని శిక్షించినాడు. ప్రకృతి నియమానుసరముగా లభ్యమైన సమయమును వృధా చేయకుండా నిరంతరం సత్కర్మలను చేయాలన్నదే జగద్గురువైన శ్రీకృష్ణుని సందేశం.
4:35 అపరాహ్నం వద్ద జూన్ 6, 2008 |
[...] (ఈ కథ యొక్క ఉత్తర భాగము) [...]
8:59 అపరాహ్నం వద్ద ఆగష్టు 22, 2008 |
mee krushi chaala baagundi.kaani meeru inkaa enno kathalu vrayalannade maa korika.meeru inkaa enno nethi kathalu raayaali. mee website naaku chala baaga nacchindi.